తమిళ సినిమాలకు సందీప్ కిషన్ టాటా... బైబై?
on Nov 13, 2019
సందీప్ కిషన్ తమిళ సినిమాలకు దూరం కానున్నాడు. తెలుగు సినిమాలపై ఫోకస్ చేయనున్నాడు. ఇకపై తమిళ సినిమాలు చేయకూడదనే నిర్ణయం తీసుకున్నాడు. దీని వెనుక బలమైన కారణాలు ఉన్నాయి. సందీప్ కిషన్ నటించిన మూడు తమిళ సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. కానీ, ఎప్పుడు విడుదల అవుతాయో తెలియని పరిస్థితి.
'డి 16' ఫేమ్ కార్తీక్ నరేన్ దర్శకత్వంలో ప్రముఖ దర్శకుడు గౌతమ్ మీనన్ నిర్మించిన 'నరగసూరన్'లో అరవింద్ స్వామి, శ్రియతో కలిసి సుందీప్ కిషన్ నటించాడు. గౌతమ్ మీనన్ ఆర్థిక సమస్యల వల్ల ఆ సినిమా విడుదల ఆగింది. అలాగే, తెలుగులో సందీప్ కిషన్ నిర్మించిన నిను వీడని నీడను నేనే' తమిళ వెర్షన్ 'కన్నాడి' కూడా ఇంకా విడుదల కాలేదు. ఆ సినిమా నిర్మాతలలో ఒకరైన విజి సుబ్రహ్మణ్యానికి ఫైనాన్షియర్లతో ఏవో సమస్యలు ఉన్నాయి. అలాగే, మరో సినిమా ఉంది. అందుకని, తమిళ సినిమాలు మానేసి పూర్తిగా తెలుగుపై దృష్టి పెట్టాలని సందీప్ కిషన్ ఫిక్సయ్యాడు.
"తమిళ సినిమా ఇండస్ట్రీలో పరిస్థితులు బాగోలేదు. కోలీవుడ్ బ్యాడ్ ఫేజ్ లో ఉంది. పెద్ద పెద్ద సినిమాలు విడుదలకు కష్టాలు ఎదురవుతున్నాయి. కొన్ని సినిమాల మార్నింగ్ షోలు క్యాన్సిల్ అవుతున్నాయి. నిర్మాతలు, ఫైనాన్షియర్లు, డిస్ట్రిబ్యూటర్ల మధ్య సంబంధాలు పూర్తిగా దెబ్బ తిన్నాయి. ప్రస్తుతం తమిళ సినిమా మంచి పొజిషన్ లో లేదు. తమిళంలో కొంచెం గుర్తింపు ఉంది కనుక సినిమాలు చేశా. ఇకపై తెలుగుపై ఫోకస్ చేస్తా" అని సందీప్ కిషన్ తెలిపాడు. పైగా తమిళ సినిమాలు చేస్తుంటే తెలుగు సినిమాలను వదిలేశానని అంటున్నారనీ, తాను ఎక్కడికి వెళ్లిన తెలుగు అబ్బాయినేననీ, తన ఫోకస్ అంతా తెలుగుపైనే ఉంటుందనీ సందీప్ కిషన్ చెప్పాడు.