శ్రీసింహా 'భాగ్ సాలే' షూటింగ్ షురూ.. నిహారిక డైరెక్టర్ మెప్పిస్తాడా?
on Oct 25, 2021
ప్రముఖ సంగీత దర్శకుడు కీరవాణి తనయుడు శ్రీసింహ కోడూరి హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ 'భాగ్ సాలే'. 'మత్తు వదలరా', 'తెల్లవారితే గురువారం' చిత్రాల తర్వాత శ్రీ సింహ నటిస్తున్న మూడో చిత్రమిది. తాజాగా ఈ సినిమా షూటింగ్ ప్రారంభమైంది.
'భాగ్ సాలే' సినిమా షూటింగ్ ప్రారంభోత్సవం సోమవారం హైదరాబాద్ లోని రామానాయుడు స్టూడియోలో జరిగింది. నిర్మాత సురేష్ బాబు కెమెరా స్విచ్ఛాన్ చేయగా, డైరెక్టర్ హరీష్ శంకర్ ఫస్ట్ షాట్ కు క్లాప్ కొట్టారు. ఈ కార్యక్రమానికి కీరవాణి హాజరయ్యారు.
'భాగ్ సాలే' సినిమాకు ప్రణీత్ బ్రహ్మాండపల్లి దర్శకత్వం వహిస్తున్నారు. మెగా డాటర్ నిహారికతో 'ముద్దపప్పు ఆవకాయ', 'నాన్న కూచి' వంటి వెబ్ సిరీస్ లు చేసిన ప్రణీత్.. నిహారిక టైటిల్ రోల్ పోషించిన 'సూర్యకాంతం' సినిమాతో వెండితెరపై డైరెక్టర్ గా ఎంట్రీ ఇచ్చారు. ఆ సినిమాతో నిరాశపరిచిన ప్రణీత్.. ఇప్పుడు 'భాగ్ సాలే'తో అలరించేందుకు సిద్ధమయ్యారు.
సురేష్ బాబు సమర్పణలో బిగ్ బెన్ సినిమా, సినీ వ్యాలీ మూవీస్ సంస్థలు సంయుక్తంగా 'భాగ్ సాలే' చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. యష్ రంగినేని, శింగనమల కళ్యాణ్ నిర్మాతలు. కీరవాణి మరో తనయుడు కాలభైరవ సంగీతాన్ని అందిస్తున్నారు. జాన్ విజయ్, రాజీవ్ కనకాల, వెన్నెల కిషోర్, నందినీరాయ్ తదితరులు నటిస్తున్నారు.
Also Read