రాక్‌స్టార్ దేవిశ్రీ ప్రసాద్ అంటే అదిరిపోయే మాస్ బీట్స్, వినసొంపైన మెలోడీలు, జానపద శైలిలో సాగే పాటలు గుర్తొస్తాయి. తన సంగీతంతో ఎన్నో సినిమాలను విజయాల బాట పట్టించిన ఆయన ఇప్పుడు నటుడిగా కూడా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ‘బలగం’ సినిమాతో దర్శకుడిగా సంచలనం సృష్టించిన వేణు యెల్దండి తెరకెక్కిస్తున్న ‘ఎల్లమ్మ’ చిత్రంలో దేవిశ్రీ ప్రసాద్ హీరోగా నటిస్తున్నారు. ఈ సినిమాకు ఆయనే సంగీతాన్ని కూడా అందిస్తున్నారు. తాజాగా ఈ చిత్రం కోసం డీఎస్పీ చేసిన ఓ వినూత్న ప్రయోగం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన 100 మంది జానపద వాద్య కళాకారులతో ‘ఎల్లమ్మ’ టైటిల్ సాంగ్‌ను రికార్డ్ చేయించారు.
ప్రస్తుతం సినిమా పాటల రికార్డింగ్‌లో కంప్యూటర్ బీట్స్, ఆధునిక సంగీత పరికరాల వినియోగం ఎక్కువగా కనిపిస్తోంది. అయితే ‘ఎల్లమ్మ’ కథా నేపథ్యానికి తగ్గట్టుగా సహజమైన జానపద సంగీతాన్ని ప్రేక్షకులకు అందించాలనే ఉద్దేశంతో డీఎస్పీ ఈ ప్రత్యేక ప్రయత్నం చేసినట్లు తెలుస్తోంది. దేశంలోని భిన్న ప్రాంతాలు, సంస్కృతులకు ప్రాతినిధ్యం వహించే వంద మంది సంప్రదాయ జానపద రిథమ్ కళాకారులను ఒకే చోటుకు తీసుకొచ్చి వారితో లైవ్‌లో పాటను రికార్డ్ చేశారు. వివిధ ప్రాంతాల జానపద వాయిద్యాల దరువులు ఒకే పాటలో వినిపించబోతుండటం ఈ టైటిల్ సాంగ్ ప్రత్యేకతగా నిలవనుంది. త్వరలోనే ఈ పాటను ఫస్ట్ సింగిల్‌గా విడుదల చేయనున్నట్లు చిత్రబృందం ప్రకటించింది.
ఇప్పటికే ‘ఎల్లమ్మ’ ఫస్ట్ లుక్, టైటిల్ గ్లింప్స్ ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచాయి. ఈ సినిమాలో దేవిశ్రీ ప్రసాద్ ‘పర్షి’ అనే పాత్రలో కనిపించనున్నారు. సంగీత దర్శకుడిగా ఎన్నో విజయవంతమైన పాటలను అందించిన ఆయన, ఇప్పుడు హీరోగా ఎలా మెప్పిస్తారన్నది ఆసక్తికరంగా మారింది. ఈ చిత్రానికి వేణు యెల్దండి కథ, దర్శకత్వం అందిస్తున్నారు. ‘బలగం’లో తెలంగాణ గ్రామీణ జీవితం, కుటుంబ బంధాలు, మనుషుల మధ్య అనుబంధాలను హృద్యంగా చూపించిన వేణు.. ఇప్పుడు ‘ఎల్లమ్మ’తో మరోసారి పల్లె నేపథ్యంలో సాగే భావోద్వేగ కథను ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. ఈ సినిమాకు డీఎస్పీ సంగీతం కూడా తోడవడంతో పాటలపై ప్రత్యేక అంచనాలు ఏర్పడ్డాయి.
శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్ రాజు సమర్పణలో శిరీష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. హన్షిత రెడ్డి, హర్షిత్ రెడ్డి కూడా నిర్మాణంలో భాగస్వాములుగా వ్యవహరిస్తున్నారు. మురళి జి సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. ‘ఎల్లమ్మ’ చిత్రాన్ని 2027 మార్చి 5న ప్రపంచవ్యాప్తంగా తెలుగు, తమిళం, హిందీ, మలయాళం, కన్నడ భాషల్లో విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. మరి వంద మంది జానపద కళాకారుల దరువులతో డీఎస్పీ రూపొందించిన ఈ టైటిల్ సాంగ్ ఎలాంటి సంచలనం సృష్టిస్తుందో చూడాలి.
[Devi Sri Prasad, DSP, Yellamma Movie, Yellamma Title Song, Venu Yeldandi, Dil Raju, 100 Folk Artists, Telugu Movies 2027]






