ప్రకాష్‌రాజ్... ఇదేం పిచ్చి పని?!
on Mar 2, 2017
ప్రకాష్ రాజ్ గొప్ప నటుడే కావొచ్చు. కానీ... ఎప్పుడూ ఏదో ఓ రూపంలో వివాదాల్లో ఇరుక్కొంటూనే ఉంటాడు. ప్రకాష్ రాజ్ ఆఫ్ స్క్రీన్ బిహేవియర్‌పై రకరకాల కామెంట్లు, పెదవి విరుపులు. ప్రకాష్ రాజ్ మోనార్క్ అని.. ఎప్పుడు ఎలా బిహేవ్ చేస్తాడో చెప్పలేమని చెబుతుంటారు టాలీవుడ్ జనాలు. ఆమధ్య ఓ టీవీ ఛానల్ ఇంటర్వ్యూలో కావేరీ జలాలకు సంబంధించిన ప్రశ్న అడిగితే... యాంకర్‌పై రెచ్చిపోయాడు. మైకు విసిరేసి.. వెళ్లిపోయాడు. మొన్నామధ్య తిరుపతిలో జల్లి కట్టు గురించి స్పందన అడిగితే.... ఇలానే మరీ ఓవర్‌చేశాడు. ఇప్పుడూ అంతే.
చెన్నై ఎయిర్ పోర్ట్‌లో సెల్ఫీ దిగేందుకు ప్రయత్నించిన ఓ అభిమానితో దురుసుగా ప్రవర్తించాడు ప్రకాష్ రాజ్. అతని నుంచి ఫోన్ లాక్కుని నేలకు విసిరికొట్టి, అక్కడ్నుంచి వెళ్లిపోయాడు. స్టార్, సెలబ్రెటీ హోదాలేం ఊరకే రావు. నటుల్ని స్టార్లుగా మార్చేది అభిమానులే. సినిమా చూసేవాడే లేకపోతే.. స్టార్స్ ఎక్కడి నుంచి పుట్టుకొస్తారు..?? సెల్ఫీ ఇష్టం లేకపోతే, సున్నితంగా చెప్పి తప్పించుకోవొచ్చు. అంతేగానీ.. ఫోన్లు విసిరికొట్టి, హీరోయిజం చూపించాలనుకొంటే మాత్రం... జనాల దృష్టిలో అసలైన విలన్లుగా ముద్ర పడిపోతుంది. ప్రకాష్‌రాజ్ ఈ ఆవేశాన్ని కాస్త అదుపులో పెట్టుకొంటే మంచిదేమో...?