సాయి పల్లవికి ఈ హీరో అయినా కలిసొస్తాడా..?
on Oct 17, 2016
ప్రేమమ్ సినిమా మలయాళంలో ఎంత పెద్ద హిట్ అయిందో చెప్పనక్కర్లేదు. ఇక ఆసినిమాలో మలార్ పాత్రలో నటించిన సాయి పల్లవి నటనకు అయితే అందరూ ఫిదా అయిపోయారు. ఆ తరువాత ఆమెకు ఆఫర్లు బాగానే వరుస కట్టాయి. కానీ వచ్చిన చిక్కల్లా.. ఆఫర్లు వస్తున్నట్టే వస్తున్నాయి కానీ.. ఆఖరికి చేజారిపోతున్నాయి. ఇటీవలే ప్రఖ్యాత దర్శకుడు మణిరత్నం దర్శకత్వంలో నటించే అవకాశం వచ్చినట్లే వచ్చి చేజారి పోయింది. ఇక కార్తీకి జంటగా కాట్రు వెలియిడై చిత్రంలో నటించాల్సింది. చివరి క్షణంలో బాలీవుడ్ భామ అతిథిరావు వచ్చి చేరింది. దీంతో నిరాశలో ఉన్న సాయి పల్లవికి సెల్వరాఘవన్ రూపంలో మరో అవకాశం తలుపుతట్టింది. ప్రస్తుతం ఎస్‌జే.సూర్య హీరోగా నెంజం మరప్పదిల్లై చిత్రాన్ని తెరకెక్కిస్తున్న సెల్వరాఘవన్ తదుపరి సంతానం హీరోగా చిత్రం చేయడానికి రెడీ అవుతున్నారు. ఈ సినిమాలో సంతానం పక్కన నటించడానికి సాయి పల్లవిని సంప్రదించినట్టు తెలుస్తోంది. మరి ఈ అవకాశమైనా.. ఉంటుందా.. లేక చేజారిపోతుందా..? సాయి పల్లవి లక్ ఎంత ఉందో చూద్దాం..