ఐబొమ్మవన్‌తో ఇండస్ట్రీకి షాక్.. రంగంలోకి దిగిన పోలీసులు!
on Nov 20, 2025
పైరసీ ద్వారా తెలుగు చిత్ర పరిశ్రమను ముప్పు తిప్పలు పెట్టిన ఐబొమ్మ, బప్పం టీవీలను ఎట్టకేలకు క్లోజ్ చేశారు పోలీసులు. ఈ వెబ్‌సైట్‌ను నిర్వహిస్తున్న ఇమ్మడి రవిని అరెస్ట్ చేసి రిమాండ్‌కి పంపారు. ఐబొమ్మ సమస్య సమసిపోయేలా చేసిన పోలీసులను చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖులు అభినందిస్తున్నారు. అయితే ఈ ఆనందం ఎక్కువ కాలం ఉండదనే అనిపిస్తోంది. ఎందుకంటే ఇప్పుడు ఐబొమ్మవన్ అంటూ మరో వెబ్‌సైట్ పుట్టుకొచ్చింది. అయితే అందులో సినిమా ఈవెంట్స్, రివ్యూలు కనిపిస్తున్నాయి. వాటిని క్లిక్ చేస్తే మూవీ రూల్జ్ అనే పైరసీ వెబ్‌సైట్‌కి రీడైరెక్ట్ అవుతోందంటూ సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.
ఐబొమ్మవన్ అనే సైట్‌కి సంబంధించి పోలీసులు స్పందించారు. అందులోని కంటెంట్‌ని క్లిక్ చేయడం వల్ల మూవీరూల్జ్‌కి రీడైరెక్ట్ అవుతోందని వస్తున్న వార్తల్లో నిజం లేదని పోలీసులు క్లారిటీ ఇచ్చారు. ఇదిలా ఉంటే.. గురువారం ఇమ్మడి రవిని కస్టడీలోకి తీసుకొని పైరసీ సైట్లకు సంబంధించిన అన్ని వివరాలను రాబట్టే పనిలో ఉన్నారు పోలీసులు.
కొత్తగా పుట్టుకొచ్చిన ఐబొమ్మవన్ వెబ్‌సైట్‌కి ఎకో సిస్టమ్‌లో 65 మిర్రర్ వెబ్‌సైట్స్ ఉన్నాయని తెలుస్తోంది. ఐబొమ్మ ఆగిపోలేదు అని చెప్పడం కోసమే ఐబొమ్మవన్ అనే వెబ్‌సైట్‌ను సృష్టించి ప్రేక్షకుల్ని మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారని పోలీసులు చెబుతున్నారు. మరో పక్క మూవీ రూల్జ్, తమిళవన్ వంటి పైరసీ వెబ్‌సైట్లను బ్యాన్ చెయ్యాలని ఇండస్ట్రీ పెద్దలు కోరుతున్నారు. ఇప్పటికే ఐబొమ్మను క్లోజ్ చేయించారు కాబట్టి త్వరలోనే మిగతా పైరసీ సైట్లపై కూడా పోలీసులు దృష్టి పెట్టే అవకాశం వుంది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



