అలీని లిస్టులోంచి తీసేసిన పవన్?
on Jun 1, 2020
ప్రతి వేసవిలో సన్నిహితులకు మామిడిపళ్ళు పంపడం పవన్ కళ్యాణ్ అలవాటు. సేంద్రీయ పద్దతిలో తన వ్యవసాయ క్షేత్రంలో మామిడిచెట్లకు కాసిన పళ్ళను పవర్ స్టార్ పంపిస్తుంటారు. ఎవరైతే ఆ మామిడిపళ్ళు అందుకుంటారో, ఆ ప్రముఖులు సంతోషంగా సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటారు. కరోనా వేళ ఈ ఏడాది పవన్ పంపారో? లేదో? తెలియదు. ఎందుకంటే ఎవరు ట్వీట్లు, పోస్టులు చేయలేదు.
ఈ ఏడాది తనకు పవన్ మామిడిపళ్ళు రాలేదని ప్రముఖ హాస్యనటుడు అలీ చెప్పారు. రాజకీయాల్లో బిజీగా ఉండడం వల్ల పంపలేదేమో, వచ్చే ఏడాది వస్తాయని ఆశిస్తున్నానని ఆయన పేర్కొన్నారు. దీన్నిబట్టి అలీకి మాత్రమే పవన్ మామిడిపళ్ళు అందలేదని అనుకోవాలి. సినిమాలు పవన్ కళ్యాణ్, అలీని స్నేహితులు చేస్తే... రాజకీయాలు శత్రువులను చేశాయి. గత ఎన్నికల ప్రచారంలో ఇద్దరి మధ్య మాటల యుద్ధం నడిచిన సంగతి తెలిసిందే. అందువల్ల, అలీని తన లిస్టులోంచి పవన్ తీసేసి ఉండొచ్చని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. హీరోగా పవన్ తొలి సినిమా 'అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి', మొన్నటి 'అజ్ఞాతవాసి' మినహా మిగతా అన్ని సినిమాల్లో అలీ నటించారు. రాజకీయాల ఇద్దరి మధ్య దూరం పెంచాయని చెప్పుకోవాలి.