చిరంజీవి ఔట్.. ప్రభాస్ ఇన్!
on Feb 27, 2020
ప్రస్తుతం 'ఓ డియర్' మూవీ చేస్తోన్న ప్రభాస్, దాని తర్వాత నాగ్ అశ్విన్ డైరెక్షన్‌లో చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ కాంబినేషన్‌తో సినిమా నిర్మిస్తున్నట్లు వైజయంతీ మూవీస్ అధినేత సి. అశ్వినీదత్ ప్రకటించారు. రెండే రెండు సినిమాలు.. 'ఎవడే సుబ్రమణ్యం', 'మహానటి'లతో నాగ్ అశ్విన్ కీర్తి ప్రతిష్ఠలు దేశవ్యాప్తమయ్యాయి. సావిత్రి జీవిత కథ ఆధారంగా రూపొందించిన 'మహానటి' అయితే ఏకంగా మూడు జాతీయ అవార్డులు సాధించింది. చిరంజీవి సైతం అప్పట్లో అతని డైరెక్షన్‌లో సినిమా చెయ్యాలనుకుంటున్నట్లు చెప్పారు. దానికు అనుగుణంగా 'మహానటి' తర్వాత అతను చిరంజీవి కోసం ఒక స్క్రిప్ట్ రూపొందిస్తున్నాడంటూ వార్తలు వచ్చాయి.
అశ్వినీదత్ కూడా చిరంజీవితో ఒక సినిమా నిర్మించేందుకు ప్లాన్ చేస్తున్నామని చెప్పారు. టైమ్ ట్రావెల్ కథతో నాగ్ అశ్విన్ తయారుచేసిన ఆ స్క్రిప్ట్.. ఇప్పుడు ప్రభాస్ చేతికి వచ్చిందని వినిపిస్తోంది. నాగ్ అశ్విన్ స్క్రిప్ట్ వినిపించగానే ప్రభాస్‌కు బాగా నచ్చేసిందనీ, వెంటనే ఓకే చెప్పేశాడనీ అంటున్నారు. అయితే చిరంజీవి చేయాల్సిన ఆ ప్రాజెక్ట్ ప్రభాస్‌కు ఎందుకు వెళ్లిందనే దానిపై క్లారిటీ లేదు. మొదట ఆ స్క్రిప్టును చిరంజీవికే వినిపించారనీ, కానీ అది తనకంటే ప్రభాస్‌కు బాగా సూట్ అవుతుందని ఆయన సూచించడం వల్లే ప్రభాస్ వద్దకు నాగ్ అశ్విన్ వెళ్లాడంటూ ఒక ప్రచారం నడుస్తోంది. అందులో నిజం ఎంతుందో తెలియరాలేదు. 2021లో ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లనున్నది.