రానా వచ్చేశాడు! గాసిప్స్‌కు ఫుల్‌స్టాప్ పెట్టాడు!
on Nov 13, 2019
అనారోగ్య వదంతుల మధ్య అమెరికా నుంచి వచ్చిన, టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్‌లో ఒకడైన రానా దగ్గుబాటి.. కొద్ది రోజుల క్రితం సూపర్ స్టార్ మహేశ్ మేనల్లుడు అశోక్ గల్లా హీరోగా ఇంట్రడ్యూస్ అవుతున్న మూవీ లాంచ్ ప్రోగ్రాంలో దర్శనమిచ్చాడు. జూన్ 15న తన సినిమా 'విరాట పర్వం 1992' మూవీ ఓపెనింగ్‌లో కనిపించాక మళ్లీ అతడు పబ్లిక్‌లోకి వచ్చింది ఇప్పుడే. ఫుల్ బియర్డ్ లుక్‌లో నవ్వుతూ కనిపించాడు రానా. మనిషి బాగా సన్నబడిపోయాడనేది వాస్తవం. అయితే అనారోగ్య ఛాయలేమీ ఉన్నట్లు అతను కనిపించలేదు. హీరోగా ఎంట్రీ ఇస్తున్న అశోక్ గల్లాను ఫిల్మ్ ఇండస్ట్రీలోకి ఆహ్వానిస్తున్నట్లు హుషారుగా చెప్పాడు. రానా కనిపించిన తీరు చూస్తే, అతడి హెల్త్‌పై వచ్చిన ప్రచారమంతా గాసిప్పేనని అనిపించింది. ఆ ఈవెంట్ తర్వాత అతను తన సినిమాల గురించి ఆయా డైరెక్టర్లతో చర్చలు జరిపాడు. జూన్‌లో 'విరాట పర్వం' మూవీ ఓపెనింగ్ జరిగాక, ఆ సినిమా షూటింగ్‌లో ఇంతవరకు రానా పాల్గొనలేదు. ఈ లోగా రానా కాంబినేషన్ లేని సీన్స్ తీస్తూ వచ్చాడు డైరెక్టర్ వేణు ఊడుగుల.
ఆమధ్య పరకాల బస్ స్టేషన్‌లో హీరోయిన్ సాయిపల్లవిపై వేణు సన్నివేశాలు చిత్రీకరించిన విషయం సోషల్ మీడియాలో లీకైన విషయం గుర్తుండే ఉంటుంది. ఇంతకీ.. 'విరాటపర్వం' సెట్స్ పైకి రానా ఎప్పుడు వస్తాడు? డిసెంబర్ నెలలో అనేది సమాధానం. అప్పట్నుంచి వరుసగా అతడు పాల్గొనే సీన్స్ తియ్యడానికి డైరెక్షన్, ప్రొడక్షన్ టీమ్స్ రెండూ ప్లాన్ చేస్తున్నాయి. మానవ హక్కుల నేపథ్యంలో, 1990 తొలినాళ్ల కాలానికి సంబంధించిన కథతో తయారయ్యే ఈ సినిమాలో రానా విప్లవ భావాలున్న యువకుడిగా కనిపించనుండగా, డిగ్రీ స్టూడెంట్‌గా సాయిపల్లవి నటిస్తోంది. ఆ మూవీని 2020 సమ్మర్‌కు ప్రేక్షకుల ముందుకు తీసుకు రావాలనేది ప్రొడ్యూసర్ సురేశ్‌బాబు ప్లాన్. ఆ వెంటనే 'హిరణ్యకశిప' షూటింగ్ మొదలు పెట్టాలని ఆయన భావిస్తున్నాడు. మనకు తెలిసిన ప్రహ్లాదుడి కథను హిరణ్యకశిపుడి నేపథ్యం నుంచి రూపొందించేందుకు డైరెక్టర్ గుణశేఖర్ సిద్ధమవుతున్నాడు. భారీ బడ్జెట్‌తో, సౌత్-నార్త్ యాక్టర్లతో తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఈ సినిమాని నిర్మించేందుకు సురేశ్‌బాబు సన్నాహాలు చేస్తున్నారు. హిరణ్యకశిపుడిగా రానా నటించనున్నాడు. 'బాహుబలి'లో భల్లాలదేవాగా రానా ప్రదర్శించిన నటనకు ఇంప్రెస్ అయిన గుణశేఖర్.. అతనిని దృష్టిలో పెట్టుకొని తను ఎప్పట్నుంచో అనుకుంటున్న 'హిరణ్యకశిప' స్క్రిప్టును బయటకు తెచ్చారు.
ప్రస్తుతం ఆ మూవీకి సంబంధించిన ప్రి ప్రొడక్షన్ వర్క్ కూడా జరుగుతోంది. ఆ సినిమాకి అవసరమైన సెట్ డిజైనింగ్ ఇప్పటికే పూర్తయిందనీ, ఆ సెట్లను నిర్మించే పనులు జరుగుతున్నాయనీ తెలుస్తోంది. పౌరాణిక చిత్రం కాబట్టి సన్నివేశాలన్నీ దాదాపుగా ఇండోర్‌లోనే సెట్లలో తీయాల్సి ఉంది. నానక్‌రామగూడలో ఉన్న రామానాయుడు స్టూడియోస్‌లో ఈ సెట్స్ నిర్మాణం జరుగుతోంది. హిరణకశిపుని పాత్ర కోసం రానా బరువు పెరగాల్సి ఉంది. 'విరాట పర్వం' కోసం సన్నబడ్డ అతను, ఆ మూవీ షూటింగ్ పూర్తయ్యాక, బరువు పెరిగే పనిని చేపట్టనున్నాడు. అంతే కాదు.. ఇప్పటికే అతను, తెలుగు సహా వివిధ భారతీయ భాషల్లో హిరణ్యకశిపుడిపై వచ్చిన సినిమాలు చూసి, ఆ పాత్ర గురించిన అవగాహనను పెంచుకున్నాడు. అవన్నీ దశాబ్దాల క్రితం వచ్చినవే. అన్నింటిలోనూ పద్యాలు ఎక్కువగా ఉన్నాయి. ఇప్పటి జనరేషన్‌కు అవి అర్థమవడం కష్టం కాబట్టి అందరికీ అర్థమయ్యేలా డైలాగ్స్ సరళమైన భాషలో రాయిస్తున్నట్లు సమాచారం.
పౌరాణిక సినిమా అంటే షూటింగ్‌కు చాలా రోజులు పడుతుందని మనం ఊహిస్తాం. ఇంతకు ముందు వచ్చిన కాస్ట్యూం డ్రామాలు.. 'బాహుబలి', 'రుద్రమదేవి', 'సైరా' సినిమాల షూటింగ్‌కు ఎక్కువ రోజులే పట్టింది. అలా కాకుండా వీలైనంత తక్కువ పనిదినాల్లో 'హిరణ్యకశిప' షూటింగ్‌ను పూర్తి చెయ్యాలని సంకల్పించారు. ప్రి ప్రొడక్షన్ పనుల్ని పక్కాగా జరిపి, సరైన ప్లానింగ్‌తో షూటింగ్‌కు వెళ్లాలని యూనిట్ భావిస్తోంది. కంప్యూటర్ గ్రాఫిక్స్‌కు అత్యధిక ప్రాధాన్యం ఉండే కథ కాబట్టి, పోస్ట్ ప్రొడక్షన్‌కు ఎక్కువ సమయం పడుతుంది. మరోవైపు తను చేస్తున్న త్రిభాషా చిత్రం 'హాథీ మేరే సాథీ'కి తన పాత్రకు డబ్బింగ్ చెప్పేశాడు పూర్తి చేశాడు రానా. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఆ సినిమా విడుదలవుతోంది. అంటే మూడు భాషల్లో అతను డబ్బింగ్ చెప్పాడన్న మాట. 'హాథీ మేరే సాథీ', 'విరాటపర్వం 1992' సినిమాల విడుదలలు, 'హిరణ్యకశిప' షూటింగ్‌తో 2020లో యమ బిజీ కానున్నాడు రానా.
Also Read