నేడు అతిలోకసుందరి రెండో వర్ధంతి
on Feb 24, 2020
ఫిబ్రవరి 24 శ్రీదేవి రెండో వర్ధంతి. 2018లో ఇదే రోజు దుబాయ్‌లో ఒక పెళ్లికి హాజరై బాత్‌టబ్‌లో పడి ఆ అతిలోకసుందరి సుందరి మృతిచెందిన విషయం తెలిసిందే. ఆమె మరణం దేశంలోని ఫిల్మ్ ఇండస్ట్రీ అంతటినీ దిగ్భ్రాంతికి గురి చేసింది. ఆ వార్త తెలిసిన వెంటనే ఆమె అభిమానులకు గుండె ఆగినంత పనైంది. ఇక ఆమె భర్త బోనీ కపూర్, ఆమె కూతుళ్లు జాన్వి, ఖుషి పరిస్థితి అయితే ఎలా ఉండి ఉంటుందో ఊహించుకోవాల్సిందే.
దేశవ్యాప్తంగా శ్రీదేవి సంపాదించుకున్న పాపులారిటీ ఆమెకు ముందు, ఆమె తర్వాత మరొకరు సాధించలేదనేది వాస్తవం. శ్రీదేవి తొలి వర్ధంతికి ఆమెకు సంబంధించిన తీపి గుర్తులను బోనీ ఫ్యామిలీ నెమరువేసుకుంది. జాన్వి తన ఇన్‌స్టాగ్రాం హ్యాండిల్‌లో భావోద్వేగపూరితంగా రాసుకున్న మాటలు చిత్రసీమను కదిలించాయి.
ఆ సమయంలో శ్రీదేవి మారుటి కుమారుడు, బోనీ కపూర్ పెద్దకొడుకు అర్జున్ కపూర్ పెద్దరికం వహించి ఆ కుటుంబానికి అండగా నిలబడ్డాడు. "మా నాన్నకు ఒక మంచి కొడుకుగా ఉండటం నా విధి. అలాగే నాకు మరో ఇద్దరు చెల్లెల్లు ఉన్నారని గ్రహించాను. ఎంతో పెద్ద మనసుతో నా చెల్లెళ్లుగా పిలవడానికి వాళ్లు అంగీకరించారు" అని ఎమోషనల్ అయ్యాడు అర్జున్.
ఒక మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఆ విషాదం తమ కుటుంబాన్నంతా ఎలా ఒక్కటి చేసిందో జాన్వి తెలిపింది. "అర్జున్ అన్న, అన్షులా అక్క మాపై చూపించిన ప్రేమ, వాళ్లిచ్చిన సపోర్ట్ వల్లే మా జీవితంలో జరిగిన అత్యంత విషాద ఘటన సందర్భంగా నేను, ఖుషి బలంగా నిలవగలిగాం. కుటుంబంలోని గొప్పతనం అదే. ఇంతకంటే మంచి అన్న, అక్క కావాలని మేం అడగలేం. వాళ్లు మాకు చాలా బలాన్నిచ్చారు. అర్జున్ అన్న చాలా తెలివైనవాడు. 'నిజాయితీగా ఉండు, నువ్వు నువ్వులా ఉండు, మనుషులతో మర్యాదగా మెలగు' అని సలహాలిచ్చాడు. అతను చెప్పిన ఆ మాటల్ని తూచా తప్పకుండా పాటించాలని నిర్ణయించుకున్నాను" అని చెప్పింది జాన్వి.
శ్రీదేవి ఫ్యామిలీ ఫొటోలు:
1. శ్రీదేవిని ముద్దాడుతున్న బోనీ కపూర్
2. భర్త బోనీ, చిన్నకూతురు ఖుషీతో శ్రీదేవి
3. క్రిస్మస్ ట్రీస్ దగ్గర శ్రీదేవి, బోనీ
4. చిన్నప్పటి జాన్వి, శ్రీదేవి
5. శ్రీదేవి, బోనీ, చిన్నారి జాన్వి
6. జాన్వి సమక్షంలో శ్రీదేవికి బోనీ ముద్దు
7. శ్రీదేవి, బోనీ ఆనంద క్షణాలు
8. భర్త, పిల్లలతో శ్రీదేవి
9. మీడియా కాన్ఫరెన్స్‌లో కెమెరా ముందు భర్త, పిల్లలతో శ్రీదేవి
10. చిన్నారి జాన్వితో శ్రీదేవి