తమిళనాట కార్తీ 'ఖైదీ' కొత్త గొడవ తెచ్చింది
on Nov 27, 2019
ఓ రకంగా కొత్త గొడవ కాదు... తెలుగునాట ఈమధ్య తరచూ చర్చకు వస్తున్న గొడవ అని చెప్పాలి. సినిమా విడుదలైన ఎన్ని రోజులకు అమెజాన్, హాట్ స్టార్, నెట్ ఫ్లిక్స్, జీ 5 వంటి డిజిటల్ ఫ్లాట్ ఫార్మ్స్ లోకి సినిమా రావాలనే విషయంలో నిర్మాతలకు, డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లకు గొడవ నడుస్తోంది. డిజిటల్ ప్లాట్ ఫార్మ్స్ వచ్చిన కొత్తల్లో విడుదలైన 90 రోజులకు సినిమా వచ్చేది. తర్వాత 60 రోజులకు రావడం ప్రారంభమైంది. ఆ తర్వాత 30 రోజులకు డిజిటల్ ప్లాట్ ఫార్మ్స్ లో సినిమా అందుబాటులోకి వచ్చింది. తెలుగులో 'ఆపరేషన్ గోల్డ్ ఫిష్' అయితే విడుదలైన 14 రోజులలో అమెజాన్ లో ప్రత్యక్షమైంది. ఇలా వచ్చేస్తే థియేటర్లకు ప్రేక్షకులు ఎందుకు వస్తారు? అని డిస్ట్రిబ్యూటర్లు ప్రశ్నిస్తున్నారు. దాంతో గొడవలు తప్పడం లేదు. తమిళనాట ఈ రోజు కార్తీ 'ఖైదీ' ఇటువంటి గొడవను తెరపైకి తెచ్చింది.
తెలుగునాట చాలా సినిమాల తర్వాత కార్తీకి మంచి విజయం అందించిన సినిమా 'ఖైదీ'. తమిళనాట కూడా ఈ సినిమా విజయకేతనం ఎగురవేసింది. అక్టోబర్ 25న 'ఖైదీ' విడుదలైంది. నవంబర్ 25కి హాట్ స్టార్ లో వచ్చేసింది. దాంతో డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లకు కోపం వచ్చింది. డిజిటల్ ప్లాట్ ఫారమ్స్ కోసం సినిమాలు తీస్తున్నట్లు అయితే వాటిలోనే విడుదల చేసుకోమని ఆగ్రహం వ్యక్తం చేశారు. 30 రోజులకు డిజిటల్ ప్లాట్ ఫార్మ్స్ లో సినిమా వస్తే థియేటర్లకు ప్రేక్షకులు ఎందుకు వస్తారని ప్రశ్నిస్తున్నారు. ఎగ్జిబిటర్స్ వెర్షన్ ఇలా ఉంటే... 'ఖైదీ' నిర్మాత ఎస్ఆర్ ప్రభు వెర్షన్ మరోలా ఉంది. "సినిమా విడుదలైన రోజున ఆన్ లైన్ లో పైరసీ ప్రింట్ వస్తుంది. అలాగని, థియేటర్లోకి వచ్చే ప్రేక్షకులు తగ్గుతున్నారా?" అని ఎస్ ఆర్ ప్రభు అంటున్నారు. దాంతో కోడి ముందా? గుడ్డు ముందా? అన్నట్టు... ఈ చర్చకు పరిష్కారం దొరకడం లేదు.
Also Read