'భక్త కన్నప్ప' కోసం మంచు విష్ణు రూ. 60 కోట్ల బడ్జెట్!
on Feb 22, 2020
బాపు దర్శకత్వంలో కృష్ణంరాజు టైటిల్ రోల్ పోషించిన 'భక్త కన్నప్ప' (1976).. ఒక క్లాసిక్ మూవీగా టాలీవుడ్ హిస్టరీలో నిలిచిపోయింది. ఆ సినిమాని ప్రభాస్ రీమేక్ చేస్తే చూడాలని కృష్ణంరాజు భావించారు. కానీ ప్రభాస్ మాత్రం ఎప్పుడూ దానిపై ఆసక్తి చూపలేదు. కొన్నేళ్ల క్రితం రచయిత, నటుడు తనికెళ్ల భరణి తాను కన్నప్ప స్క్రిప్టు తయారు చేశాననీ, అందులో సునీల్ హీరోగా నటిస్తున్నాడని కూడా ప్రకటించారు. ఆయనది బాపు సినిమా రీమేక్ కాదు. సొంతంగా రాసుకున్న స్క్రిప్టు. అయితే సునీల్‌తో ఆ సినిమా తియ్యాలన్న భరణి ఆశలు నెరవేరలేదు. సునీల్‌పై భారీ బడ్జెట్ పెట్టడానికి నిర్మాతలు వెనుకంజ వేశారు. దాంతో చాలా కాలం నిరీక్షించిన భరణి ఆ ప్రాజెక్ట్ ఆశలు వదిలేసుకున్నారు. కానీ ఆ ప్రాజెక్టును మంచు విష్ణు టేకప్ చేశాడు.
ఇప్పుడు మోహన్ బాబు ఆ ప్రాజెక్టుపై తొలిసారి మాట్లాడారు. రూ. 60 కోట్ల భారీ బడ్జెట్‌తో ఆ సినిమా తీసేందుకు విష్ణు సిద్ధమవుతున్నాడని ఆయన వెల్లడించారు. మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా కాళహస్తిలోని శ్రీ కాళహస్తీశ్వర దేవాలయాన్ని దర్శించిన ఆయన అక్కడ మీడియాతో మాట్లాడుతూ ఈ విషయం చెప్పారు. శివునిపై ఆరాధనతో తన కళ్లను పెకలించుకోవడానికి కూడా వెనుకాడని పరమ శివభక్తునిగా కన్నప్ప గురించి కథలు ప్రచారంలో ఉన్నాయి. నాలుగేళ్లుగా ఈ ప్రాజెక్టుపై రచయితల బృందం పనిచేస్తోందని కూడా మోహన్ బాబు తెలిపారు. అయితే ఈ ప్రాజెక్టు విషయంలో విష్ణు నుంచి ఇంతవరకు అధికారిక ప్రకటన రాలేదు. కన్నప్పగా ఎవరు నటిస్తారు, ఎవరు ఆ సినిమాని డైరెక్ట్ చేస్తారనే విషయం కూడా ప్రస్తుతానికి సస్పెన్స్ గానే ఉంది. అతి త్వరలోనే ఈ సస్పెన్స్‌కు తెరపడనున్నది.