ఇజం... పూరి పేల్చిన పచ్చి అబద్దం
on Oct 27, 2016
ఇజం బాలీవుడ్ కి వెళ్తుందంటూ ఓ బాంబు పేలింది. దక్షిణాదిలో సూపర్ హిట్లు అయిన సినిమాల్ని బాలీవుడ్‌లో రీమేక్ చేస్తారని తెలుసు. అక్కడి యావరేజ్ స్టోరీల్నీ మనవాళ్లు ఎత్తేస్తారని తెలుసు. అయితే... ఇక్కడ ఫ్లాప్ అయిన ఇజం లాంటి సినిమాల్ని బాలీవుడ్‌లో కోట్లు పోసి కొంటారా, తీస్తారా?? ఇవన్నీ అనుమానించాల్సిన విషయాలే. ఇంతకు ముందు పూరి జగన్నాథ్ ఇలాంటి జోకులు చాలా వేశాడు. బిజినెస్ మేన్ సినిమాని బాలీవుడ్‌లో రీమేక్ చేయాలని ఉందని, ఆ సినిమాని తనతోనే రీమేక్ చేయాలంటూ అభిషేక్ బచ్చన్ కాళ్లూ, వేళ్లూ, గడ్డం పట్టుకొని తెగ బతిమాలేస్తున్నట్టు చెప్పుకొచ్చాడు అప్పట్లో. కానీ ఆ తరవాత ఆ ఊసే తీయలేదు. ఆ తరవాత టెంపర్ సినిమాకీ ఇలాంటి స్టోరీనే వినిపించాడు.
ఇప్పుడు ఇజంపై పడ్డాడు. ఇజం సినిమాని సల్మాన్ ఖాన్‌తో రీమేక్ చేస్తానంటూ... ఓ ఫీలర్ వదిలాడు పూరి. ఇజం ఇక్కడ ఏమాత్రం ఊడబొడిచేసిందో అందరికీ తెలిసిన విషయమే. కల్యాణ్ రామ్ రూ.25 కోట్లు పెడితే... అందులో సగానికి సగం పోయింది. అంత మహత్తర కథ, టేకింగూ తో సినిమా తీశాడు పూరి. ఇక కథలే లేవన్నట్టు, పూరిని మించిన దర్శక మొనగాడు దొరకడన్నట్టు సల్మాన్ ఖాన్ ఈ సినిమాని హిందీలో తీస్తాడా?? ఇలాంటి ఫీలర్లు నమ్మాలా? జస్ట్ `ఇజం` కోసం ఇదో పబ్లిసిటీ స్టంట్ అనుకోవాలంతే. టాలీవుడ్‌లోనే పూరిని ఏ హీరో నమ్మడం లేదు. అలాంటిది సల్మాన్ ఖాన్ ఎందుకు నమ్ముతాడు చెప్పండి. మన పిచ్చి కాకపోతే.