ఆ రెండు చానళ్లపై కె.ఎస్. రామారావు ఫైర్!
on Aug 24, 2019
శుక్రవారం విడుదలైన 'కౌసల్య కృష్ణమూర్తి' సినిమా సమర్పకులు, క్రియేటివ్ కమర్షియల్స్ బేనర్‌పై ఎన్నో సూపర్ హిట్ సినిమాల్ని అందించిన సీనియర్ ప్రొడ్యూసర్ కె.ఎస్. రామారావు రెండు తెలుగు న్యూస్ చానళ్లు.. టీవీ9, ఎన్‌టీవీపై ఆగ్రహాన్నీ, ఆక్రోశాన్నీ వ్యక్తం చేశారు. యాక్టివ్ ప్రొడ్యూసర్స్‌గా ఆ రెండు చానళ్లను తాము ఎంకరేజ్ చేస్తూ వస్తుంటే, ఇవాళ తమ సినిమా ఈవెంట్‌ను లైవ్ టెలిక్యాస్ట్ చేస్తున్నామని చెప్పి కూడా చెయ్యలేదని ఆవేదన వ్యక్తం చేశారు. చిన్న సినిమాలపై ఇంత చిన్న చూపా? అని ప్రశ్నించారు. ఇది తమను అవమాన పరచినట్లుగా భావిస్తున్నామని రామారావు అన్నారు.
ఐశ్వర్యా రాజేశ్ నాయికగా, భీమనేని శ్రీనివాసరావు డైరెక్ట్ చేసిన 'కౌసల్య కృష్ణమూర్తి' మూవీ ఆగస్ట్ 23న విడుదలై విమర్శకుల ప్రశంసలు పొందుతూ, ప్రేక్షకుల ఆదరణను అందుకుంటోంది. ఈ నేపథ్యంలో శనివారం ఫిలింనగర్ కల్చరల్ సెంటర్‌లో ఆ మూవీ సక్సెస్ మీట్‌ను ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో రామారావు మాట్లాడుతూ "మా సినిమా ప్రి రిలీజ్ ఫంక్షన్ చేస్తే టీవీ 9, ఎన్టీవీ లైవ్ టిలికాస్ట్ చేస్తున్నామని చెప్పారు. ఎల్.ఎల్.పీ. ద్వారా ఆ రెండింటినీ మేం ఎంకరేజ్ చేస్తూ వస్తున్నాం. లైవ్ కోసమంటూ కెమెరాలు పెట్టారు. మేం ఫంక్షన్ పూర్తి చేసుకొని ఇంటికి వెళ్తే, టీవీలో లైవ్ రాలేదేంటని ఇంట్లోవాళ్లు అడిగారు. దాన్ని మేం చాలా షేంగా ఫీలయ్యాం. ఎందుకంటే ఆ రెండు చానల్స్‌ని నిర్మాతల తరపునా, ఇండస్ట్రీ తరపునా చాలా ఎంకరేజ్ చేస్తూ వస్తున్నాం. పెద్ద సినిమాలకు వాళ్లేం చెయ్యక్కర్లేదు. చేస్తే అది వాళ్లకు ఉపయోగం. చిన్న సినిమాల్ని బతికించడం కోసం వాటిని ఎంకరేజ్ చేస్తే, అది వాళ్లకీ గర్వకారణంగా ఉంటుంది, మరిన్ని మంచి చిన్న సినిమాలు రావడానికి ఆస్కారం కలుగుతుంది. దయచేసి ఆ చానళ్లు ఎలాంటి పక్షపాతం లేకుండా, ఎలాంటి వ్యాపార దృష్టీ లేకుండా మంచి సినిమాల్ని ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుతున్నా. లైవ్ ఆ రెండు చానళ్లకే ఎందుకిస్తున్నామో ఇప్పుడు నాకర్థం కాలేదు. చిరంజీవి గారిది కానీ, మహేశ్ బాబు గారిది కానీ చేస్తారు. బాగానే ఉంది. మాదెందుకు చెయ్యట్లేదు? మేం కూడా డబ్బులిస్తున్నాం. మేం కూడా ఆ రెండింటికే డబ్బులిచ్చి ఎంకరేజ్ చేస్తున్నాం. అలాంటిది ఆ రెండూ మా సినిమాకి లైవ్ ఇవ్వలేదని షేం ఫీలయ్యాం. మేం నిర్మాతలం కామా? మాది సినిమా కాదా? వాళ్లు లైవ్ ఇవ్వనందున మా సినిమాకు ఓపెనింగ్స్ రాలేదనే డౌట్ నాకు లేదు. మా సినిమాకు ఓపెనింగ్స్ రాకపోవడానికి వేరే రీజన్ ఉంది. సినిమా ప్రచారంలో మీడియా కూడా ఒక భాగం. అందుకని నిష్పక్షపాతంగా వ్యవహరించాలని కోరుతున్నా. ఇక నుంచీ అలాంటి తారతమ్య భేదాలు ఉండకూడదని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా" అని ఆవేదన వ్యక్తం చేశారు.