నయనతారను టార్గెట్ చేసిన రజనీ ఫాన్స్
on Jan 7, 2020
నయనతారను లక్ష్యంగా చేసుకుని సూపర్ స్టార్ రజనీకాంత్ అభిమానులు సోషల్ మీడియాలో చాలా కామెంట్స్ చేస్తున్నారు. దీనికి కారణం ఒక్కటే... సినిమా పబ్లిసిటీ కార్యక్రమాలకు రాకుండా అవార్డు ఫంక్షన్ కు హాజరు కావడం!
సంక్రాంతి సందర్భంగా విడుదలవుతున్న రజనీకాంత్ 'దర్బార్'లో నయనతార హీరోయిన్. ఇప్పుడు ఆమె స్టార్ హీరోయిన్. గతంలో ఆమెకు స్టార్ స్టేటస్ లేనప్పుడు 'చంద్రముఖి'లో తన సరసన నటించే అవకాశం ఇచ్చారు రజని. చాలా రోజుల తర్వాత మరోసారి 'దర్బార్'లో అవకాశం ఇచ్చారు. ఈ సినిమా ప్రమోషనల్ కార్యక్రమాల్లో హీరోయిన్ కనిపించలేదు. అటు చెన్నైలో జరిగిన 'దర్బార్' ఆడియో ఫంక్షన్ కి గాని... ఇటు హైదరాబాదులో జరిగిన ప్రీ రిలీజ్ ఫంక్షన్ కి గాని నయనతార రాలేదు. ఆమె ఎప్పుడూ... ఎక్కడా... ఏ సినిమా పబ్లిసిటీ కార్యక్రమాలకు హాజరు కాదు. సినిమాకు సంతకం చేసేటప్పుడే తాను ప్రమోషనల్ కార్యక్రమాలకు రానని కండిషన్ పెట్టి... దర్శక నిర్మాతలకు సమ్మతం అయితేనే నయనతార సినిమా చేస్తుంది. ఇది అందరికీ తెలిసిన విషయమే. రజనీ అభిమానుల కోపానికి కారణం ఏంటంటే... సినిమా పబ్లిసిటీ కార్యక్రమాలకు హాజరు కావడం మానేసి అవార్డు కార్యక్రమాలకు హాజరు కావడం.
ఇటీవల చెన్నైలో జీ తమిళ్ ఛానల్ అవార్డ్స్ కార్యక్రమం ఒకటి జరిగింది. దానికి నయనతార హాజరయ్యారు. ఆమెకు 'ఫేవరెట్ హీరోయిన్ 2019', 'శ్రీదేవి అవార్డ్ ఫర్ ఇన్స్పైరింగ్ ఇండియన్ వుమెన్ సినిమా' అవార్డులు వచ్చాయి. చిరునవ్వులు చిందిస్తూ వాటిని తీసుకున్నారు. జి అవార్డ్స్ కి నయనతార వెళ్లడమే రజనీ అభిమానుల ఆగ్రహానికి కారణమైంది. వాళ్లకు విజయ అభిమానులు కూడా తోడయ్యారు. ఇద్దరు హీరోల అభిమానులు కలిసి నయనతారను టార్గెట్ చేశారు. "ఆశ్చర్యంగా ఉందే... నయనతార అవార్డు ఫంక్షన్ కు వచ్చిందా?" అని ఒకరు ట్వీట్ చేస్తే... "అవార్డులు వచ్చినా రాకపోయినా ఇటువంటి ఫంక్షన్స్ కు నయనతార తప్పకుండా హాజరు అవుతుంది. ఆమె నటించిన సినిమా పబ్లిసిటీ కార్యక్రమాలకు మాత్రం హాజరు కాదు. నయనతార నిర్మాతలను చూస్తే జాలేస్తుంది" అని మరొకరు... "నయనతార అవార్డు ఫంక్షన్లకు మాత్రమే ఎందుకు హాజరు అవుతుంది?" అని ఇంకొకరు... ఇలా వరుసగా కామెంట్స్ చేశారు.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
