రామేశ్వరం పోయినా శనీశ్వరం తప్పలేదంటే ఇదేనేమో!
on Nov 6, 2017
పాపం.. కొన్నేళ్ల తర్వాత హిట్ వచ్చింది రాజశేఖర్‌కి. ఆ ఆనందాన్ని కొన్ని రోజులైనా ఎంజాయ్ చేయకుండా.. ఈ ఉపద్రవాలేంటి చప్మా! మొన్నమధ్య ఔటర్ రింగ్ రోడ్ లో యాక్సిడెంట్ రచ్చ రచ్చ చేసుకున్నాడు. ఆ గోలను ‘గరుడ వేగ’ విజయం.. మరిచిపోయేట్టు చేసిందే అనుకుంటే.. ఇప్పుడు యాక్సిండెంట్ చేసే బాధ్యత తన కుమార్తె రత్నం శివాని తీసుకుంది. బంజారాహిల్స్ రోడ్ నంబర్ 73లోని నవ నిర్మాణ నగర్ లో ‘ఏపీ 13ఈ 1234’ నంబర్ గల కారులో వేగంగా వస్తూ... స్పీడ్ బ్రేకర్లను దాటించబోయి అదుపు తప్పి పక్కనే పార్క్ చేసి ఉన్న ఓ పారిశ్రామిక వేత్త కారును ఢీ కొట్టింది. ఇంకేముంది మళ్లీ రచ్చ మొదలైంది. పోలీసులు ఘటనా స్థలికి చేరుకున్నారు.. కేసు నమోదైంది. రాజశేఖర్ సతీసమేతంగా అక్కడకు వేంచేశారు. ఆ పారిశ్రామిక వేత్తగారూ.. ’తాను 30 లక్షలు వెచ్చించి ఇటీవలే ఈ కారు కొన్నాను.. నా 30 లక్షలు నాకివ్వండి’ అని మారాం చేస్తున్నాడు. ప్రస్తుతం వ్యవహారం పోలీస్ స్టేషన్ లో ఉంది. రామేశ్వరం పోయినా శనీశ్వరం తప్పలేదంటే ఇదేనేమో!