నిధి ఖాతాలో మరో రీమిక్స్
on Jun 1, 2020
తెలుగు కుర్రకారు గుండెల్లో 'ఇస్మార్ట్'గా గూడు కట్టేసుకుంది నిధి అగర్వాల్. 'సవ్యసాచి' (2018)తో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఈ అమ్మడు.. ఆపై 'మిస్టర్ మజ్ను', 'ఇస్మార్ట్ శంకర్' చిత్రాల్లో సందడి చేసింది. వీటిలో 'అక్కినేని బ్రదర్స్'తో జట్టుకట్టిన 'సవ్యసాచి' (అక్కినేని నాగచైతన్య), 'మిస్టర్ మజ్ను' (అక్కినేని అఖిల్) బాక్సాఫీస్ వద్ద బోల్తా పడగా.. ఎనర్జిటిక్ స్టార్ రామ్‌తో జోడి కట్టిన 'ఇస్మార్ట్ శంకర్' వసూళ్ల వర్షం కురిపించింది.
మొత్తంగా 'ఇస్మార్ట్ శంకర్'తో తన కెరీర్‌లో ఫస్ట్ సాలిడ్ హిట్ చూసిన నిధి.. ప్రస్తుతం తమిళ, తెలుగు చిత్రాలతో బిజీగా ఉంది. కోలీవుడ్ స్టార్ 'జయం' రవి సిల్వర్ జూబ్లీ ఫిలిమ్ 'భూమి'లో పల్లెటూరి అమ్మాయిగా నటిస్తున్న నిధి.. తెలుగులో అశోక్ గల్లా (సూపర్ స్టార్ కృష్ణ మనవడు, గల్లా జయదేవ్ తనయుడు) కథానాయకుడిగా పరిచయమవుతున్న పేరు నిర్ణయించని చిత్రంతో పాటు మాస్ మహరాజా రవితేజ - దర్శకుడు రమేష్ వర్మ కాంబినేషన్‌లో రాబోతున్న సినిమాలోనూ కథానాయికగా దర్శనమివ్వనుంది.
ఇదిలా ఉంటే.. నిధి అగర్వాల్ క్రమంగా 'రీమిక్స్ క్వీన్' అయ్యే దిశగా అడుగులు వేస్తూ ఉండడం తెలుగునాట వార్తల్లో నిలుస్తోంది. తన తొలి తెలుగు చిత్రం 'సవ్యసాచి'లో 'నిన్ను రోడ్డు మీద' ('అల్లరి అల్లుడు') రీమిక్స్‌లో సందడి చేసిన నిధి.. అశోక్ గల్లా కాంబినేషన్ మూవీలో 'జుంబారే' ('యమలీల'లో కృష్ణ స్పెషల్ సాంగ్) రీమిక్స్‌కి స్టెప్పులు వేసింది. కృష్ణ పుట్టిన రోజు సందర్భంగా విడుదల చేసిన ఈ పాట టీజర్‌కి మంచి స్పందన వస్తోంది. 'సవ్యసాచి'లో 'నిన్ను రోడ్డుమీద' రీమిక్స్ అంతగా క్లిక్ కాని నేపథ్యంలో.. 'జుంబారే' రీమిక్స్ ఎలాంటి ఫలితం అందుకుంటుందో చూడాలి మరి.
కొసమెరుపు ఏమిటంటే.. 'సవ్యసాచి' కోసం తన తండ్రి అక్కినేని నాగార్జున పాపులర్ సాంగ్‌కి చైతు చిందులేస్తే.. తన డెబ్యూ ఫిలిమ్ కోసం తాతయ్య కృష్ణ స్టెప్పులకు రీలోడెడ్ వెర్షన్‌లో అశోక్ గల్లా చిందులేశాడు.