నన్నెంతమంది ఇష్టపడుతున్నారో యాక్సిడెంట్‌తో తెలిసింది: డాక్టర్ రాజశేఖర్
on Nov 13, 2019
మంగళవారం అర్ధ రాత్రి దాటాక ఔటర్ రింగ్‌రోడ్‌పై కారు యాక్సిడెంట్‌కు గురై ప్రాణాలతో బయటపడ్డ సీనియర్ హీరో రాజశేఖర్ బుధవారం సాయంత్రం మీడియా ముందుకు వచ్చారు. తనకు ముక్కుపై అతి చిన్న గాయమవడం మినహా మరెలాంటి గాయాలూ కాలేదని చెప్పారు. తన క్షేమం కోరుకున్న వాళ్లందరికీ ధన్యవాదాలు తెలిపారు. రాజశేఖర్ ఏం చెప్పారో ఆయన మాటల్లోనే...
"పెద్ద యాక్సిడెంట్‌కు గురైనా అదృష్టవశాతూ ఆ దేవుడి దయవల్ల, ఎలాంటి గాయాలకూ గురి కాకుండా బయటపడ్డాను. బండి పల్టీలు కొట్టింది కాబట్టి బాడీ పెయిన్స్ ఉన్నాయి. ముక్కుపైన చిన్న దెబ్బ తగిలి రెండు వైపులా కొంచెం బ్లీడింగ్ అయింది. ముందు ఆ బ్లీడింగ్ ఎక్కడ్నుంచి వచ్చిందా.. అని అనుకున్నాం. అది తప్ప వేరే దెబ్బలు తగల్లేదు. ఇలాంటి ఘటన జరిగాక మనకి ఎంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు.. మనమంటే ఎంతమంది ఇష్టపడుతున్నారు.. ఎంతమంది లవ్ చేస్తున్నారు.. ఎంతమంది కంగారు పడుతున్నారు.. ఎంతమంది చూడాలని ఇంటికి వస్తున్నారు.. ఎంతమంది మెసేజ్‌లు పంపిస్తున్నారు.. అనేది తెలిసింది. ఇవన్నీ చూస్తుంటే.. నేను ఏదో కొంత సాధించానని తెలిసింది. వీళ్లందరి అభిమానం చూసి సంతోషమేసింది. మీ అందరికీ నేను రుణపడి ఉన్నాను. సినిమా ఇండస్ట్రీలోని వాళ్లమంతా ఒక ఫ్యామిలీ అని ఫీలవుతాం. కొంతమంది వయసై పోవడం వల్లనో, యాక్సిడెంట్ల మూలంగానో చనిపోతున్నారు. తాము చనిపోయిన తర్వాతైనా నలుగురూ వచ్చి తమని చూడాలని ఎవరైనా ఆశిస్తారు. కానీ ఎవరూ వచ్చి చూడకపోతే వాళ్ల ఆత్మలు ఘోషిస్తాయి. తెలిసినవాళ్లు ఎవరికైనా ఒంట్లో బాగోలేకపోతే వెళ్లి పరామర్శించండి. ఎవరైనా చనిపోయినప్పుడు వాళ్ల దినకర్మకైనా వెళ్లండని కోరుకుంటున్నా. ఎందుకంటే మనం రానురానూ పెద్దల్ని గౌరవించడం మర్చిపోతున్నాం. నేను బాగుండాలని కోరుకున్నవాళ్లకందరికీ నా నమస్కారం."