నటసింహ `శ్రీకృష్ణార్జున విజయము`కి పాతికేళ్ళు!
on May 15, 2021
`భైరవద్వీపం` వంటి సంచలన విజయం తరువాత నటసింహ నందమూరి బాలకృష్ణ - లెజెండరీ డైరెక్టర్ సింగీతం శ్రీనివాసరావు - స్వరకర్త మాధవపెద్ది సురేశ్ - నిర్మాణ సంస్థ చందమామ విజయా కంబైన్స్ - అందాల తారలు రోజా, రంభ - ఎడిటర్ డి. రాజగోపాల్ - రచయిత, నటుడు రావికొండల రావు తదితరుల కలయికలో వచ్చిన చిత్రం `శ్రీకృష్ణార్జున విజయము`. 1994 వేసవిలో విడుదలైన `భైరవద్వీపం` జానపద చిత్రంగా తెరకెక్కగా.. 1996 వేసవిలో జనం ముందుకొచ్చిన `శ్రీకృష్ణార్జున విజయము` పౌరాణిక చిత్రం కావడం విశేషం.
శ్రీకృష్ణుడిగా, అర్జునుడిగా బాలయ్య ద్విపాత్రాభినయం చేసిన ఈ చిత్రంలో ద్రౌపదిగా రోజా, అప్సరగా రంభ, రుక్మిణిగా ప్రియా రామన్, సత్యభామగా శ్రీకన్య, దుర్యోధనుడిగా శ్రీహరి, భీముడిగా విజయ రంగరాజు (`భైరవద్వీపం` మాంత్రికుడు), నారద మహర్షిగా నరేశ్, కర్ణుడిగా దగ్గుపాటి రాజా, శకునిగా ఏవీయస్, కుంతిగా కేఆర్ విజయ, హనుమంతుడిగా అర్జా జనార్థనరావు, ధృతరాష్ట్రునిగా మిక్కిలినేని, చిన్ని కృష్ణుడిగా మాస్టర్ బాలాదిత్య దర్శనమివ్వగా.. ఇతర ముఖ్య పాత్రల్లో శుభలేఖ సుధాకర్, రమాప్రభ, జయలలిత కనిపించారు.
భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ పౌరాణిక చిత్రం .. మాధవపెద్దికి `ఉత్తమ సంగీత దర్శకుడు`గా `నంది` పురస్కారాన్ని అందించింది. 1996 మే 15న విడుదలై నందమూరి అభిమానులను అలరించిన `శ్రీకృష్ణార్జున విజయము`.. నేటితో 25 వసంతాలను పూర్తిచేసుకుంది.