2021 జ్ఞాపకాలుః ఫస్ట్ సక్సెస్ చూసిన తారలు!
on Dec 27, 2021

ఇప్పటికే కొన్ని సినిమాలు చేసినా విజయాలు దక్కని కొందరి తారలకు.. 2021 సంవత్సరం ఫస్ట్ సక్సెస్ అందించింది. ఆ తారల వివరాల్లోకి వెళితే..
అఖిల్ అక్కినేనిః
బుడిబుడి అడుగుల ప్రాయంలోనే `సిసింద్రీ`తో బ్లాక్ బస్టర్ చూసిన అఖిల్ అక్కినేని.. కథానాయకుడిగా మాత్రం వెంటనే సక్సెస్ అందుకోలేకపోయాడు. `అఖిల్`, `హలో`, `మిస్టర్ మజ్ను` ఇలా హీరోగా నటించిన మొదటి మూడు సినిమాలతో నిరాశపడ్డ అఖిల్ కి.. 2021 దసరా స్పెషల్ గా రిలీజైన `మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్`తో కథానాయకుడిగా ఫస్ట్ సక్సెస్ దక్కింది.
వరలక్ష్మీ శరత్ కుమార్ః
`తెనాలి రామకృష్ణ బీఏ బీఎల్`తో టాలీవుడ్ లో లేడీ విలన్ గా నేరుగా ఎంట్రీ ఇచ్చిన వరలక్ష్మీ శరత్ కుమార్ కి.. ఈ ఏడాది ఆరంభంలో విడుదలైన `క్రాక్`తో ఫస్ట్ సక్సెస్ దక్కింది. సంక్రాంతి బ్లాక్ బస్టర్ గా నిలిచిన `క్రాక్`లో జయమ్మగా తన విలనిజంతో భయపెట్టి నటిగా మంచి మార్కులు కొట్టేసింది వరలక్ష్మి.
ప్రగ్యా జైశ్వాల్ః
`డేగ`, `మిర్చిలాంటి కుర్రాడు`, `కంచె`, `ఓం నమో వేంకటేశాయ`, `గుంటూరోడు`, `నక్షత్రం`, `జయ జానకి నాయక`, `ఆచారి అమెరికా యాత్ర`.. ఇలా ఇప్పటికే కొన్ని తెలుగు సినిమాల్లో నటించినప్పటికీ సాలిడ్ హిట్ అందుకోలేకపోయిన ప్రగ్యా జైశ్వాల్ కి `అఖండ`తో ఆ ముచ్చట తీరింది. డిసెంబర్ 2న విడుదలైన ఈ బ్లాక్ బస్టర్ మూవీలో నటసింహం నందమూరి బాలకృష్ణ సరసన అభినయానికి ప్రాధాన్యమున్న పాత్రలో అలరించింది ప్రగ్య.
మాళవికా శర్మః
మాస్ మహారాజా రవితేజ నటించిన `నేల టిక్కెట్టు`తో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన మాళవికా శర్మ.. ఈ సంవత్సరం సంక్రాంతికి రిలీజైన `రెడ్`తో చెప్పుకోదగ్గ సక్సెస్ చూసింది. ఇందులో ఎనర్జిటిక్ స్టార్ రామ్ కి జోడీగా కనువిందు చేసింది మాళవిక.
మేఘా ఆకాశ్ః
`లై`, `ఛల్ మోహన్ రంగ` వంటి చిత్రాలతో తెలుగు కుర్రకారుని అలరించిన మేఘా ఆకాశ్ కి.. శ్రీవిష్ణుకి జంటగా నటించిన `రాజ రాజ చోర`తోనే తొలి విజయం దక్కింది. ఆగస్టు 19న ఈ సినిమా జనం ముందు నిలిచింది.
వీరితో పాటు `జాతిరత్నాలు` దర్శకుడు అనుదీప్ కూడా ఈ ఏడాదే కెరీర్ లో ఫస్ట్ సక్సెస్ చూశాడు. గతంలో `పిట్టగోడ` అనే డీసెంట్ మూవీని అనుదీప్ డైరెక్ట్ చేశాడు.
మొత్తమ్మీద.. 2021 క్యాలెండర్ ఇయర్ కొందరికి తొలి విజయాలు అందించి లక్కీ ఇయర్ గా నిలిచిందనే చెప్పాలి.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



