మేడం టస్సాడ్స్‌లో శ్రీదేవి విగ్రహం
on Sep 4, 2019
దివంగత నటి, దేశవ్యాప్త సినీ ప్రియుల హృదయాల్లో అతిలోకసుందరిగా ముద్ర వేసుకున్న శ్రీదేవి మైనపు విగ్రహాన్ని బుధవారం సింగపూర్‌లోని మేడ టస్సాడ్స్ మ్యూజియంలో ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో కూతుళ్లు జాన్వి, ఖుషీలతో కలిసి నిర్మాత, శ్రీదేవి భర్త బోనీ కపూర్ పాల్గొన్నారు. ఆగస్ట్ 13 శ్రీదేవి పుట్టినరోజు సందర్భంలో మేడం టస్సాడ్స్ (సింగపూర్) ఒక ప్రకటన చేస్తూ, త్వరలో ఒక మైనపు విగ్రహాన్ని ఆమెకు అంకితం చేయనున్నట్లు ప్రకటించింది. ఇప్పుడు ఆ మాటల్ని వాస్తవ రూపంలోకి తీసుకు వచ్చింది. శేఖర్ కపూర్ రూపొందించిన బ్లాక్‌బస్టర్ ఫిల్మ్ 'మిస్టర్ ఇండియా'లోని 'హవా హవాయి..' పాటలో కనిపించిన శ్రీదేవి రూపంతో ఈ విగ్రహాన్ని తయారుచేయడం విశేషం.
ఆమెకు నివాళిగా, ప్రపంచవ్యాప్తంగా శ్రీదేవి అభిమానుల నుంచి సేకరించిన సందేశాలను ఈ కార్యక్రమంలో ప్రదర్శించారు. తల్లి విగ్రహాన్ని విచార వదనంతో చూస్తూ ఉండిపోయిన జాన్వి, విగ్రహానికి ధరింపజేసిన డ్రెస్‌ను దగ్గర్నుంచి పరిశీలించింది. ఈ సందర్భంగా బోనీ కపూర్ గద్గద స్వరంతో మాట్లాడుతూ "శ్రీదేవి కేవలం మా హృదయాల్లో మాత్రమే కాదు, మిలియన్ల సంఖ్యలో ఉన్న ఆమె అభిమానుల హృదయాల్లో ఎప్పటికీ జీవించే ఉంటుంది" అన్నారు.
గత ఏడాది ఫిబ్రవరిలో, దుబాయ్‌లో బాత్‌టబ్‌లో మునిగి శ్రీదేవి మృతి చెందిందనే వార్తతో చిత్రసీమతో పాటు దేశమంతా ఉలిక్కిపడుతూ నిద్రలేచింది. భర్త మేనకోడలి వివాహ వేడుకలో పాల్గొనడం కోసం ఆమె అక్కడికి వెళ్లారు. ప్రమాదవశాత్తూ అక్కడి హోటల్‌లోని బాత్‌టబ్‌లో పడి మరణించారు. అనంతరం ముంబైలో జరిగిన ఆమె అంత్యక్రియల్లో లక్షలాది మంది అభిమానులు కన్నీళ్లతో ఆమెకు శ్రద్ధాంజలి ఘటించారు.
Also Read