బాలయ్య బ్లాక్ బస్టర్ మూవీ `పెద్దన్నయ్య`కి పాతికేళ్ళు!
on Jan 10, 2022

`అపూర్వ సహోదరులు` (1986) నుంచి `అఖండ` (2021) వరకు నటసింహా నందమూరి బాలకృష్ణ దాదాపు 18 చిత్రాల్లో ద్విపాత్రాభినయం చేశారు. వాటిలో పలు సినిమాలు విజయపథంలో పయనించాయి. ఇక బాలయ్య లక్కీ సీజన్ సంక్రాంతికి సందడి చేసిన తన ఫస్ట్ పొంగల్ డ్యూయెల్ రోల్ మూవీగా `పెద్దన్నయ్య`(1997)కి ప్రత్యేక స్థానం ఉంది. తమ హోమ్ బేనర్ రామకృష్ణా హార్టికల్చరల్ సినీ స్టూడియోస్ పతాకంపై నిర్మితమైన ఈ చిత్రంలో రామకృష్ణ ప్రసాద్, భవానీ ప్రసాద్ గా రెండు విభిన్న పాత్రల్లో అన్నదమ్ములుగా కనిపించారు బాలయ్య. రెండు వేషాల్లోనూ తనదైన అభినయంతో మెప్పించారాయన.
బాలకృష్ణకి జోడీగా రోజా, ఇంద్రజ నటించిన ఈ సినిమాలో రాజ్ కుమార్, అచ్యుత్, శుభశ్రీ, లతాశ్రీ, అన్నపూర్ణ, కోట శ్రీనివాసరావు, చరణ్ రాజ్, శ్రీహరి, బ్రహ్మానందం, సుధాకర్, విజయ రంగరాజు, చలపతి రావు, ఎం. బాలయ్య, రాజా రవీంద్ర, రాజీవ్ కనకాల, ప్రసాద్ బాబు ఇతర ముఖ్య పాత్రల్లో దర్శనమిచ్చారు. ఫ్యామిలీ ఎంటర్టైనర్స్ కి కేరాఫ్ అడ్రస్ గా నిలిచిన దర్శకుడు శరత్ ఈ సినిమాని జనరంజకంగా తెరకెక్కించారు.
కోటి సంగీత సారథ్యంలో రూపొందిన పాటలన్నీ ప్రజాదరణ పొందాయి. ``కుటుంబం అన్నగారి కుటుంబం``, ``చిక్కింది చేమంతి పువ్వు``, ``కలలో కళ్యాణమాల``, ``నీ అందమంతా``, ``చక్కిలాల చుక్క``, ``ఓ ముస్తఫా``.. ఇలా ఇందులోని ప్రతీ గీతం రంజింపజేసింది. నందమూరి మోహనకృష్ణ ఛాయాగ్రహణం, పరుచూరి బ్రదర్స్ సంభాషణలు ఈ చిత్రానికి అదనపు బలంగా నిలిచాయి. సంక్రాంతి కానుకగా 1997 జనవరి 10న విడుదలై బ్లాక్ బస్టర్ బాట పట్టిన బాలయ్య `పెద్దన్నయ్య`.. నేటితో 25 వసంతాలు పూర్తిచేసుకుంటోంది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



