ఆకలేసిందో.. బోర్ కొట్టిందో కాని… ఆ హీరో తన ప్యాంట్ తానే తినేశాడు!
on Jun 1, 2017
కొందరు హీరోలు న్యూస్ లో వుండటానికి పెద్దగా కష్టపడనక్కర్లేదు! ఏంటి నమ్మరా? అయితే, మీకు సల్మాన్ జీన్ ప్యాంటు పోగుల కథ చెప్పాల్సిందే! ట్యూబ్ లైట్ అనే సినిమాతో జనం ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నాడు సల్లూ మియా. ఈద్ సందర్భంగా రానున్న ఆ సినిమా ప్రమోషన్ కోసం మీడియా ముందుకొచ్చాడు. అయితే, ఒకప్పుడు ఫుట్ పాత్ మీద పడుకున్న వారి పైకి కార్ ఎక్కించాడనీ, ఐష్ ని కొట్టాడనీ, జింకల్ని వేటాడనీ… ఇలాంటి సీరియస్ న్యూస్ ల కారణంగా చర్చల్లో వున్న సల్మాన్ ఇప్పుడు పూర్తిగా మారిపోయాడు! కేవలం తన జీన్స్ ప్యాంటు చిరుగులోంచి రెండు దారపు పోగులు తీసుకుని నోట్లో పెట్టుకున్నాడు! అంతే… సోషల్ మీడియా వెర్రిక్కిపోయింది! సల్మాన్ ట్రెండ్ అయ్యాడు! ట్యూబ్ లైట్ సినిమాకి కూడా ప్రచారం దొరికింది!
ఇంతకీ… మ్యాటర్ ఏంటంటే… తన సినిమా పబ్లిసిటీ కోసం మీడియా కెమెరాల ముందుకొచ్చిన సల్మాన్ కావాలనో, ఏమీ తోచకపోవటం వల్లో తాను వేసుకున్న జీన్స్ చిరుగులపై దృష్టి పెట్టాడు. ఇప్పుడు చినిగిపోయినవి వేసుకోటమే ట్రెండ్ కాబట్టి అదేం పెద్ద విశేషం కాదు. కాని, తొడ మీదున్న ప్యాంట్ చిరుగుల్లోంచి ఒకటి తరువాత ఒకటి దారపు పోగుల్ని లాక్కొని నోట్లో పెట్టుకున్నాడు బజ్రంగీ భాయ్ జాన్! అక్కడే వున్న మీడియా అదంతా క్యాప్చర్ చేసేసింది! వెంటనే సంగతంతా ట్విట్టర్ కి చేరింది. ఇంకేముంది… ట్విట్టర్ యూజర్లు సల్మాన్ జీన్స్ ప్యాంట్ తినేస్తున్నాడని గోలగోల చేసేశారు!
ఒకరు తినగలిగే జీన్స్ కనుగొన్న సల్మాన్ అంటూ చమత్కరిస్తే… మరొకరు బీఫ్ తినటం పై చర్చ కాదు సల్మాన్ జీన్స్ ప్యాంట్ తినేయటంపై చర్చ చేయాలి అన్నారు! ఇంకొకరు దారం పోగులు కింద పడకుండా సల్మాన్ తినేస్తున్నాడనీ.. అది స్వచ్ఛ్ భారత్ అని కామెడీ చేశారు! ఇక కొందరేమో… రంజాన్ నెల కదా ఆకలి అవుతుండటంతో సల్మాన్ ప్యాంటు తినేశాడని సెటైర్ వేశారు! ఏది ఏమైనా, మనోడికి మంచి సుడీ వుంది! ఏం చేసినా ఫ్రీ పబ్లిసిటీ మాత్రం వస్తూనే వుంది కండల వీరుడికి సంవత్సరాలుగా!