'రూలర్'గా బాలయ్య చాలా కొత్తగా ఉన్నాడు!
on Oct 26, 2019
ఎక్స్‌ట్రీం క్యారెక్టరైజేషన్స్‌ను సూచించే టైటిల్స్ పెట్టడంలో నందమూరి బాలకృష్ణ తర్వాతే.. ఎవరైనా! ఇప్పటికే 'లెజెండ్', 'లయన్', 'డిక్టేటర్' టైటిల్స్‌ని తన సినిమాలకు పెట్టుకున్న ఈ 'టాప్ హీరో'.. లేటెస్టుగా 'రూలర్' అనే మరో పవర్‌ఫుల్ టైటిల్‌ని తెరపై ధరిస్తున్నారు. అవును. బాలకృష్ణ నటిస్తోన్న 105వ సినిమాకు 'రూలర్' అనే టైటిల్‌ను కన్‌ఫాం చేశారు. 2018 సంక్రాంతికి బాలయ్యను 'జై సింహా'గా ప్రేక్షకుల ముందుకు తెచ్చిన తమిళ సీనియర్ డైరెక్టర్ కె.ఎస్. రవికుమార్ ఇప్పుడు ఆయనను 'రూలర్'గా చూపించబోతున్నాడు.
శనివారం టైటిల్‌ను ప్రకటించడంతో పాటు, బాలయ్య పోలీస్ యూనిఫాంతో ఉన్న లుక్‌నూ రిలీజ్ చేశారు. వాన్ డైక్ బియర్డ్, కళ్లకు నల్లటి గాగుల్స్, షాగీ హెయిర్ కట్‌తో బాలయ్య చాలా డిఫరెంట్‌గా కనిపిస్తున్నారు. అంతేనా.. లాఠీ పట్టుకోవాల్సిన ఆయన చేతిలో పొడవాటి హ్యామర్ ఉంది. నల్ల కళ్లద్దాల్లోంచి ఆయన కళ్లు తీక్షణంగా చూస్తున్నాయి. యాక్షన్ మోడ్‌లో ఉన్న ఆయన రౌడీలను చావగొట్టేందుకు సిద్ధమయినట్లుగా కనిపిస్తోంది.
ఈ మూవీలో బాలయ్య సరసన ఇద్దరు హీరోయిన్లు.. సోనాల్ చౌహాన్, వేదిక.. నటిస్తున్నారు. బాలీవుడ్ బ్యూటీ సోనాల్‌కు 'రూలర్'.. బాలయ్యతో మూడో మూవీ కావడం గమనార్హం. ఇదివరకు ఆ ఇద్దరూ 'లెజెండ్', 'డిక్టేటర్' సినిమాల్లో జంటగా నటించారు. వేదికకు బాలయ్యతో ఇదే ఫస్ట్ ఫిల్మ్. ప్రకాశ్ రాజ్ విలన్‌గా నటిస్తోన్న ఈ సినిమాలో సహజనటి జయసుధ, అందాల నటి భూమిక కీలక పాత్రలు చేస్తున్నారు.
నిజానికి 'రూలర్' అనే టైటిల్ పెట్టుకోవాలని గతంలో జూనియర్ ఎన్టీఆర్ భావించాడు. బోయపాటి శ్రీను డైరెక్షన్‌లో ఆయన చేసిన 'దమ్ము' సినిమాకు మొదట అనుకున్న టైటిల్ 'రూలర్'. అందుకే 'రూలర్..' అంటూ సాగే సాంగ్ కూడా అందులో ఉంది. కానీ తర్వాత ఎందుకనో ఆ టైటిల్ పెట్టకుండా 'దమ్ము' టైటిల్‌ను దానికి పెట్టారు. అలాగే శ్రీవాస్ డైరెక్షన్‌లో చేసిన 'డిక్టేటర్'కు మొదట 'రూలర్' అనే టైటిల్ పెట్టనున్నట్లు ప్రచారం జరిగింది. కానీ అలా జరగలేదు. ఇప్పుడు ఈ సినిమాకు 'రూలర్' టైటిల్ కుదిరింది.
డిసెంబర్ 20న 'రూలర్'ను రిలీజ్ చెయ్యాలని నిర్మాత సి. కల్యాణ్ సంకల్పించారు. కాగా బాలయ్య 'రూలర్' పోస్టర్ సోషల్ మీడియాలో బాగా చక్కర్లు కొడుతోంది. కొత్త లుక్‌లో బాలయ్య అదరగొట్టాడని ఆయన ఫ్యాన్స్ ఆనందపడుతుంటే, యాంటీ ఫ్యాన్స్ మాత్రం బ్యాడ్ కామెంట్స్‌తో ట్రోల్ చేస్తున్నారు. ఒక రకంగా 'రూలర్' లుక్‌పై ఫ్యాన్స్, యాంటీ ఫ్యాన్స్ మధ్య యుద్ధం లాంటిది నడుస్తోందని చెప్పాలి. రజనీకాంత్ లుక్‌ను బాలయ్య కాపీ కొట్టాడంటూ సోషల్ మీడియాలో ట్రోలింగ్ నడుస్తోంది. లేటెస్ట్ మూవీ 'దర్బార్'లో రజనీకాంత్ లుక్ దాదాపు ఇదే విధంగా ఉండటం గమనార్హం. గడ్డంలో కొద్ది మార్పు మినహా హెయిర్ స్టైల్ కూడా అలాగే ఉందనే కామెంట్స్ వస్తున్నాయి. ఎ.ఆర్. మురుగదాస్ డైరెక్షన్‌లో రజనీ నటిస్తోన్న 'దర్బార్' మూవీ వచ్చే సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు వస్తోంది.
ఒక్కటి మాత్ర స్పష్టం. ఎప్పుడూ ఒకే రకంగా కనిపించకుండా సినిమా సినిమాకీ తన లుక్‌లో వైరుధ్యాన్నీ, విలక్షణత్వాన్నీ చూపించాలని బాలయ్య తపిస్తున్నారు. 'సింహా'లో ఆయన బుర్ర మీసాలతో కొత్తగా కనిపించి ఆకట్టుకోవడం మనకు తెలుసు. అలాగే 'పరమ వీరచక్ర'లో ఆర్మీ మ్యాన్‌గా మెలితిప్పిన మీసాలతో ఆయనకు కనిపించారు. 'లెజెండ్'గా కొద్దిగా పెరిగిన గడ్డం లుక్‌తో అలరించి, ప్రేక్షకుల హృదయాల్ని దోచుకున్నారు. 'గౌతమిపుత్ర శాతకర్ణి'గా భుజాల దాకా పెరిగిన జుట్టు, పొడవాటి మీసాలతో మెప్పించారు. 'పైసా వసూల్'లో అల్ట్రా మోడరన్ లుక్‌లో ఔరా అనిపించారు. ఇప్పుడు 'రూలర్'గా మరోసారి భిన్న ఆహార్యంతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు బాలయ్య.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
