ఇంకో జన్మలోనైనా నువ్వే నా అన్నయ్యవి.. మహేశ్ తీవ్ర భావోద్వేగం!
on Jan 9, 2022

అనారోగ్యంతో బాధపడుతూ రమేశ్‌బాబు శనివారం (జనవరి 8) ఆకస్మికంగా మృతి చెందడంతో ఘట్టమనేని కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది. అన్నయ్య రమేశ్ అంటే మహేశ్‌బాబుకు వల్లమాలిన ప్రేమ అనే విషయం ఆ కుటుంబానికే కాదు, ఆ కుటుంబంతో పరిచయం ఉన్నవారందరికీ తెలిసిన విషయమే. సందర్భం వచ్చినప్పుడల్లా అన్నయ్య మీద తన ప్రేమను వ్యక్తం చేస్తూ వచ్చేవాడు మహేశ్. అయితే విషాదంలో విషాదం ఏమంటే.. ఈరోజు జరిగిన అన్నయ్య రమేశ్ అంత్యక్రియల్లో మహేశ్ పాల్గొనలేకపోవడం. కొవిడ్ 19 పాజిటివ్‌గా నిర్ధారణ కావడంతో మహేశ్ తన ఇంట్లోనే ఐసోలేషన్‌లో ఉన్నాడు. అతనితో పాటు, అతని భార్యా పిల్లలూ క్వారంటైన్‌లో ఉన్నారు.
Also read: దాసరి డైరెక్షన్‌లో టీనేజ్‌లో రమేశ్ లీడ్ రోల్ చేసిన 'నీడ'
ఈరోజు అన్నయ్య మృతికి స్పందించాడు మహేశ్. తన సోషల్ మీడియా హ్యాండిల్స్‌లో అతను షేర్ చేసిన ఒక నోట్ చూస్తే, అతనెంత తీవ్ర భావోద్వేగానికి గురయ్యాడో అర్థమవుతోంది. అన్నయ్యే తన బలం, ధైర్యం, సర్వస్వం అని తెలిపిన మహేశ్, అన్నయ్య లేకుంటే ఈరోజు తను ఉన్నదాంట్లో సగం కూడా ఉండేవాడ్ని కాదన్నాడు. ఇంకో జన్మంటూ ఉంటే, అందులోనూ నువ్వే నాకు అన్నయ్యగా ఉండాలని కోరుకుంటానన్నాడు మహేశ్.
Also read: రమేశ్‌బాబు, జుహీ చావ్లా జంటగా నటించారని మీకు తెలుసా?
"నువ్వు నాకు స్ఫూర్తిగా నిలిచావు. నువ్వే నా బలం, నువ్వే నా ధైర్యం, నువ్వే నా సర్వస్వం. నువ్వు లేకుంటే ఈ రోజు ఉన్నదాంట్లో సగం కూడా ఉండేవాడిని కాదు. నువ్వు నా కోసం చేసిన ప్రతిదానికీ ధన్యవాదాలు. ఇప్పుడు విశ్రాంతి.. విశ్రాంతి.. ఈ జన్మలోనే కాదు, నాకు ఇంకో జన్మంటూ ఉంటే, నువ్వే నాకు అన్నయ్యవి. ఎప్పటికీ, ఏనాటికీ నిన్ను ప్రేమిస్తూనే ఉంటాను." అని తను షేర్ చేసిన నోట్‌లో రాసుకొచ్చాడు మహేశ్.

రమేశ్, మహేశ్ కలిసి 'బజార్ రౌడీ', 'ముగ్గురు కొడుకులు' సినిమాల్లో కలిసి నటించారు. మహేశ్ హీరోగా నటించిన 'అర్జున్', 'అతిథి' చిత్రాలను రమేశ్ నిర్మించారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



