అల్లు అర్జున్ 'తగ్గేదే లే'ను ప్రపంచవ్యాప్తంగా ఇమిటేట్ చేస్తున్నారు!
on Dec 27, 2021

సుకుమార్ డైరెక్ట్ చేసిన 'పుష్ప' మూవీలో టైటిల్ పాత్రధారిగా అల్లు అర్జున్ ప్రదర్శించిన నటనకు సర్వత్రా ప్రశంసలు లభిస్తున్నాయి. ప్రేక్షకులు ఆయన అభినయానికి నీరాజనాలు పలుకుతున్నారు. ఆంధ్రప్రదేశ్ మినహా దాదాపు అన్నిచోట్లా పుష్ప బ్రేకీవెన్ కావడమో, లాభాల్లోకి రావడమో జరుగుతోంది. 'పుష్ప'లో బన్నీ నటనను పీపుల్స్ స్టార్ ఆర్. నారాయణమూర్తి కూడా తెగ మెచ్చుకున్నారు. ప్రపంచవ్యాప్తంగా అల్లు అర్జున్ చెప్పిన "తగ్గేదే లే" డైలాగ్‌ను, ఆ సందర్భంగా అతని మేనరిజంను ఇమిటేట్ చేస్తున్నారని అన్నారు. అంతే కాదు, మలయాళంలో మోహన్‌లాల్, మమ్ముట్టి తర్వాత అల్లు అర్జున్‌ను టాప్ హీరో అంటున్నారని ఆకాశానికెత్తారు.
నాని టైటిల్ రోల్ చేసిన 'శ్యామ్ సింగ రాయ్' సక్సెస్ సెలబ్రేషన్స్ ఈరోజు హైదరాబాద్‌లో జరిగాయి. ఈ వేడుకల్లో గెస్ట్‌గా పాల్గొన్న నారాయణమూర్తి మాట్లాడుతూ, "ఇటీవల నేను కేరళ వెళ్లాను. ఒక చిన్న హోటల్‌లో దిగాను. అక్కడ పనిచేసే వెయిటర్ తమ్ముళ్లు నా దగ్గరకు వచ్చారు. ఒకతను 'ఈయన చాలా పెద్ద హీరో'.. అని మిగతా వాళ్లకు పరిచయం చేస్తున్నాడు. 'పెద్ద హీరో అయితే ఈ హోటల్‌కు ఎందుకొచ్చాడు?' అని వాళ్లడిగారు. 'ఆయనంతే' అని అతను చెప్పాడు. నేను వాళ్లను దగ్గరకు రమ్మని పిలిచి, ఇక్కడ టాప్ యాక్టర్స్ ఎవరని అడిగాను. మీరు నమ్ముతారా? ఒకతను 'మోహన్‌లాల్, మమ్ముట్టి, అల్లు అర్జున్' అని చెప్పాడు. అంటే అర్జున్ మలయాళం టాప్ యాక్టర్లలో ఒకడైపోయాడు." అని చెప్పారు.
"ఇదివరకు మనం 'షోలే'లో అమ్జాద్ ఖాన్, 'దీవార్'లో అమితాబ్ బచ్చన్, శశికపూర్, 'బాషా'లో రజనీకాంత్ చెప్పిన డైలాగ్స్‌కు క్లాప్స్ కొట్టి మాట్లాడుకున్నాం. ఇవాళ అల్లు అర్జున్ 'తగ్గేదే లే' అంటుంటే, ఆ మాటను ఇవాళ ప్రపంచవ్యాప్తంగా ఇమిటేట్ చేస్తున్నారు. అదీ మన తెలుగు హీరోల, దర్శకుల, తెలుగు చిత్రపరిశ్రమ గొప్పతనం. దానికి మనం గర్వించాలి. ఇవాళ మనం పండగ చేసుకుంటున్నాం." అని అన్నారు నారాయణమూర్తి.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



