పరాభవ భారంలో... ప్రకాష్‌రాజ్
on Oct 17, 2016
నటుడిగా ప్రకాష్‌రాజ్‌ది జాతీయ స్థాయి. జాతీయ ఉత్తమ నటుడిగా పలు అవార్డులు అందుకొన్న ఘనత ఆయనది. చాలా సినిమాల్ని ఆయన ఒంటి చేత్తో విజయ తీరాలకు చేర్చారు. విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా, ఓ మంచి తండ్రిగా, డాన్ గా.. ఎన్నో రకాలైన పాత్రలు పోషించాడు. ఇప్పుడు దర్శకుడిగా తన ప్రతాపం చూపించాలని విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాడు. ధోనీ ఓకే అనిపించినా, ఉలవచారు బిరియానీ అట్టర్ ఫ్లాప్ అయ్యింది. దసరాకి విడుదలైన మన ఊరి రామాయణం పరిస్థితీ అంతే. ఈసినిమాకి మంచి రివ్యూలొచ్చినా... థియేటర్లో జనం కనిపించలేదు. కనీసం మల్టీప్లెక్స్ లో అయినా ఈ సినిమా ఆడుతుందిలే అనుకొంటే.. అక్కడ కూడా పట్టుమని పదిమంది కూడా లేకపోవడం నిరాశ పరిచింది. ఆఖరికి పోస్టరు ఖర్చులూ రాలేదని టాక్. ఓపెనింగ్ వసూళ్లు చూసి ఖంగుతున్న ప్రకాష్‌రాజ్...
ఓ వీడియోని తన ట్విట్టర్ ద్వారా వదిలాడు. `మంచి సినిమాలు తీస్తే జనం చూడరన్న అపవాదు తొలగించండి` అని మొరపెట్టుకొన్నాడు. అయినా సరే.. జనం కదల్లేదు. ఈ ఫ్లాప్ తో ప్రకాష్ రాజ్ పునరాలోచనలో పడాల్సిన తరుణం వచ్చింది. ఎక్కడ తప్పు చేస్తున్నాడో తెలుసుకోవాల్సిన అవసరం ఏర్పడింది. మంచి సినిమాలు తీయొద్దని ఎవ్వరూ చెప్పరు. సినిమా తీసి `ఇది మంచి సినిమా` అని డప్పు కొట్టుకోవడం కూడా కరెక్ట్ కాదు. సినిమా మంచిదో కాదో, జనం చెప్పాలి. రాంగ్ టైమ్ లో సినిమాని విడుదల చేసి, ఫ్లాప్‌ని కొని తెచ్చుకొన్నాడని ఫిల్మ్‌నగర్ జనాలు చెబుతున్నారు. మరి ఇలాంటి తప్పుల్ని పునరావృతం కాకుండా జాగ్రత్త పడాల్సిన బాధ్యత అచ్చంగా ఈ నటుడిదే.