రావు రమేశ్ ఊహించని కాంట్రవర్సీ!
on May 30, 2020
ఒకప్పటి ప్రఖ్యాత టాలీవుడ్ విలన్ రావు గోపాలరావు తనయుడు, నేటి పాపులర్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ రావు రమేశ్ తనకు సోషల్ మీడియాలో అకౌంట్ లేదని తేల్చారు. సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ట్విట్టర్‌లో ఆయన పేరిట వచ్చిన ట్వీట్స్ సంచలనం కలిగించాయి. అది ఆయన అకౌంటేననీ, అవి ఆయన చేసిన ట్వీట్సేనని భావించి, అనేకమంది వాటిని లైక్ చేస్తూ, రిట్వీట్ చేస్తూ వచ్చారు. ఫర్ ఎగ్జాంపుల్.. ప్రజావేదిక కూల్చివేతపై స్పందించినట్లుగా, "మొదటి విధ్వంసం! చాలా బాధపడ్డా.. మన ఆంధ్రప్రదేశ్ ఎటు వెళ్తుందోనని. ఇప్పటికైనా మారతారని ఆశిస్తూ.. మీ రావు రమేశ్" అంటూ ఆయన పేరుతో వచ్చిన ట్వీట్ అయితే వైరల్‌గా మారింది.
అలాగే ‘‘పోలవరం ప్రాజెక్ట్ వైస్సార్‌సీపీ ప్రభుత్వం ఒక సంవత్సరంలో ఎంత పని చేశారో చెప్పండి?’’ అంటూ చేసిన ట్వీట్ సైతం కాక పుట్టించింది. అంతేకాదు, నిమ్మగడ్డ రమేశ్‌కుమార్‌ను తిరిగి రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా నియమించడానికి వీలుగా హైకోర్టు వెలువరించిన తీర్పుపై "Justice served on the right day" అనే మరో ట్వీట్ వచ్చింది. ఈ ట్వీట్లకు #1YearOfMassDestruction అనే హ్యష్‌టాగ్‌ను జోడించారు. ఇది వెరిఫైడ్ అకౌంట్ కాదు. పది రోజుల క్రితమే Actor Rao Ramesh పేరుతో ఈ అకౌంట్‌ను క్రియేట్ చేశారు.
తన పేరిట జరుగుతున్న ఈ ప్రచారం రావు రమేశ్ దృష్టికి వెళ్లింది. ఆయన సన్నిహితులు, స్నేహితులు ఈ ట్వీట్ల గురించి అడగడంతో ఆయన ఖంగుతిన్నారు. మొదట్నుంచీ సోషల్ మీడియాకు తాను దూరంగా ఉంటూ వస్తున్నాననీ, తన పేరిట వస్తున్న ట్వీట్స్ కానీ, ఇతర మెసేజ్‌లు కానీ ఫేక్‌వని ఆయన స్పష్టం చేశారు. బహుశా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్‌ను కించపరుస్తూ వచ్చిన ట్వీట్ల వల్ల సీరియస్ ట్రబుల్‌లో పడతానని ఆయన భావించి ఉండాలి. పరిస్థితులు తన చేజారిపోకముందే జాగ్రత్తపడటం మంచిదని భావించిన ఆయన, శనివారం ఒక ప్రకటన చేశారు. తన పేరిట సోషల్ మీడియాలో వస్తున్న ప్రకటనలకూ, తనకూ సంబంధం లేదనీ, అవి ఫేక్ అకౌంట్స్ అనీ స్పష్టం చేశారు.
"మీడియా మిత్రులకు, నన్ను , నా నటనను అభిమానించే ప్రతి ఒక్కరికీ...నాకు ఏ సోషల్ మీడియా లో ఏటువంటి అకౌంట్స్ లేవు, ఫేస్ బుక్ గానీ, ట్విట్టర్ గానీ , ఇన్ స్ట్రా గ్రామ్ ఇలా ఏమి లేవు..ఈ రోజు నా పేరు మీద ట్విట్టర్ లో పోస్టులు పెడుతున్నారు...ఆ పోస్టులు కు గానీ , ఆ అకౌంట్ కు గానీ నాకు ఏటువంటి సంబంధం లేదు.. దయచేసి వాటిని నమ్మకండి... ఏమైనా ఉంటే పత్రికా ముఖం గా నేనే తెలియజేస్తాను... త్వరలోనే నా పేరు మీద ఇలా చేస్తున్న వారి మీద పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టబోతు న్నాను. - మీ రావు రమేష్" అంటూ ఒక స్టేట్‌మెంట్ ఇచ్చారు.
నటనలో తండ్రికి తగ్గ తనయుడిగా గుర్తింపు తెచ్చుకున్న రావు రమేశ్, 'మగధీర' మూవీలో చేసిన పాత్రతో లైమ్‌లైట్‌లోకి వచ్చారు. 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' సినిమాలో చేసిన పాత్ర ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు తీసుకురావడమే కాకుండా డైరెక్టర్ల ఫేవరేట్ యాక్టర్ అయ్యేందుకు దోహదం చేసింది. అప్పట్నుంచి ఏడాదికి పదిహేను నుంచి ఇరవై సినిమాల వరకు ఆయన చేస్తూ వస్తున్నారంటే ఆయన డిమాండ్ ఏ రీతిలో ఉందో ఊహించుకోవచ్చు. ఇప్పటివరకూ కాంట్రవర్సిటీలకు దూరంగానే ఉంటూ వచ్చిన ఆయన ఇప్పుడు ఇలా వివాదంలో చిక్కుకోవడం గమనార్హం.
పది రోజుల క్రితమే తన పేరిట ట్విట్టర్‌లో అకౌంట్ క్రియేట్ అయినా, ఇప్పటివరకూ చేసిన ట్వీట్లు వివాదాస్పదమైనవి కాకపోవడంతో ఆయన పట్టించుకోలేదు. జూనియర్ ఎన్టీఆర్ బర్త్‌డే సందర్భంగా, తర్వాత నందమూరి తారకరామారావు జయంతి సందర్భంగా ఈ అకౌంట్ నుంచి ట్వీట్లు వచ్చాయి. వాటికి వేలల్లోనే లైక్స్, రిట్వీట్‌లు వచ్చాయి. అప్పుడు ఆ అకౌంట్ తనది కాదని ఆయన స్టేట్‌మెంట్ ఇవ్వలేదు. ఇప్పుడు కాంట్రవర్సీ ట్వీట్లు రావడంతో మేలుకొన్న ఆయన వాటిని ఖండించారు. అది తన అకౌంట్ కాదనీ, తన పేరిట దుష్ప్రచారం చేస్తున్న వారిపై కేసు పెడతాననీ అంటున్నారు. ఆ అకౌంట్ ఎవరు క్రియేట్ చేశారో త్వరలో తేలనున్నది.
రావు రమేశ్ పేరుతో ఉన్న ట్విట్టర్ అకౌంట్ అండ్ ట్వీట్స్