టాలీవుడ్ గోల్డెన్ గాళ్‌కు బాలీవుడ్‌లో గోల్డెన్ ఛాన్స్!
on Feb 15, 2020
టాలీవుడ్‌లో లేటెస్టుగా 'అల.. వైకుంఠపురములో' వంటి బ్లాక్‌బస్టర్ హిట్ కొట్టిన పొడుగుకాళ్ల సుందరి పూజా హెగ్డే ఇప్పుడు బాలీవుడ్‌లో సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ సరసన నటించే ఛాన్స్ కొట్టేసింది. నదియడ్‌వాలా గ్రాండ్‌సన్ ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థ నిర్మించ తలపెట్టిన 'కభీ ఈద్ కభీ దీవాళీ' మూవీలో ఆమె హీరోయిన్‌గా ఎంపికైంది. ఈ విషయన్ని ఆ సంస్థ తన ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా తెలిపింది. "నదియడ్‌వాలా గ్రాండ్‌సన్ ఎంటర్‌టైన్‌మెంట్ ఫ్యామిలీలోకి పూజా హెగ్డేకు మరోసారి స్వాగతం. సల్మాన్ ఖాన్ హీరోగా సాజిద్ నదియడ్‌వాలా నిర్మిస్తోన్న 'కభీ ఈద్ కభీ దీవాళీ' మూవీలో ఆమె జాయిన్ అవుతోంది. ఫరాద్ సాంజి డైరెక్టర్" అని ఆ సంస్థ ట్వీట్ చేసింది.
ఇదే సంస్థ ఇదే డైరెక్టర్‌తో తీసిన లేటెస్ట్ సూపర్ హిట్ ఫిల్మ్ 'హౌస్‌ఫుల్ 4'లోనూ పూజా ఒక హీరోయిన్‌గా నటించింది. ఆ మూవీలో ఆమె నటనతో పాటు, ఒక ప్రొఫెషనల్‌గా ఆమె వ్యవహార శైలి నచ్చడంతో వెంటనే మరో సినిమాలో.. అదీ సల్మాన్ జోడీగా ఆమెను తీసుకున్నారు దర్శక నిర్మాతలు. సల్మాన్ కూడా 'హౌస్‌ఫుల్ 4'లో పూజ నటనకు ఇంప్రెస్ అయ్యాడనీ, అందుకే ఆయన కూడా ఆమె ఎంపికపై ఆమోద ముద్ర వేశాడనీ బాలీవుడ్ వర్గాలు తెలిపాయి. హిందీలో హృతిక్ రోషన్ జోడీగా నటించిన 'మొహంజో దారో' సినిమాతో బాలీవుడ్‌లో అడుగుపెట్టిన పూజాకు ఆ సినిమా ఫెయిల్యూర్‌తో వెంటనే అక్కడ ఆఫర్లు రాలేదు.
దాంతో ఆమె తిరిగి టాలీవుడ్‌కు వచ్చి, స్వల్పకాలంలోనే టాప్ హీరోయిన్ రేంజికి ఎదిగింది. 'అరవింద సమేత.. వీరరాఘవ', 'మహర్షి', 'అల వైకుంఠపురములో' వంటి భారీ హ్యాట్రిక్ హిట్లతో యమ జోరుమీదుంది. ప్రస్తుతం ప్రభాస్ సరసన 'జాన్' (వర్కింగ్ టైటిల్), అఖిల్ జోడీగా 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్' సినిమాల్లో నటిస్తోంది. కొంత గ్యాప్ తర్వాత హిందీలో వచ్చిన 'హౌస్‌ఫుల్ 4' సినిమా చాన్సును రెండు చేతులా అందుకొని చక్కగా నటించి, మంచి పేరు తెచ్చుకుంది. ఆ సినిమా హిట్టవడం, అదే బ్యానర్ తీస్తున్న తదుపరి సినిమాలో హీరోయిన్ ఛాన్స్ పొందడంతో పూజ కెరీర్ జెట్ స్పీడ్‌లో దూసుకు పోతుందని చెప్పాలి.