నా సినిమాలోని 'మనసేన' పార్టీతో.. జనసేనకూ, పవన్‌కల్యాణ్‌కూ సంబంధం లేదు: రాంగోపాల్ వర్మ
on Nov 27, 2019
"మా సినిమాలో పవన్ కల్యాణ్‌ను పోలిన ఒక యాక్టర్ ఉన్నారు. మనసేన అనేది నా సినిమాలో ఒక ఫిక్షనల్ పార్టీ. పవన్ కల్యాణ్‌ను పోలిన వ్యక్తి మనసేన అనే పార్టీ పెడతాడు. దాంతో పవన్ కల్యాణ్‌కీ, జనసేనకీ సంబంధమే లేదు" అన్నారు రాంగోపాల్ వర్మ. ఆయన డైరెక్ట్ చేసిన 'కమ్మరాజ్యంలో కడపరెడ్లు' సినిమా నవంబర్ 29న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ సందర్భంగా ఆ మూవీ గురించీ, ఇతర అంశాల గురించీ హైదరాబాద్‌లో కొత్తగా ఏర్పాటుచేసిన కార్యాలయంలో తనదైన ధోరణిలో మాట్లాడారు వర్మ. ఆ విశేషాలు...
మీ 'కమ్మరాజ్యంలో కడపరెడ్లు' ఆపమని ఎవరో కోర్టుకు వెళ్లినట్లున్నారు?
నేను 'కమ్మ రాజ్యంలో కడపరెడ్లు' అనే మెసేజ్ ఓరియెంటెడ్ ఫిల్మ్ తీశాను. ఇది నా కెరీర్‌లో నేను తీసిన మొట్టమొదటి మెసేజ్ ఓరియెంటెడ్ ఫిల్మ్. నా సినిమాలపై కోర్టుకు వెళ్లడమనేది సూర్యుడు తూర్పున ఉదయించడం అన్నంత రెగ్యులర్ అయిపోయింది. దాని గురించి అంత పట్టించుకోవాల్సిన అవసరం లేదని అనుకుంటున్నా.
ఈ మూవీలో మీరు ఏం చూపిస్తున్నారు?
టీవీల్లో మనం ఎప్పుడు చూస్తూ ఉంటాం.. ఎక్కడో స్కాం జరిగిందనో, స్కాండల్ జరిగిందనో.. లేదంటే రాజకీయ పార్టీలు పరస్పరం నిందించుకోవడమో.. చూస్తుంటాం. మే 2019 నుండి సెప్టెంబర్ 2020 మధ్య జరిగిన ఘటనల ఆధారంగా తీసింది. అంటే జరిగినవీ, జరుగుతున్నవీ, జరగబోయేవి ఊహించినవీ ఇందులో ఉంటాయి. దాన్ని ఒక ఫన్ లెవల్లో చేశాం. రియల్ లైఫ్‌లో ఫన్ ఉంటుందనేది నా ఉద్దేశం. కె.ఎ. పాల్ అనే అతను నిజమైన వ్యక్తి. అతను ఫన్నీ వ్యక్తి కూడా. ఎవరు సీరియస్‌గా ఉంటారు, ఎవరు ఫన్‌గా ఉంటారు, ఎవరు వ్యంగ్య మనుషులుటారు.. వీళ్లందర్నీ కలగాపులగం చేసి, ఫన్ లెవల్లో ఒక పొలిటికల్ యాస్పెక్ట్‌లో సెటైరికల్‌గా ఈ సినిమా తీశాం.
ఇందులో కొత్తగా ఏం చెప్పారు?
రియల్ లైఫ్ క్యారెక్టర్స్‌ను తీసుకొని ఫిక్షనల్ స్టోరీ చెయ్యడం నాకు తెలిసి ఇండియన్ స్క్రీన్‌పై ఎప్పుడూ జరగలేదు.
టైటిల్ చూస్తే, ఒక కులాన్ని తక్కువ చేసినట్లు అనిపిస్తోంది?
ఒక కమ్యూనిటీని తక్కువ చేసి, ఇంకో కమ్యూనిటీని ఎక్కువచేయడం లాంటివి ఈ సినిమాలో నేను పెట్టలేదు. ఆయా సందర్భాల్ని ఆధారం చేసుకొని తీసిన సినిమాయే కానీ ప్రత్యేకించి ఒక కమ్యూనిటీని తక్కువచేసే ఉద్దేశంతో తీసిన సినిమా కాదు.
ఎవర్నో టార్గెట్ చేసి తీసినట్లు కనిపిస్తోంది కదా?
ఈ మూవీతో నేనెవర్నీ టార్గెట్ చెయ్యలేదు. ఉన్నవే చూపించాను. ఒక ఇన్సిడెంట్ జరిగినప్పుడు రకరకాలుగా మాట్లాడుకుంటూ ఉంటారు. ఆ క్యారెక్టర్స్ తీసుకున్నప్పుడు ఆటోమేటిగ్గా రిజెంబ్లెన్సెస్ కనిపిస్తాయి. దాన్ని హైలైట్ చేసిన ఫీలింగ్ వస్తుంది. ట్రైలర్‌లో చూసినవన్నీ సినిమాలో ఉంటాయి.
ఈ మూవీని రాజకీయ నాయకులకెవరికైనా చూపించాలనుకుంటున్నారా?
ఇద్దరు ప్రఖ్యాతి గాంచిన తండ్రీకొడుకులకు చూపిద్దామనుకుటున్నా. దయచేసి వాళ్ల పేర్లు మాత్రం నన్నడగొద్దు. పోస్టర్లో ప్రత్యర్థులైన ఇద్దరు సంతోషంగా కరచాలనం చేసుకుంటున్నట్లే పొలిటీషియన్లు ఉండాలని నా కోరిక.
ఈ మూవీ ఐడియా ఎప్పుడు వచ్చింది?
జగన్మోహనరెడ్డి గారి ప్రమాణ స్వీకారం అప్పుడు చూసిన వాతావరణం నుంచి వచ్చిన ఐడియా ఇది.
కె.ఎ. పాల్ మిమ్మల్ని తిడుతూ పోస్టులు పెడుతున్నట్లున్నారు?
కె.ఎ. పాల్‌ని పట్టించుకోవడం మానేసి చాలా రోజులైంది. నాకు తెలిసి ప్రస్తుతం ఆయన ప్రపంచ యుద్ధం ఆపే పనుల్లో బిజీగా ఉన్నాడు.
తిట్లు పడటమంటే ఇష్టమా?
బాగా తిట్టిచ్చుకోకపోతే నాకు నిద్రపట్టదు. అలాంటి బుద్ధి ఒకటి నాలో డెవలప్ అయ్యింది. అదే నన్నెవరైనా పొగిడితే నిద్ర వచ్చేస్తుంది.
అచ్చం చంద్రబాబునాయుడిలా కనిపించే వ్యక్తిని ఎలా తీసుకొచ్చారు?
వాస్తవిక పరిస్థితుల్లో ఉన్నప్పుడు రిజెంబ్లెన్సెస్ అనేవి చాలా ఇంపార్టెంట్. గత ముఖ్యమంత్రి రోల్ వెయ్యడానికి ఒక పర్టిక్యులర్ ఆకారం కావాల్సొచ్చి, సోషల్ మీడియాలో ఒక వీడియోలో ఆ వ్యక్తిని చూశాను. అతను నాసిక్‌లో ఒక హోటల్ వెయిటర్. తనను తీసుకొచ్చి నటనలో ఒక నెల ట్రైనింగ్ ఇచ్చాం.
సినిమా హీరోను పోలిన పాత్రలేమైనా ఈ సినిమాలో ఉన్నాయా?
లేవు. ఇందులో బాలకృష్ణగారు లేరు.
జగన్మోహనరెడ్డి గారికి ఫేవర్‌గా ఈ సినిమా తీశారనే మాట గట్టిగా వినిపిస్తోంది. నిజమేనా?
అది కరెక్ట్ కాదు. జరగబోయేది ఊహించి తీసినప్పుడు ఆయనకు ఫేవరుబుల్‌గా తీశాననడంలో అర్థం లేదు. జరగని దాని గురించి ఫేవరబుల్‌గా ఎలా తీస్తారు?
నిజ జీవిత వ్యక్తుల మాదిరిగా కనిపిస్తున్న పాత్రల గురించి ఏం చెప్పదలచుకున్నారు?
రియల్ పొలిటీషియన్స్‌తో కానీ, ఫేమస్ పర్సనాలిటీస్‌తో కానీ ఈ సినిమాలో ఉన్న పాత్రలతో పోలికలు కేవలం యాదృచ్ఛికం. ఉద్దేశపూర్వకం కాదు. ఇది నా వివరణ. ఈ విషయంలో నేను అబద్ధం చెబితే దేవుడు నన్ను శిక్షించు గాక.
ఇది ఏ జోనర్ సినిమా?
ఇది పొలిటికల్ సెటైర్. అయితే అన్నింటినీ మీరు సెటైర్‌గా చూపిస్తున్నాననుకుంటే నేనేం చెయ్యలేను. ఒక తండ్రి కొడుక్కి ప్రేమగా పప్పు వడ్డిస్తున్నాడు. దాన్ని మీరు జోకంటే ఎలా? అలా ఆలోచించడం మీ తప్పు. నేను నిష్కల్మషమైన హృదయంతోటి ఒక తండ్రి ప్రేమను కొడుకు మీద చూపిస్తే, పప్పు అంటున్నాడని కుత్సిత మనస్తత్వాలతో మీరు (మీడియా) చేస్తున్నారు.
టైటిల్‌కు సెన్సార్ వాళ్లు అభ్యంతరపెడితే?
నాకు తెలిసి టైటిల్‌కు సెన్సార్ వాళ్లు అభ్యంతరం చెప్తారని అనుకోవట్లేదు. ఎందుకంటే సినిమాలో నేను ఒక కమ్యూనిటీ ఎక్కువ, ఇంకోటి తక్కువా అని ఎక్కడా చూపించలేదు కాబట్టి.
ఇలాంటి సినిమాల వల్ల మీకొచ్చేది పర్సనల్ శాటిస్‌ఫ్యాక్షనా? క్రియేటివ్ శాటిస్‌ఫ్యాక్షనా?
బేసికల్‌గా నాకు చిన్నప్పట్నుంచీ గిల్లటం ఇష్టం. అంటే పర్సనల్ శాటిస్‌ఫాక్షన్. ఎట్ ది ఎండ్ ఆఫ్ ద డే, ఏ ఫిలింమేకరైనా తను పర్సనల్‌గా ఫీలైన ఒక ఉద్వేగాన్నే కథ రూపంలో, సినిమా రూపంలో మలుస్తాడు.
ఈ సినిమా చేస్తున్నందుకు మీకు బెదిరింపు కాల్స్ ఏమైనా వచ్చాయా?
నాకెవరూ బెదిరింపు కాల్స్ చెయ్యలేదు. ఎందుకంటే రికార్డ్ అవుతాయని భయపడుతున్నారు. బెదిరింపు కాల్స్ అనేవి పదేళ్ల క్రితం వరకు ఎవరికైనా వచ్చుంటాయి. ఇప్పుడెవరికీ అలాంటివి రావు. ఇక డైరెక్టుగా వచ్చి బెదిరించడానికి ఎవరైనా భయపడతారు. ఎవరో అలా అంటున్నారు, ఇలా అనుకుంటున్నారు.. అని థర్డ్ హ్యాండ్, ఫోర్త్ హ్యాండ్ లాంటివి వస్తుంటాయి. వాటినసలు పట్టించుకోను.
'కమ్మరాజ్యంలో కడపరెడ్లు' సినిమాని ఎందుకు చూడాలి?
మంచి భోజనం లాంటి సినిమా. దానిలో పప్పు కూడా ఉంటుంది. దాని కోసం సినిమా చూడాలి.
ఈ మూవీకి సీక్వెల్ తీసే ఆలోచన ఉందా?
దీనికి సీక్వెల్ తీస్తే, 'కడప రాజ్యానికి కమ్మ ఫ్యాన్స్' అని తీస్తా. పొలిటికల్‌గా ప్రతి రోజూ ఏదో ఒక ఇష్యూ జరుగుతూ ఉంటుంది కాబట్టి సీరియల్‌గా ఎన్నైనా తీసుకోవచ్చు.
'లక్ష్మీస్ ఎన్టీఆర్' సినిమాకు వచ్చిన ఫీడ్‌బ్యాక్ ఏంటి?
'లక్ష్మీస్ ఎన్టీఆర్' అనేది అలా జరుగుంటుందని భావించి నేను తీసిన సినిమా. నా భావాలతో అందరూ ఏకీభవించాలని లేదు. ఆ సినిమా నచ్చిందని తెలుగుదేశం వాళ్లే నాకు ఫోన్లు చేసి చెప్పారు. బహుశా వాళ్లు చెప్పాలనుకొని చెప్పలేకపోయినవి, సినిమాలో నేను చెప్పడం వల్ల నచ్చిందేమో.
ఇంత ఫాస్ట్‌గా సినిమాలు ఎలా తీయగలుగుతున్నారు?
వేరే వేరే టీంస్ నా దగ్గర పేరలల్‌గా పనిచేస్తుంటాయి. అందుకే ఒక దాని వెంట ఒకటి నా నుంచి సినిమాలు వస్తుంటాయి. చూసేవాళ్లకు నేను ఫాస్ట్‌గా తీస్తున్నట్లు కనిపిస్తుందంతే.
దెయ్యాల సినిమాలు మానేసి పొలిటికల్ సినిమాలపై పడ్డారేమిటి?
మామూలు క్రైమ్స్ కన్నా పొలిటికల్ క్రైమ్స్ సినిమా తియ్యడానికి బెటర్‌గా అనిపిస్తున్నాయి. అందుకే పొలిటికల్ సినిమాలు తీస్తున్నా. అవి మోర్ ఇంట్రెస్టింగ్.
'ఎంటర్ ద గాళ్ డ్రాగన్' అనౌన్స్ చేసి చాలా కాలమైంది. ఆ సినిమా రావడానికి ఇంత కాలం ఎందుకు పట్టింది?
ఇండియాలో మార్షల్ ఆర్టిస్ట్స్ లేరు. అందుకే 'ఎంటర్ ద గాళ్ డ్రాగన్'ను ఒక చైనీస్ సంస్థతో కలిసి తీస్తున్నాం. దానివల్లే ఆ ప్రాజెక్టు చెయ్యడానికి కొంత టైం పట్టింది.
జొన్నివిత్తుల గారు మీపై సినిమా తీస్తామన్నారు? ఏమంటారు?
జొన్నవిత్తుల గారు చాలా మంచి కవి. మహానుభావుడు. ఆయన లాంటి మేధావులు చాలా అరుదుగా పుడతారు.
మీ డ్రైవింగ్ ఫోర్స్ ఏమిటి?
పొద్దున లేచిన దగ్గర్నుంచి రాత్రి నిద్రపోయేవరకు నాకేమనిపించిందో అది చెయ్యాలనేది నా డ్రైవింగ్ ఫోర్స్. సినిమా అనేది అందులో భాగం.
మీరు హీరోగా చేస్తున్న సినిమా ఎంతవరకు వచ్చింది?
వస్తుంది. త్వరలో వస్తుంది.
స్టార్ హీరోలతో సినిమాలెందుకు తియ్యట్లేదు?
నేను తీసే సినిమాలకు ఇమేజ్ ఉన్న హీరోలు వర్కవుట్ అవరు. నేను రియలిస్టిక్ డ్రామాస్, రియలిస్టిక్ ఫిలిమ్స్ తీస్తుంటాను. పెద్ద హీరోలకు వాళ్ల ఫ్యాన్స్, వాళ్ల ఇమేజ్, ప్రేక్షకుల్ని ఎలా ఆకర్షించాలనే ఒక స్టేబుల్ ఫార్ములా ఉంటుంది. నా లైఫ్‌లో ఎప్పుడూ ఫార్ములా సినిమాలు చెయ్యలేదు. అలాంటివి నేను తియ్యలేను.
రాంగోపాల్ వర్మ కంపెనీ ముంబై నుంచి హైదరాబాద్‌కు షిఫ్టయ్యిందా?
లేదు.. ముంబై, హైదరాబాద్.. రెండు చోట్లా మా కంపెనీ ఉంది.
- బుద్ధి యజ్ఞమూర్తి
Also Read