Home

»

Latest News

ప్రముఖ బాలీవుడ్ దర్శకుడి మృతి: బాత్ రూమ్ లో జరిగింది ఇదే.. ఫ్యాన్స్ షాక్!

Oct 31, 2026 2:57PM

 

బాలీవుడ్ చిత్ర పరిశ్రమలో పెను విషాదం చోటుచేసుకుంది. యాక్షన్, క్రైమ్ థ్రిల్లర్ సినిమాలకి పెట్టింది పేరైన ప్రముఖ నిర్మాత, దర్శకుడు సంజయ్ గుప్తా  కన్నుమూశారు.  గురువారం రాత్రి   ముంబైలోని తన నివాసంలోని బాత్రూమ్‌లో ప్రమాదవశాత్తూ జారిపడటంతో తలకి తగిలిన బలమైన గాయం కారణంగా తుదిశ్వాస విడిచినట్లు పోలీసులు, సన్నిహిత వర్గాలు ధ్రువీకరించాయి. 

శుక్రవారం ఉదయం ఈ ఘటన వెలుగులోకి రావడంతో ఒక్కసారిగా కలకలం రేగింది. సమాచారం అందుకున్న వర్సోవా పోలీసులు వెంటనే రంగంలోకి దిగి ఘటన స్థలాన్ని పరిశీలించారు. ప్రాథమిక విచారణ అనంతరం ప్రమాదవశాత్తూ జరిగిన మరణంగా నమోదు చేసినట్లు పోలీసులు స్పష్టం చేశారు. ఇప్పటివరకు జరిగిన విచారణలో ఎలాంటి అనుమానాస్పద పరిస్థితులు లేదా కుట్ర కోణం లేదని వారు తేల్చిచెప్పారు. అయినప్పటికీ, ఎంతో ప్రతిభావంతుడైన ఒక గొప్ప స్టోరీ టెల్లర్ ఇలా అనూహ్యంగా కన్నుమూయడం చిత్ర పరిశ్రమని కలిచి వేస్తుంది. దర్శకుడిగా సంజయ్ గుప్తా ప్రయాణం ఎంతో ప్రత్యేకమైనది. 1994లో సంజయ్ దత్, ఆదిత్య పంచోలి ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన 'ఆతిష్: ఫీల్ ది ఫైర్' చిత్రంతో దర్శకుడిగా తన కెరీర్‌ విజయవంతంగా ప్రారంభించారు. ఆ తర్వాత ముంబై అండర్‌వరల్డ్ నేపథ్యాన్ని, క్రైమ్ థ్రిల్లర్ కథలని అత్యంత స్టైలిష్‌గా తెరకెక్కించడంలో తనకంటూ ప్రత్యేకమైన బ్రాండ్  సృష్టించుకున్నారు. ముఖ్యంగా ఆయన కెరీర్‌లో 'కాంటే', 'షూటవుట్ ఎట్ లోఖండ్‌వాలా', 'షూటవుట్ ఎట్ వడాలా', 'ముసాఫిర్', 'జిందా', 'కాబిల్', 'జజ్బా', 'ముంబై సాగా' వంటి ఎన్నో సంచలన బ్లాక్‌బస్టర్ చిత్రాలను ప్రేక్షకులకు అందించారు. హృతిక్ రోషన్ హీరోగా వచ్చిన సెన్సేషనల్ హిట్ 'కాబిల్' చిత్రానికి కూడా దర్శకత్వం వహించడం విశేషం.


ఇది కూడా చదవండి: వివాదంలో ఆదర్శ కుటుంబం: నిర్మాత ఆవేదన!

కేవలం క్లాసిక్ సినిమాలే కాకుండా, మారుతున్న కాలానికి తగినట్లుగా ఓటీటీ ప్రేక్షకుల కోసం కూడా ఆయన పనిచేశారు. ఆయన చివరిసారిగా దర్శకత్వం వహించిన యాక్షన్ డ్రామా 'ది మిరాండా బ్రదర్స్' చిత్రం 2024లో జియోహాట్‌స్టార్ ఓటీటీ వేదికగా విడుదలై మంచి ఆదరణ పొందింది. స్వయంగా కథ సమకూర్చడంతో పాటు నిర్మాణ బాధ్యతలని  విజయవంతంగా నిర్వహించారు. ఇలా తన జీవితాంతం సినిమా పరిశ్రమతోనే ప్రయాణం చేసిన సంజయ్ గుప్తా అకస్మాత్తుగా మరణించడంతో సినీ ప్రముఖులు తీవ్ర సంతాపం వ్యక్తం చేస్తున్నారు.

 

ఆయన ఆప్తమిత్రుడు, ప్రముఖ ఫిల్మ్ మేకర్ అశోక్ పండిట్ సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ.. ఇంట్లో తలకు గాయం కావడంతో సంజయ్ గుప్తా మరణించారనే వార్త తనను తీవ్రంగా దిగ్భ్రాంతికి గురిచేసిందని భావోద్వేగానికి లోనయ్యారు. ఎంతో ఉత్సాహంగా ఉండే అద్భుతమైన స్టోరీ టెల్లర్‌ను ఇండస్ట్రీ కోల్పోయిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. రాకేష్ రోషన్‌తో పాటు పలువురు బాలీవుడ్ ప్రముఖులు నివాళులు అర్పిస్తూ ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. భార్య అను లేఖీతో పాటు కుటుంబ సభ్యులు, అభిమానులను శోకసంద్రంలో ముంచెత్తిన సంజయ్ గుప్తా ఆకస్మిక మరణం బాలీవుడ్ చరిత్రలో ఎప్పటికీ తీరని లోటుగా మిగిలిపోతుంది. అయన వయసు 59 సంవత్సరాలు. 

 

 

 

[Sanjay Gupta Passes Away, Sanjay Gupta death, Bollywood director, bathroom slip accident, Sanjay Gupta movies, Shootout at Lokhandwala,Tollywood Cinema News, Tollywood, Telugu Cinema, Telugu Cinema News ]

 

 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com