తోటి హీరోయిన్లపై కంగనా రనౌత్ సెటైర్లు
on Jun 10, 2020
‘‘అమెరికాలో జరుగుతున్న రాజకీయ, సాంఘిక ఉద్యమంలో భారతీయ చలనచిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖులు ఎందుకు భాగమవుతున్నారో? ఎందుకు మద్దతు పలుకుతున్నారో?? నాకు అసలు అర్థం కావడం లేదు’’ అన్నారు కంగనా రనౌత్. ఆఫ్రో–అమెరికన్ జార్జ్ ఫ్లాయిడ్ హత్యకు నిరసనగా అమెరికాలో ఆందోళనలు జరుగుతున్న సంగతి తెలిసిందే. జాత్యహంకార విద్వేష దాడులు, వర్ణ వివక్షకు వ్యతిరేకంగా జరుగుతున్న ఆ ఆందోళనలకు ప్రియాంకా చోప్రా, కరీనా కపూర్ ఖాన్ తదితరులు మద్దతు పలికారు. ఏ విషయంలోనైనా తన అభిప్రాయాన్ని నిర్మోహమాటంగా వెల్లడించే కంగనా రనౌత్, ఈ అంశంలోనూ తనదైన రీతిలో స్పందించారు.
‘‘అమెరికాలో ఆందోళలనల పట్ల స్పందిస్తున్న ప్రముఖులందరూ... మహారాష్ట్రలోని పాల్‌ఘర్‌లో సాధువులు ప్రయాణిస్తున్న కారుపై గ్రామస్తులు మూకుమ్మడిగా దాడికి తెగబడి, అందులో ఇద్దర్ని హత్య చేసినప్పుడు ఎందుకు మౌనంగా ఉన్నారు?’’ అని కంగనా రనౌత్ ప్రశ్నించారు. కనీసం ఎవరూ ఒక్క మాట కూడా మాట్లాడలేదని అమె అన్నారు. ‘‘పాశ్యాత్య దేశాల్లో ఘటనలపై స్పందించడం ఫ్యాషన్‌గా మారింది. బహుశా... దేశంలో ఘటన మెజారిటీ ప్రజల సెంటిమెంట్‌తో ముడిపడినది కాబట్టి మాట్లాడలేదేమో! ఫెయిర్‌నెస్ ప్రొడక్ట్స్‌కి ప్రచారం చేసే ప్రముఖులు సిగ్గు లేకుండా ఈ రోజు ‘నల్ల జాతి ప్రాణాలు ముఖ్యమే’ నినాదాలు ఇస్తున్నారు’’ అని హీరోయిన్లపై కంగనా రనౌత్ సెటైర్స్ వేశారు.