ఇక బన్నీ వెనుక 'అల్లు ఆర్మీ'
on Jan 7, 2020
మహేశ్‌బాబు సినిమా 'సరిలేరు నీకెవ్వరు' ప్రి రిలీజ్ ఈవెంట్‌కు చీఫ్ గెస్ట్ మెగాస్టార్ చిరంజీవి. జనవరి 5న లాల్‌బహదూర్ స్టేడియంలో భారీ ఎత్తున హాజరైన అభిమానుల సమక్షంలో చిరంజీవిని మహేశ్, మహేశ్‌ని చిరంజీవి పరస్పరం పొగడ్తలతో ముంచేశారు. మహేశ్‌ని చూస్తే ఒక బిడ్డలాగా ముద్దొస్తాడని చెప్పిన మెగాస్టార్.. అంతటితో ఆగకుండా మహేశ్‌ను ఏ స్టిల్‌లో చూసినా కత్తిలా కనిపిస్తాడని అన్నారు. 'సరిలేరు నీకెవ్వరు'లో ఆర్మీ గెటప్‌లో మాత్రం రెండంచుల కత్తిలా ఉన్నాడని మరింత మెచ్చుకున్నారు. అంతేకాదు.. మహేశ్ తండ్రి సీనియర్ సూపర్ స్టార్ కృష్ణకు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డ్ ఇవ్వాల్సిందిగా రెండు తెలుగు రాష్ట్రాలు కేంద్రాన్ని కోరాలని కూడా ఆయన డిమాండ్ చేశారు. ఆశ్చర్యకరంగా ఈ వేడుకకు హాజరైన ఫ్యాన్స్ చాలా సంయమనంతో కనిపించారు. మహేశ్‌ని చిరంజీవి పొగుడుతుంటే కేరింతలు కొట్టారు, కరతాళ ధ్వనులు చేశారు. సాధారణంగా ఇద్దరు టాప్ హీరోల ఫ్యాన్స్ మధ్య సయోధ్య కనిపించడం అరుదు. అందుకు భిన్నంగా మహేశ్ ఫ్యాన్స్ చిరంజీవికీ, మెగా ఫ్యాన్స్ మహేశ్‌కీ మద్దతుగా నిలిచిన ఈవెంట్‌గా 'సరిలేరు నీకెవ్వరు' ప్రి రిలీజ్ ఈవెంట్ నిలిచింది.
కట్ చేస్తే...
జనవరి 6..
'అల.. వైకుంఠపురములో' మూవీ మ్యూజికల్ కాన్సర్ట్.. చీఫ్ గెస్ట్ అంటూ ఎవరూ లేరు. అది అల్లు అర్జున్ సినిమా. త్రివిక్రమ్ డైరెక్ట్ చేసిన ఆ సినిమాని అల్లు అరవింద్, ఎస్. రాధాకృష్ణ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. సంక్రాంతి బరిలో 'సరిలేరు నీకెవ్వరు' మూవీతో పోటీ పడుతున్న ఈ సినిమా ఈవెంట్‌కు ఒక్కరంటే ఒక్కరు మెగా హీరో అటెండ్ కాలేదు. ఇది అందర్నీ ఆశ్చర్యానికి గురి చేసింది. అయితే బన్నీకి దన్నుగా అతని ఇద్దరు బ్రదర్స్.. వెంకటేశ్, శిరీష్ అతనితో పాటే ఈవెంట్‌కు కలిసి రావడం అందరి దృష్టినీ ఆకర్షించింది. మెగా హీరోలు లేకపోయినా బన్నీ వెనుక మేమున్నామని వాళ్లు చెప్తున్నట్లే ఉందని ఆ ఈవెంట్‌కు హాజరైన ఒక యూనిట్ మెంబర్ అనడం వాస్తవ పరిస్థితికి నిదర్శనం అనిపించింది. మూవీలోని పాటలకు సింగర్స్, డాన్సర్స్ పర్ఫార్మెన్సెస్ చేస్తుంటే, మధ్య మధ్యలో సినిమాకి పనిచేసిన యాక్టర్స్, టెక్నీషియన్స్ ప్రసంగిస్తూ వచ్చారు. నాలుగు గంటల పైగా సాగిన ఈ ఈవెంట్‌లో అందర్నీ ఆకట్టుకున్నది బన్నీ స్పీచే. 'సరిలేరు నీకెవ్వరు' ఈవెంట్‌లో చిరంజీవి, విజయశాంతి ఎపిసోడ్ హైలైట్ అయ్యి, అందరి దృష్టీ దానిపై నిలిచిన విషయం మనకు తెలుసు. ఇప్పటికీ ఇండస్ట్రీలోనూ, బయటా దాని గురించి మాట్లాడుకుంటూనే ఉన్నారు. 20 ఏళ్ల క్రితం నుంచీ సత్సంబంధాలు లేకుండా, మాటలు లేకుండా ఉన్న హిట్ పెయిర్.. ఇన్నాళ్లకు మహేశ్ పుణ్యామా అని మళ్లీ కలిశారని అనుకుంటున్నారు.
అలాంటి ఎట్రాక్షన్ 'అల.. వైకుంఠపురములో' ఈవెంట్‌లో లేదు. కానీ ఆ ఈవెంట్‌లో తన ఎమోషనల్ స్పీచ్‌తో తానే పెద్ద ఎట్రాక్షన్ అయ్యాడు బన్నీ. అందరికీ ఫ్యాన్స్ ఉంటారనీ, తనకు మాత్రం ఆర్మీ ఉన్నదని చెప్పడం ద్వారా మెగా ఫ్యాన్స్ వేరు, 'అల్లు అర్మీ' వేరని స్పష్టంగా చెప్పేశాడు బన్నీ. ఒకవైపు తన కట్టె కాలేవరకు చిరంజీవి అభిమానిగానే ఉంటానని చెప్తూనే, ఇంకోవైపు "ఇవాళ ఈ స్టేజిలో ఎవరూ లేకుండా ఇలా నిల్చున్నానంటే అది కేవలం మీవల్లే" అని తన అభిమాన గణాన్ని ఉద్దేశించి చెప్పాడు. అతని మాటల్లో ఫ్యాన్స్ వల్లే తను ఈ స్థాయికి వచ్చాననీ, ఇంకెవరి వల్లా కాదనీ చెప్పడమే కాకుండా, తన ఈవెంట్‌కు మెగా ఫ్యామిలీలో ఎవరూ రాలేదనే బాధని కూడా వ్యక్తం చేసినట్లు అనిపించిందని ఇండస్ట్రీలో చెప్పుకుంటున్నారు.
బహుశా అందుకేనేమో.. సోదరుడికి తోడుగా అన్న వెంకటేశ్, తమ్ముడు శిరీష్.. ఇద్దరూ వచ్చారు. స్టేజిపై మాట్లాడుతూ బన్నీ ఎమోషనల్ అవుతుంటే.. కింద కుర్చీల్లో కూర్చొన్న ఆ ఇద్దరూ కూడా ఎమోషనల్ అవుతూ కనిపించారు. నిజానికి 'సరిలేరు నీకెవ్వరు' సినిమాపై తన సినిమా గెలవాలనే పట్టుదలతో బన్నీ ఉన్నాడంటూ ఇంతదాకా బాగా ప్రచారంలోకి వచ్చింది. ఆ సినిమా జనవరి 11న వస్తుండటం వల్ల ఓపెనింగ్స్ విషయంలో ఆ సినిమాకు ఎక్కువ బెనిఫిట్ ఉంటుంది కాబట్టి, జనవరి 10నే 'అల.. వైకుంఠపురములో' మూవీని రిలీజ్ చేయాల్సిందిగా అతను నిర్మాతలపై తీవ్ర ఒత్తిడి తీసుకు వస్తున్నాడంటూ సోషల్ మీడియాలో విరివిగా ప్రచారం జరిగింది. యాక్టివ్ ప్రొడ్యూసర్స్ గిల్డ్ జోక్యంతో ఇదివరకు అనుకున్న విధంగానే ఆ సినిమా జనవరి 12న వస్తోంది. అయితే తన స్పీచ్‌లో మహేశ్ సినిమా 'సరిలేరు నీకెవ్వరు' కూడా బాగా ఆడాలని తాను కోరుకుంటున్నానని చెప్పడం ద్వారా బన్నీ చాలామంది హృదయాల్ని గెలిచాడు. అంతేనా.. మహేశ్‌ని ఇష్టపడేవాళ్లు చాలామంది ఉంటారనీ, ఆయన ఫ్యాన్స్ చాలామంది ఉంటారనీ, ఈ సంక్రాంతి వాళ్లందరికీ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని చెప్పాడు. ఈ మాటలతో అప్పటి దాకా సోషల్ మీడియాలో తనపై జరిగిన ప్రచారానికి అతను చెక్ చెప్పినట్లయింది.
రానున్న రోజుల్లో మనం మెగా క్యాంపుతో సంబంధం లేని, అల్లు ఫ్యామిలీ హీరో అనే సొంత వ్యక్తిత్వంతో బన్నీని మనం చూడవచ్చు. ఇందుకు అన్నిరకాల అండదండలు ఇచ్చేందుకు అతని బ్రదర్స్ సిద్ధంగా ఉన్నారు. మరోవైపు 'అల్లు ఆర్మీ' కూడా ఉన్నదాయె. భవిష్యత్తులో అల్లు అర్జున్ కదలికలు ఎలా ఉంటాయన్నది చూడాల్సిందే.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
