వీలైతే క్షమించండి..లేదంటే శిక్షించండి
on Oct 6, 2016
ఉరి ఉగ్రదాడిలో అమరులైన భారత జవాన్లపై తాను చేసిన వ్యాఖ్యలపై బాలీవుడ్ నటుడు ఓంపురీ క్షమాపణలు చెప్పారు. పాకిస్తానీ నటులపై భారత్ మోషన్ పిక్షర్ ప్రొడ్యూసర్స్ అసోసియేషన్ నిషేధం విధించడంపై ఒక జాతీయ ఛానెల్ నిర్వహించిన చర్చా కార్యక్రమంలో ఓంపురీ భారత సైన్యాన్ని అవమానించే విధంగా మాట్లాడారు. అసలు వారిని ఎవరు ఆర్మీలో చేరమన్నారు...? ఎవరు వారిని ఆయుధాలు పట్టుకోమన్నారు..? అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ వ్యాఖ్యలపై దేశవ్యాప్తంగా పెద్ద దుమారమే రేగింది. సోషల్ మీడియాలో అయితే ఓంపురిని ఒక ఆట ఆడుకున్నారు నెటిజన్లు.
అక్కడితో ఆగకుండా ఏకంగా పోలీస్‌స్టేషన్‌లో సైతం కేసు నమోదు చేశారు. దీంతో తను చేసిన తప్పు తెలియరావడంతో ఓంపురి ఆర్మీకి క్షమాపణలు చెప్పాడు. తనది క్షమించరాని నేరమని, వెంటనే శిక్షించమని ప్రాధేయపడ్డాడు. అంతేకాకుండా తనకి ఆయుధాలను ఎలా వాడాలో నేర్పించాలని, ఎక్కడైతే జవాన్లు తమ ప్రాణాలను త్యాగం చేశారో ఆ ప్రాంతంలోకి తనను పంపాలన్నారు. అంతేకాకుండా క్షమించాలని మాత్రమే తాను కోరుకోవడం లేదని, తనను ఖచ్చితంగా శిక్షించాలని కోరుతున్నట్లు ఆయన ఆర్మీని కోరారు.