'సాహో' బాక్సాఫీస్: రూ. 100 కోట్లు దాటిన హిందీ వెర్షన్!
on Sep 4, 2019
ప్రభాస్ టైటిల్ రోల్ చేసిన 'సాహో' హిందీ వెర్షన్ రూ. 100 కోట్ల (నెట్) మార్కును దాటేసింది. టి-సిరీస్ రెలీజ్ చేసిన హిందీ 'సాహో' మంగళవారం రూ. 9.10 కోట్లను రాబట్టింది. ఫలితంగా 5 రోజుల్లో ఒక్క హిందీ వెర్షన్ వసూళ్లే రూ. 102.38 కోట్లకు చేరాయి. ఈ విషయాన్ని బాలీవుడ్ ట్రేడ్ విశ్లేషకుడు తరణ్ ఆదర్శ్ తన ట్విట్టర్ పేజీ ద్వారా వెల్లడించారు.
"5వ రోజు 'సాహో' వసూళ్లు డ్రాప్ అయ్యాయి. మాస్ ఏరియాల్లో వసూళ్లు బాగున్నాయి. నాలుగో రోజు పాక్షిక సెలవు దినం కావడంతో డబుల్ డిజిట్ కలెక్షన్స్ వచ్చాయి. మొదటి వారం రూ. 110 కోట్ల పైగా వసూళ్లపై దృష్టి. శుక్రవారం రూ. 24.40 కోట్లు, శనివారం రూ. 25.20 కోట్లు, ఆదివారం 29.48 కోట్లు, సోమవారం రూ. 14.20 కోట్లు, మంగళవారం రూ. 9.10 కోట్లు.. వెరసి రూ. 102.38 కోట్ల నెట్. ఇది హిందీ వెర్షన్ ఇండియా బిజినెస్." అని తరణ్ ఆదర్శ్ ట్వీట్ చేశారు.
కాగా 'సాహో' నిర్మాతలైన యు.వి క్రియేషన్స్ అధినేతలు తమ ట్విట్టర్ ఖాతా ద్వారా 'సాహో' ప్రపంచవ్యాప్త వసూళ్లను వెల్లడించారు. "ఈ ఏడాది భారతదేశపు బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్. 5 రోజులకు ప్రపంచవ్యాప్తంగా 'సాహో' ఏకంగా రూ. 350 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసింది" అని వాళ్లు షేర్ చేశారు.