రమేశ్‌బాబు నట ప్రస్థానం.. 'మోసగాళ్లకు మోసగాడు' నుంచి 'ఎన్‌కౌంటర్' దాకా!
on Jan 8, 2022

రమేశ్‌బాబు ఆకస్మిక మృతితో సూపర్‌స్టార్ కృష్ణ కుటుంబంతో పాటు కృష్ణ ఫ్యామిలీ ఫ్యాన్స్, టాలీవుడ్ మొత్తంగా దిగ్భ్రాంతికి గురయ్యింది. కృష్ణకు నటవారసునిగా ప్రస్తుతం మహేశ్ ఒక్కడే కనిపిస్తున్నా, అతనికంటే ముందు రమేశ్‌బాబు కొన్ని సినిమాల్లో హీరోగా నటించి, ప్రేక్షకుల్ని మెప్పించారు. 1965 అక్టోబర్ 13న జన్మించిన రమేశ్ బాలనటునిగా వెండితెరపై అడుగుపెట్టారు. తొలిసారిగా ఆయన తెరపై కనిపించిన సినిమా 'మోసగాళ్లకు మోసగాడు' (1971). ఆ తర్వాత కృష్ణ నటించిన అల్లూరి సీతారామరాజు, కురుక్షేత్రం, మనుషులు చేసిన దొంగలు తదితర చిత్రాల్లో బాలనటునిగా కనిపించారు. 'అల్లూరి సీతారామరాజు' (1974)లో రామరాజు చిన్నప్పటి వేషాన్ని చేసింది రమేశే.
దాసరి నారాయణరావు దర్శకత్వంలో తన 14 సంవత్సరాల వయసులో 'నీడ' సినిమాలో తొలిసారిగా ప్రధాన పాత్ర పోషించారు రమేశ్. ఊహ తెలియని వయసులో మహేశ్ తొలిసారిగా తెరపై కనిపించిన మూవీ కూడా ఇదే. 1987లో విడుదలైన 'సామ్రాట్' సినిమాతో రమేశ్ హీరోగా పరిచయమయ్యారు. ఆ తర్వాత చిన్నికృష్ణుడు, బజారు రౌడీ, బ్లాక్ టైగర్, కృష్ణగారబ్బాయి, కలియుగ అభిమన్యుడు, మామ కోడలు, అన్నాచెల్లెలు, పచ్చతోరణం చిత్రాల్లో హీరోగా నటించారు.
తండ్రి కృష్ణతో కలియుగ కర్ణుడు, ముగ్గురు కొడుకులు, ఆయుధం, నా ఇల్లే నా స్వర్గం, ఎన్‌కౌంటర్ సినిమాల్లో నటించారు. 'ఎన్‌కౌంటర్' తర్వాత రమేశ్ మళ్లీ తెరపై కనిపించలేదు.
2004లో నిర్మాతగా మారిన రమేశ్‌బాబు.. కృష్ణా ప్రొడక్షన్స్ పేరుతో ప్రొడక్షన్ హౌస్ నెలకొల్పి మహేశ్ హీరోగా 'అర్జున్' (2004), 'అతిథి' (2007) చిత్రాలు నిర్మించారు. మహేశ్ నటించిన 'దూకుడు' (2011), 'ఆగడు' (2014) సినిమాలు రమేశ్‌బాబు సమర్పణలోనే రూపుదిద్దుకున్నాయి. రమేశ్ తనయుడు జయకృష్ణ 'నిజం' చిత్రంలో మహేశ్ చిన్నప్పటి వేషం వేయడం గమనార్హం.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



