'రాములో రాములా' పాట ఇరగదీసిందయ్యా!
on Oct 26, 2019
బన్నీ ఫ్యాన్స్ ఈగర్‌గా వెయిట్ చేస్తోన్న 'రాములో రాములా' సాంగ్ బయటకు వచ్చేసింది. త్రివిక్రమ్ డైరెక్షన్‌లో అల్లు అర్జున్ హీరోగా నటిస్తోన్న లేటెస్ట్ ఫిల్మ్ 'అల.. వైకుంఠపురములో' క్రేజ్ ఎలా ఉందో, ఫస్ట్ సింగిల్ 'సామజవరగమన' రిలీజైనప్పుడు స్పష్టమైంది. ఇప్పటివరకూ ఏ తెలుగు పాటకూ సొంతం కాని రికార్డుల్ని అతి స్వల్ప కాలంలో 'సామజవరగమన' సాధించిందని నిర్మాతలు నిర్మాతలు తెలిపారు. యూట్యూబ్‌లో రిలీజై నెల రోజులు తిరక్కముందే ఆ సాంగ్ 50 మిలియన్ వ్యూస్ సాధించి, మ్యూజిక్ లవర్స్ హృదయాలపై గట్టి ముద్ర వేసింది. నాలుగు రోజుల క్రితం రిలీజ్ చేసిన రెండో పాట 'రాములో రాములా' టీజర్‌కే 6 మిలియన్ వ్యూస్ పైగా వచ్చాయి. చెప్పినట్లే ఆ పాట పూర్తి వెర్షన్‌ను దీపావళి పండగ సదర్భంగా ఇప్పుడు రిలీజ్ చేశారు. 'రాములో రాములా' అనే లైన్ పల్లవిలో వచ్చే వరుస కాదని స్పష్టమైంది.
'సామజవరగమన' పాట తరహాలోనే లిరికల్ సాంగ్‌గా 'రాములో రాములా' సాంగ్‌ను రిలీజ్ చేశారు. అలాగే సింగర్స్ అనురాగ్ కులకర్ణి, మంగ్లీ పాడుతుండగా, తమన్ ఆర్కెస్ట్రా టీం లైవ్ పర్ఫార్మెన్స్ ఇస్తున్నట్లు ఈ సాంగ్ వీడియోలో చూపించారు. ఆ టీంలో ప్రఖ్యాత డ్రమ్మర్ శివమణి కూడా ఉండటం విశేషం. ఒక వైపు శివమణి డ్రమ్స్ వాయిస్తుంటే, మరోవైపు సంప్రదాయ దుస్తులు వేసుకున్న ఒక కళాకారుడు సన్నాయి వాయిస్తుండటం ముచ్చటగొల్పుతోంది. ఇదే వీడియోలో సాంగ్ మేకింగ్ దృశ్యాల్నీ మేళవించారు. డైరెక్టర్ త్రివిక్రమ్, ప్రొడ్యూసర్లు అల్లు అరవింద్, ఎస్. రాధాకృష్ణ, ఆర్టిస్టులు, సెట్స్‌పై ఉన్న మిగతా యూనిట్ మెంబర్స్ తమన్ బాణీలకు లయబద్ధంగా తలలు, భుజాలు ఆడిస్తూ కనిపించడం చూస్తుంటే.. ఈ పాట ఎంతగా వాళ్లను అలరించిందో తెలుస్తోంది.
పాట ప్రారంభంలో "ఏయ్ బ్రదర్ ఆపమ్మా.. ఈ డిక్చిక్ డిక్చిక్ కాకుండా మన మ్యూజిక్ ఏమైనా ఉందా?" అని మ్యుజీషియన్‌ను బన్నీ అడిగాడు. వెంటనే మోడరన్ లుక్‌లో ఉన్న ఒక యంగ్‌మ్యాన్ సన్నాయి వాయిస్తే, అది వింటూ "అబ్బా.. కడుపు నిండిపోయింది బంగారం" అని గుండె మీద చేయేసుకున్నాడు బన్నీ. "బంటూ గానికి ట్వంటీ టూ.. బస్తిల మస్తూ కటౌటూ.. బచ్చాగాండ్ల బ్యాచుండేది వచ్చినమంటే సుట్టూ" అంటూ సాంగ్ మొదలుపెట్టాడు. ఈ పాటలో తన మనసు దోచిన అమ్మాయిని అతను వర్ణించడం కనిపిస్తుంది. తమన్ ఇచ్చిన బాణీలకు తగ్గట్లు లిరిసిస్ట్ కాసర్ల శ్యాం చక్కని పదాల కూర్పుతో జానపద శైలితో పాటను అల్లితే, సింగర్ అనురాగ్ కులకర్ణి అంతే వినసొంపైన వాయిస్‌తో ఆ పాటకు జీవం పోశాడు. అతనికి ఫిమేల్ వాయిస్‌తో సింగర్ మంగ్లీ మంచి సపోర్ట్ ఇచ్చారు. హీరో తన అందచందాల్ని పొగుడుతుంటే హీరోయిన్ ఎలా రెస్పాండ్ అయ్యిందో మంగ్లీ తన జీర గొంతుతో పాడి ఆకట్టుకున్నారు. ఈ సాంగ్‌లో బన్నీతో పాటు హీరోయిన్ పూజా హెగ్డే, సుశాంత్-నివేదా పేతురాజ్ జంట, జయరాం-టబు జంట కూడా కనిపిస్తున్నారు.
మొదటి పాట 'సామజవరగమన' మెలోడీతో సంగీత ప్రియుల్ని అమితంగా అలరిస్తే, 'రాములో రాములా' పాట గ్రామీణ సంగీత మాధుర్యాన్ని చవిచూపిస్తోంది. అందుకే రిలీజ్ చేసిన కొద్ది క్షణాల్లోనే ఈ సాంగ్ వైరల్ అయిపోయింది. చూస్తుంటే.. 'అల.. వైకుంఠపురములో' ఆల్బంతో తమన్ 'మ్యూజిక్ డైరెక్టర్ ఆఫ్ 2019'గా నిలిచేటట్లే కనిపిస్తున్నాడు. మొదటి పాట 'సామజవరగమన' తరహాలోనే ఈ రెండో పాట 'రాములో రాములా' సాంగ్ బ్లాక్‌బస్టర్ హిట్టవడం ఖాయంగా కనిపిస్తోంది. మునుముందు విడుదలయ్యే పాటలతో సంక్రాంతికి రిలీజయ్యే సమయానికి 'అల.. వైకుఠపురములో' సినిమాకు ఏ స్థాయి క్రేజ్ వస్తుందనేది ఊహాతీతం. మొత్తానికి అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఈ పాటలతో పండగ చేసుకుంటున్నారు. దీపావళి కళ వాళ్ల ముఖాలపై బ్రహ్మాండంగా తాండవిస్తోంది.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
