బిగుస్తున్న ఉచ్చు.. రాజమౌళి ఏం చెయ్యాలనుకుంటున్నాడు?
on Nov 20, 2025
- రాజమౌళిపై రాజాసింగ్ ఫైర్
- వివాదంపై స్పందించిన బండి సంజయ్
- విజయేంద్రప్రసాద్ స్టెప్ ఏమిటి?
దర్శకుడు రాజమౌళిని చుట్టుముట్టిన ఆంజనేయ స్వామి వివాదం మరింత ముదిరేలా కనిపిస్తోంది. తనకు దేవుడి మీద అంతగా నమ్మకం లేదని ‘వారణాసి’ మూవీ ఈవెంట్‌లో మాట్లాడిన రాజమౌళి.. ఆంజనేయ స్వామి గురించి చేసిన కొన్ని వ్యాఖ్యలు ఇప్పుడు మీడియాలో, సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి. అతని వ్యాఖ్యలను కొన్ని హిందూ సంఘాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఇప్పటికే రాష్ట్రీయ వానరసేన సంఘ సభ్యులు సరూర్‌నగర్ పోలీస్ స్టేషన్‌లో రాజమౌళిపై ఫిర్యాదు చేశారు. ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు రాజమౌళిపై ఎలాంటి కేసు నమోదు చేయలేదని తెలుస్తోంది. దీనిపై ప్రాథమిక విచారణ జరుపుతున్నారని సమాచారం.
మరో పక్క కేంద్ర మంత్రి, బీజేపీ నాయకుడు బండి సంజయ్ కూడా రాజమౌళి వ్యాఖ్యలపై స్పందించారు. ఆయన స్వయంగా దీనిపై మాట్లాడకపోయినా, మీడియా రాజమౌళి ప్రస్తావన తీసుకురావడంతో ‘ఎవరి మనసుకు నచ్చింది వారు చేస్తారు.. ఆయనకు దేవుడి మీద నమ్మకం లేదు. అతనికి నమ్మకం కలిగేలా ఆ దేవుడు చెయ్యాలని, అతను నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటున్నాను’ అంటూ ముగించారు. వాస్తవానికి ఈ వివాదంపై వ్యాఖ్యానించడానికి బండి సంజయ్ సిద్ధంగా లేరనేది అతని మాటల్ని బట్టి అర్థమవుతోంది.
Also Read: ఐబొమ్మవన్‌తో ఇండస్ట్రీకి షాక్.. రంగంలోకి దిగిన పోలీసులు!
ఇదిలా ఉంటే.. ఎమ్మెల్యే రాజాసింగ్ ఈ వివాదంపై తీవ్రంగా స్పందించారు. ‘హిందువులెవరూ రాజమౌళి సినిమాలు చూడొద్దు. మూవీ ప్రమోషన్ కోసం హనుమంతుడిపై వ్యాఖ్యలు చేస్తారా? నమ్మకం లేదంటూనే దేవుళ్లపై సినిమాలు తీసి కోట్లు సంపాదిస్తున్నారు రాజమౌళి. అతను నిజంగా నాస్తికుడైతే ఆ మాటే చెప్పాలి. గతంలో కూడా హిందూ దేవుళ్లపై ఇలాగే మాట్లాడారు. హిందూ ధర్మం గురించి తప్పుగా మాట్లాడితే ఏం జరుగుతుందో చూపిస్తాం’ అంటూ నాస్తిక డైరెక్టర్ల సినిమాలు ప్రేక్షకులు చూడొద్దు అని పిలుపునిచ్చారు.
మీడియాలో, సోషల్ మీడియాలో రాజమౌళిపై ట్రోలింగ్ జరుగుతున్నా, బీజేపీ నేతలు, హిందూ సంఘాలు విమర్శిస్తున్నా.. రాజమౌళి మాత్రం దీనిపై పెదవి విప్పడం లేదు. ఈ వివాదం మొదలై మూడు రోజులైనప్పటికీ అతని నుంచి ఎలాంటి స్పందన లేకపోవడం అందరికీ ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. ఇక రాజమౌళి తండ్రి విజయేంద్రప్రసాద్ విషయానికి వస్తే.. అతను ఆంజనేయ భక్తుడు అనే విషయాన్ని రాజమౌళే స్వయంగా చెప్పారు. అదీగాక విజయేంద్రప్రసాద్‌కు బీజేపీ ప్రభుత్వం రాజ్యసభ సభ్యుడిగా అవకాశం ఇచ్చింది.
Also Read: ఐబొమ్మ రవి అరెస్ట్.. తిమింగలాన్ని వదిలేసి చిన్న చేపను పట్టుకున్నారా..?
ఆంజనేయ స్వామిపై రాజమౌళి లేవనెత్తిన వివాదం రోజురోజుకీ ముదురుతున్న నేపథ్యంలో విజయేంద్రప్రసాద్ స్టెప్ ఏమిటి అనేది ఆసక్తికరంగా మారింది. కొడుకు చేసిన వ్యాఖ్యలను సమర్థిస్తారా? లేక బీజేపీ తరఫున, హిందూ సంఘాల తరఫున నిలబడతారా? అనేది తెలియాల్సి ఉంది. రాజమౌళి వ్యాఖ్యలను విజయేంద్రప్రసాద్ వ్యతిరేకించే పక్షంలో అతనితోనే ఈ వివాదానికి తెరదించాల్సిన అవసరం ఉంది. జరుగుతున్న పరిణామాలను బట్టి చూస్తే మీడియా ముందుకు వచ్చి తన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవడం, హిందువులకు క్షమాపణ చెప్పడం రాజమౌళికి తప్పదు అనిపిస్తోంది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



