నాగశౌర్య.. ఆ డైరెక్టర్‌కి సరేనన్నాడు!
on May 30, 2020
‘అందాల రాక్షసి’ తర్వాత రాహుల్ రవీంద్రన్ హీరోగా నటించిన సినిమాల్లో చెప్పుకోతగ్గ చిత్రం ‘అలా ఎలా?’. వినోదం పండించే భారాన్ని ‘వెన్నెల’ కిశోర్ భుజాన వేసుకోవడంతో సినిమా నవ్వులు పండించింది. కథ కూడా బావుండడంతో మోస్తరు విజయం సాధించింది. ఆ చిత్రానికి అనీష్‌కృష్ణ దర్శకుడు. తర్వాత రాజ్‌తరుణ్ హీరోగా దిల్ రాజు ప్రొడక్షన్ హౌస్‌లో ‘లవర్’ తీశాడు. అది ఫ్లాప్! అయితే, అనీష్‌కృష్ణలో టాలెంట్ ఉంది. కామెడీ బాగా రాయగలడు. ఎమోషన్స్ తీయగలడు. అందుకని, అతడికి నాగశౌర్య ఛాన్స్ ఇస్తున్నాడని ఇండస్ట్రీ టాక్.
ఇటీవల నాగశౌర్యను కలిసిన అనీష్‌కృష్ణ రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ డ్రామా సబ్జక్ట్ ఒకటి చెప్పాడట. అందులో హీరో క్యారెక్టరైజేషన్, మరీ ముఖ్యంగా వినోదం నాగశౌర్యకు బాగా నచ్చాయట. దాంతో సినిమా చేయడానికి ఆసక్తిగా ఉన్నాడట. మూడు నాలుగు నెలలో సినిమా స్టార్ట్ చేద్దామని దర్శకుడితో చెప్పాడని సమాచారం. ఆల్రెడీ అనీష్‌కృష్ణ స్ర్కిప్ట్ వర్క్ కంప్లీట్ చేశాడట. లాక్‌డౌన్ ఎత్తేసిన తర్వాత ప్రస్తుతం నాగశౌర్య చేస్తున్న సినిమాలు చకాచకా పూర్తి చేస్తే... ఈ సినిమాను సెట్స్ మీదకు తీసుకువెళ్లాలని అనుకుంటున్నాడని తెలిసింది.