4 నిమిషాల పాట.. సింగిల్ షాట్! 'మిస్ మ్యాచ్'లో స్పెషల్ ఎట్రాక్షన్!
on Nov 28, 2019
'ఆటగదరా శివ' ఫేం ఉదయ్ శంకర్, ఐశ్వర్యా రాజేశ్ జంటగా నటించిన 'మిస్ మ్యాచ్' సినిమా డిసెంబర్ 6న విడుదలవుతోంది. తమిళంలో విజయ్ ఆంటోని హీరోగా 'సలీం' తీసి హిట్ కొట్టిన ఎన్.వి. నిర్మల్‌కుమార్ ఈ సినిమాకి దర్శకుడు. ఈ మూవీలో పవన్ కల్యాణ్ బ్లాక్‌బస్టర్ ఫిల్మ్ 'తొలిప్రేమ'లోని సూపర్ హిట్ సాంగ్ 'ఈ మనసే'ను రీమిక్స్ చేశారు. 4 నిమిషాల ఆ పాటను సింగిల్ షాట్‌లో చిత్రీకరించడం ఒక విశేషంగా చెప్పాలి. ఆ పాట చిత్రీకరణ ఎలా జరిగిందో హీరో ఉదయ్ శంకర్ వివరించారు. ఆ విశేషాలు ఆయన మాటల్లోనే..
"పవన్ కల్యాణ్ 'తొలిప్రేమ' నా ఆల్ టైం ఫేవరెట్ ఫిల్మ్. 101 సార్లు చూశాను. అందులోని 'ఈ మనసే' సాంగ్ నా ఫేవరెట్ సాంగ్. దాన్ని మా సినిమాలో రీమిక్స్ చేద్దామని డిసైడ్ అయ్యాం. అయితే దాన్ని బలవంతంగా ఇరికించినట్టు ఉండకూడదు, కథలోనే అది మిళితమై పోవాలనేది నా ఉద్దేశం. డైరెక్టర్ నిర్మల్ కుమార్‌కు చెబితే మంచి ఐడియా అనీ, దాన్ని కథలో భాగం చేద్దామనీ అన్నారు. అలాగే కథలో దానికో సందర్భం సృష్టించారు. ఆ పాటను ఎట్లా చెయ్యాలని తీవ్రంగా ఆలోచించాం. ఆ పాటను చెడగొట్టకుండా రీమిక్స్ చెయ్యాలి. లేకపోతే పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ ఒప్పుకోరు. కొరియోగ్రాఫర్ విజయ్ మాస్టర్ నాకు మంచి ఫ్రెండ్. తను పవన్ కల్యాణ్‌కు పెద్ద ఫ్యాన్. అతని దగ్గరే నేను డాన్స్ నేర్చుకున్నా. చాలా ఏళ్ల క్రితమే, "నేను హీరో అయితే, ఆ పాట నా సినిమాలో పెడితే, దాని కొరియోగ్రఫీ బాధ్యత నీకే అప్పగిస్తాను" అని చెప్పాను. ఆ మాటను ఇప్పుడు నిలబెట్టుకున్నా.
పాట సంగతి చెప్పగానే విజయ్ ఎగ్జైట్ అయ్యాడు. ఆ సాంగ్‌ను రొటీన్‌గా కాకుండా డిఫరెంట్‌గా పిక్చరైజ్ చేద్దామన్నాడు. 4 నిమిషాల సాంగ్‌ను సింగిల్ షాట్‌లో తీద్దామన్నాడు. నేను షాక్. "ఏం చెప్తున్నావురా?" అనడిగా. "రేయ్. పవన్ కల్యాణ్ కోసం నువ్వు, నేను ఏమైనా చేస్తాం. హార్ట్ అండ్ సోల్ పెట్టి కష్టపడదాం" అన్నాడు. "ఐడియా అయితే బాగుందిరా. కానీ అది సాధ్యమేనా?" అని మళ్లీ అడిగా. హీరోయిన్ ఐశ్వర్యా రాజేశ్‌కు ఈ ఐడియా చెప్పగానే తను కూడా షాక్. "సింగిల్ షాట్‌లో మొత్తం పాటా ఉదయ్?" అని ఆశ్చర్యపోయింది. రెండు రోజులు ప్రాక్టీస్ చేశాం. రామోజీ ఫిల్మ్ సిటీలోని లండన్ స్ట్రీట్‌లో ఒక హోటల్ సెటప్ వేశాం. వింటేజ్ కార్లు తీసుకొచ్చాం. ఫాగ్ పెట్టాం. ఒక బైక్ తెచ్చాం. పాట చివరలో ఆ బైక్ చాలా కీలకం. ఆర్ఎఫ్‌సీలో ఇంకో రోజు డాన్సర్స్‌తో కలిసి కాస్టూమ్స్ వేసుకొని ప్రాక్టీస్ చేశాం. ఐశ్వర్య అయితే "నన్ను చంపుతున్నారుగా" అంది నవ్వుతూనే.
మే నెల. 42, 43 డిగ్రీల ఎండ. సాంగ్ మొదలైంది. ఒక్క మిస్టేక్ జరిగినా, పాట మొత్తం మళ్లీ చెయ్యాలి. పాట చివరలో బైక్ ఎక్కి స్టార్ట్ చేసి వెళ్లిపోవాలి. పాట బాగా వస్తోంది. ఇంకో 5 సెకన్లలో సాంగ్ మొత్తం అయిపోతుంది. బైక్ మీద కూర్చున్నా. కిక్ కొట్టా. బైక్ స్టార్ట్ కాలేదు. చెమట్లు కారిపోతున్నాయ్. ఎంత కిక్ కొడుతున్నా బైక్ స్టార్ట్ కాలేదు. అట్లా ఆ షాట్ ఓకే కాలేదు. నాలుగు నిమిషాల పాటు నాన్-స్టాప్‌గా డాన్స్ చేసివుండటం వల్ల షర్ట్ ముద్దగా తడిసిపోయింది. మళ్లీ కారవాన్‌లోకి వెళ్లి స్పేర్ షర్ట్ వేసుకొని, మళ్లీ మేకప్ వేసుకొని వచ్చాం. మళ్లీ పాట మొదలైంది. డాన్స్ చేస్తున్నాం. ఈసారి ఎలాగైనా ఓకే కావాలని శ్రద్ధగా చేస్తున్నాం. పాట అయిపోయింది. అందరూ క్లాప్స్ కొట్టారు. కొరియోగ్రాఫర్ విజయ్ మానిటర్ చూస్తూ 'ఒన్ మోర్' అని కేకపెట్టాడు. అందరూ సైలెంట్ అయిపోయారు. ఒక డాన్సర్ స్టెప్ మర్చిపోయి, అందరూ ఒక విధంగా వేస్తుంటే, అతను ఇంకో విధంగా వేశాడని చెప్పాడు. అందరికీ నీరసం వచ్చేసింది. ఐశర్య అయితే ఆ డాన్సర్‌పై కోప్పడింది కూడా. ఈసారి తనకు గంట బ్రేక్ కావాలని చెప్పింది. లంచ్ తర్వాతే చేస్తానంది. నేను కూడా విజయ్‌తో అదే చెప్పాను.
మళ్లీ కేరవాన్‌లోకి వెళ్లి, లంచ్ చేసి, ఒక గంటసేపు రెస్ట్ తీసుకొని, మూడో టేక్‌కు సిద్ధమయ్యాం. అప్పుడు మధ్యాహ్నం మూడయ్యింది. ఎండ మండిపోతోంది. దాంతో ఇంకో గంట ఆగాం. సూర్యుడు కిందికి దిగుతున్నాడు. సంధ్యా సమయంలో మ్యాజిక్ లైటింగ్ అంటారే.. అది వచ్చింది. ఆ లైటింగ్‌లో షాట్ ఓకే అయితే పాట అద్భుతంగా వస్తుందని విజయ్ మమ్మల్ని ఉత్సాహపరిచాడు. పాట మొదలైంది. రపరపా 4 నిమిషాలు సాంగ్ చేసేశాం. చివరలో బైక్ స్టార్ట్ అయ్యింది.. వెళ్లిపోయాం. "డన్. ఓకే" అని కేకపెట్టాడు విజయ్. మానిటర్‌లో చూసుకొని "అమ్మబాబోయ్" అనుకున్నాను. అంత బాగా వచ్చింది సాంగ్. రేపు ప్రేక్షకులకు ఈ పాట నచ్చితే, మా కష్టం ఫలించినట్లే. ఈ సాంగ్ చిత్రీకరణ నా లైఫ్‌లో ఒక మెమరబుల్ ఇన్సిడెంట్‌గా గుర్తుండిపోతుంది."
అధిరోహ్ క్రియేటివ్ సైన్స్ ఎల్ఎల్‌పి బ్యానర్‌పై జి. శ్రీరామ్ రాజు, భరత్ రామ్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. ఉదయ్ శంకర్ ఐటీ ఉద్యోగిగా నటించగా, రెజ్లర్‌గా ఐశ్వర్య కనిపిస్తుంది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
