మా పేమెంట్లు ఇవ్వండి. లేకపోతే ఆత్మహత్యలు చేసుకుంటాం!
on May 18, 2020
కరోనా ఎంతమంది జీవితాలపై కాటు వేస్తుందో చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ. వైరస్ బారిన పడి మరణిస్తున్న వారు కొందరైతే, కరోనా కాటువల్ల ఏర్పడిన పరిస్థితుల వల్ల ఆత్మహత్యలకు సిద్ధపడుతున్న వారు కొందరు ఉన్నారు. లాక్ డౌన్ వల్ల షూటింగులు లేక ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ తో ముంబైలో హిందీ షోస్ చేసే పంజాబీకి చెందిన యాక్టర్ మన్మీత్ గ్రేవాల్ ఆత్మహత్య చేసుకున్నాడు. నిర్మాతలు పేమెంట్స్ ఇవ్వకపోతే ఆత్మహత్య పరిష్కారమని జి ఛానల్ లో ప్రసారమయ్యే 'హమారీ బహు సిల్క్' సిబ్బంది సైతం చెబుతున్నారు. నటి జాన్ ఖాన్ ఇంస్టాగ్రామ్ పోస్టుతో ఈ సమస్య వెలుగులోకి వచ్చింది. ఇప్పటివరకు సీరియల్ క్రూకి నిర్మాతలు జీతాలు ఇవ్వలేదట. రెండు నెలల క్రితం జరిగిన షూటింగ్ బకాయిలు ఇంకా చెల్లించలేదట. ఈ విషయం ఆమెకు తెలిసి చలించిపోయారు. ప్రజలందరికీ తెలిసేలా ఒక పోస్ట్ పెట్టారు.
"ఇప్పటివరకు 'హమారీ బహు సిల్క్' బృందానికి డబ్బులు ఇవ్వలేదని తెలిసి షాక్ అయ్యా. యాక్టర్స్, టెక్నీషియన్స్ సూసైడ్ చేసుకుంటామని చెబుతున్నారు. ఎందుకిలా జరుగుతోంది? ఈ విషయంలో బ్రాడ్ కాస్ట్స్ (సీరియల్ ప్రసారం చేస్తున్న ఛానల్) ఏదో ఒకటి చేయాలి" అని జాన్ ఖాన్ పేర్కొన్నారు. ఈ సమస్య పరిష్కారానికి సహనటులు, అభిమానుల మద్దతు ఆమె కోరారు. ఆమెకు అండగా పలువురు పోస్టులు పెట్టారు.