అల్లు అరవింద్‌పై వాళ్లు ఫైర్ అవుతున్నారు!
on Feb 27, 2020
సంక్రాంతికి విడుదలైన 'అల.. వైకుంఠపురములో' మూవీ బ్లాక్‌బస్టర్ హిట్టయిన విషయం తెలిసిందే. త్రివిక్రమ్ డైరెక్ట్ చేసిన ఈ మూవీ ఎంత వసూలు చేసిందనే దానిపై కాంట్రవర్సీ నడుస్తున్నప్పటికీ అల్లు అర్జున్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్టయ్యిందనే విషయంలో కాంట్రవర్సీ లేదు. ఈ మూవీన్లో హారిక అండ్ హాసిని క్రియేషన్స్ అధినేత ఎస్. రాధాకృష్ణతో పాటు గీతా ఆర్ట్స్ అధినేత అల్లు అరవింద్ కూడా నిర్మాణ భాగస్వామి. 'అల.. వైకుంఠపురములో' మూవీని 'ఆల్ టైమ్ ఇండస్ట్రీ హిట్' అని కొండంత అక్షరాల్లో, దాని పక్కనే 'నాన్-బాహుబలి2' అంటూ కంట్లో నలకలంత చిన్న అక్షరాలతో భారీ ఎత్తున ప్రచారం చేయడం వెనుక ఉన్న వ్యక్తి అరవింద్ అనే విషయం కూడా ప్రపంచానికంతటికీ తెలుసు.
ఆ విషయం అలా ఉంచితే, ఈ సినిమా అమెజాన్ లేదా నెట్‌ఫ్లిక్స్ ప్లాట్‌ఫామ్స్‌లో స్ట్రీమింగ్ కాదని డిస్ట్రిబ్యూటర్లకు గతంలో నిర్మాతలు హామీ ఇచ్చినట్లు సమాచారం. అందుకే యు.ఎస్. డిస్ట్రిబ్యూటర్లు 'అల వైకుంఠపురములో' మూవీ ఆ రెండు ప్లాట్‌ఫామ్స్‌పై స్ట్రీమింగ్ కాదంటూ పోస్టర్లు కూడా రిలీజ్ చేశారు. ఓటీటీలో సినిమా వస్తుందని తెలిస్తే, థియేటర్లకు వచ్చే ప్రేక్షకుల సంఖ్య తగ్గిపోతుందనే భయం డిస్ట్రిబ్యూటర్లలో ఉంటుంది. ప్రధానంగా ఓవర్సీస్‌లో ప్రేక్షకులు థియేటర్ల కంటే ఓటీటీకే ఎక్కువ ప్రయారిటీ ఇస్తారు. కానీ ఫిబ్రవరి 26న ఇండియాలో ఈ మూవీ నెట్‌ఫ్లిక్స్‌లో ప్రత్యక్షమవడంతో డిస్ట్రిబ్యూటర్లతో పాటు, బన్నీ ఫ్యాన్స్ కూడా షాకయ్యారు. నిజానికి ఈ మూవీ జెమిని టీవీకి చెందిన స్ట్రీమింగ్ చానల్ సన్ నెక్స్ట్‌లో 26న స్ట్రీమింగ్ కావాలి. ఆ మూవీ డిజిటల్ హక్కులు కొనుగోలు చేసింది ఆ చానలే. కానీ దానికంటే ముందు నెట్‌ఫ్లిక్స్‌లో ఆ సినిమా స్ట్రీమింగ్ కావడంతో అంతా హతాశులయ్యారు. యు.ఎస్. డిస్ట్రిబ్యూటర్లయితే అల్లు అరవింద్‌పై కారాలు మిరియాలు నూరుతున్నట్లు సమాచారం. ఎందుకంటే యు.ఎస్.లో ఆ మూవీ ఇంకా ఆడుతూనే ఉంది. అక్కడ ఈ రోజు రాత్రి నుంచి ఈ సినిమా స్ట్రీమింగ్ కానున్నది. ఓటీటీలో ఈ సినిమా ప్రత్యక్షమయితే కలెక్షన్లపై అది తీవ్ర ప్రభావం పడుతుందని డిస్ట్రిబ్యూటర్లు వాపోతున్నారు.
మరోవైపు సంక్రాంతికే విడుదలైన మహేశ్ మూవీ 'సరిలేరు నీకెవ్వరు' ఇంకా ఓటీటీలో దర్శనమివ్వలేదు. ఓటీటీ హక్కుల్ని అమెజాన్ ప్రైమ్ కొనుగోలు చేసింది. మార్చి 2న ఆ చానల్లో 'సరిలేరు నీకెవ్వరు' స్ట్రీమింగ్ అవుతుందనే విషయం ప్రచారంలోకి వచ్చింది కానీ, అది కన్ఫాం కాలేదు. మార్చి 2న కాకపోతే 6న స్ట్రీమింగ్ అవుతుందని కూడా ఇంకో ప్రచారం నడుస్తోంది. ఏదేమైనా 'సరిలేరు నీకెవ్వరు' కంటే తమ సినిమాకే ఎక్కువ కలెక్షన్లు వచ్చాయని చెప్పుకుంటూ వచ్చిన బన్నీ ఫ్యాన్స్, ఇప్పుడు ఆ సినిమా కంటే ముందే 'అల వైకుంఠపురములో' ఓటీటీపై ప్రత్యక్షం కావడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. ఇప్పటికీ థియేటర్ల నుంచి షేర్ వస్తుండగా, ప్రొడ్యూసర్లు ఇలా చేయడం ఏమిటంటూ వాళ్లు ఫైర్ అవుతున్నారు.