'దిశ' పేరు... నిందితుడి బిడ్డకు
on Feb 3, 2020
దిశ ఘటన గురించి ప్రత్యేకంగా వివరాలు చెప్పాల్సిన అవసరం లేదు. హైదరాబాద్ నగర శివార్లలో హైవే పక్కన జరిగిన ఘోరాన్ని ఎవరూ అంత త్వరగా మరువలేరు. దిశ హత్యాచారానికి ఒడిగట్టిన నిందితుల్లో చెన్నకేశవులు ఒకడు. ఇప్పుడు అతడి భార్య రేణుక గర్భవతి. పుట్టబోయే బిడ్డ అమ్మాయి అయినా... అబ్బాయి అయినా... ఆ బిడ్డకు 'దిశ' పేరు పెట్టాలని ఆమె నిర్ణయించుకున్నారని సంచలన దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ తెలిపారు. వార్తల్లో నిలిచిన అంశాలతో సినిమాలు తీసే వర్మ, 'దిశ' ఘటనపై సినిమా తీస్తున్నట్టు ప్రకటించారు. ఈ సినిమా విషయమై చెన్నకేశవులు భార్య రేణుకను కలిశారు. ఆమెతో మాట్లాడారు.
"చెన్నకేశవులను పెళ్లి చేసుకునేటప్పటికి రేణుక వయసు 16 సంవత్సరాలు. ఇప్పుడామె వయసు 17 సంవత్సరాలు. ఓ బిడ్డకు జన్మను ఇవ్వబోతోంది. దిశను మాత్రమే కాదు... (తెలుగులో రాయలేని పదాన్ని ఉపయోగించి తిడుతూ) వాడు కట్టుకున్న భార్యనూ బాధితురాల్ని చేశాడు. రేణుక, పుట్టబోయే బిడ్డకు భవిష్యత్తు లేకుండా చేశాడు" అని వర్మ ట్వీట్ చేశారు. తర్వాత కొన్ని గంటలకు "అమ్మాయి పుట్టినా... అబ్బాయి పుట్టినా... ఆ బిడ్డకు దిశ అని పేరు పెట్టబోతున్నట్టు నాకు రేణుక చెప్పింది" అని మరో ట్వీట్ చేశారు.