జాగ్వార్ మూవీ రివ్యూ
on Oct 6, 2016
లక్ష రూపాయలు పెట్టి ఓ చీర కొన్నారు.. కానీ మధ్యలో చిన్న చిల్లు ఉంది. లాభమేంటి?
మంచి టేస్టీ టేస్టీ బిరియానీ వండారు.. కానీ పది రోజుల తరవాత వడ్డించారు. రుచేముంది?
అద్భుతమైన ఇల్లు కట్టారు. కానీ పునాదులు తవ్వడం మర్చిపోయారు. విలువేముంది?
సినిమా కూడా అంతే. అన్నీ ఉన్నా.. అసలైనది లేకపోవడం ఘోరం. నేరం. మా సినిమా కోసం వంద కోట్లు ఖర్చు పెట్టాం, భారీ యాక్షన్ సీన్లు తీశాం, ఐటెమ్ సాంగులు అదరగొట్టాం.. అంటే లాభం లేదు. ప్రేక్షకుల్ని రెండు గంటల పాటు కూర్చోబెట్టగలిగే దమ్ముందా, లేదా? అనేదే ముఖ్యం. అది లేకపోతే.. అన్ని కథలూ 'జాగ్వార్' సినిమాల్లానే ఉంటాయి. ఈ ఇంట్రడక్షన్ అంతా జాగ్వార్ సినిమా కోసమే అని మీకు అర్థమైపోయి ఉంటుంది. ఇంకెందుకు ఆలస్యం?? ఆ సినిమా సంగతేంటో తేల్చేద్దాం. రండి.
* కథ
కృష్ణ (నిఖిల్ గౌడ) మాస్క్ వేసుకొని ఓ న్యాయమూర్తిని హత్య చేస్తాడు. ఇదంతా ఓ ఛానల్‌లో లైవ్ లో చూపిస్తాడు. దాంతో రాష్ట్రమంతా కలలకం రేగుతుంది. ఆ ఛానల్ శౌర్య ప్రసాద్ (సంపత్‌రాజ్)ది. తన కాలేజ్‌లోనే ఎంబీబీఎస్ సీటు సంపాదించి అందులో చేరతాడు కృష్ణ. ఈ ముసుగు వీరుడ్ని పట్టుకోవడానికి ప్రభుత్వం ఓ సీబీఐ అధికారి (జగపతిబాబు)ని నియమిస్తుంది. మాస్క్ వేసుకొన్న హంతకుడికి తాను పెట్టిన పేరు.. ఈ జాగ్వార్. మెడికల్ కాలేజీ అమ్మాయిలపై శౌర్య ప్రసాద్ కొడుకు అసభ్యంగా ప్రవర్తిస్తుంటాడు. మరోవైపు శౌర్య నడుపుతున్న ఆసుపత్రులన్నీ వ్యాపార దృక్పథంతో ఆలోచిస్తూ. ప్రజల్ని పీడిస్తుంటాయి. అందుకే కాలేజీ క్యాంపస్‌లో విద్యార్థులంతా ఏకమై గళం విప్పుతారు. విద్యార్థి నాయకుడ్ని చంపడానికి శౌర్య ప్రసాద్ ఓ ఎన్‌కౌంటర్ స్పెషలిస్టుని రంగంలోకి దింపుతాడు. తనని కూడా జాగ్వార్ చంపేస్తాడు. అసలు ఈ జాగ్వార్ ఎవరు? శౌర్య ప్రసాద్‌తో తనకున్న శత్రుత్వం ఏమిటి? జాగ్వార్ పోలీసులకు దొరికాడా, లేదా? అనేది వెండి తెరపై చూడాల్సిందే.
* విశ్లేషణ
విజయేంద్ర ప్రసాద్ అందించిన కథ అనగానే... కథలో చాలా చాలా విషయం ఉందేమో అనుకొంటారు. కానీ ఆయనేమో పరమ రొటీన్ కథ రాసుకొచ్చారు. ఆ రొటీన్ కథని నమ్ముకొని కోట్లు ధారబోశారు నిర్మాతలు. ఇందులో కథపై నమ్మకం కంటే.. తనయుడ్ని హీరోగా చూసుకోవాలన్న ఆశ ఎక్కువగా కనిపిస్తోంది. తండ్రిని దారుణంగా మోసం చేసినవాళ్లపై ఓ కొడుకు తీర్చుకొనే ప్రతీకారం ఇది. రాఘవేంద్రరావు ఇరవై ఏళ్ల క్రితం వాడేసిన ఫార్ములా కథ. దానికి హంగులూ, ఆర్భాటాలూ జోడించి ఏదో వన్నె తెచ్చే ప్రయత్నం చేశారు. ఓ యువకుడు మాస్క్ ధరించి, మర్డర్లు చేసి, లైవ్‌లో చూపించడం అనేది కాస్త ఆసక్తిరమైన విషయమే. దాన్ని ఇంకాస్త పకడ్బందీగా చూపించాల్సింది.
శాటిలైట్ ఛానళ్లు, వాటిని వాడుకొంటూ అడ్డగోలుగా ఎదిగేస్తున్న వ్యక్తులు, వాళ్లని టార్గెట్ చేసిన హీరో.. కథ ఇలా సాగుతుందేమో అనుకొంటాం. ఆ తరవాత ఆసుపత్రుల్లో వ్యాపారం మీద కథ సాగుతుంది. పోనీ.. శంకర్ స్థాయిలో డాక్టర్ గిరీ టైపు కథ అనుకొంటే అదీ లేదు. చివర్లో ఓ ఫ్లాష్ బ్యాక్ చెప్పి, అందుకోసమే ఇక్కడికి వచ్చా అని హీరో చేత చెప్పించడం ఉసూరుమనిపిస్తుంది. హీరో, విలన్.. హీరో - సీబీఐ ఆఫీసర్ ఎత్తుకు పై ఎత్తులు వేసుకొంటూ వెళ్తే టామ్ అండ్ జర్రీ సినిమాలా సాగేదేమో. కనీసం తరవాత ఏం జరుగుతుందో అన్న ఉత్కంఠత అయినా కలిగేది. అది జాగ్వార్‌లో మిస్ అయ్యింది.
ఫ్లాష్ బ్యాక్ చెప్పడం కోసం శుభం కార్డు వరకూ ప్రేక్షకుల్ని ఎదురుచూసేలా చేయడం దారుణమే. పైగా హీరో ఎవరు, ఎందుకు వచ్చాడు అనేవి ఇన్వెస్టిగేషన్‌లో తేలవు. అవన్నీ.. విలన్ నోటి నుంచే చెప్పిస్తారు. విలన్ చేసిన అన్యాయాలు హీరో ఎదురుగుండా చెబుతుంటే.. వాటిని కెమెరాలో బంధించి, లైవ్‌లో చూపించడం.. ఎప్పటి ఫార్ములా..?? ఓ రొటీన్ కథకు అన్ని రకాలైన కమర్షియల్ హంగులు ఇచ్చి, నానా హడావుడి చేసి, ఎలాగైనా సరే తనయుడ్ని ఓ కమర్షియల్ హీరోగా చూసుకొందాం అనుకొని కుమారస్వామి చేసిన విశ్వ ప్రయత్నమిది. అయితే.. అది ఏమాత్రం వర్కవుట్ కాలేదు. ఇంతింత డబ్బు పోస్తే.. హంగులు, ఆర్భాటాలూ వస్తాయేమో? కథ రావాలంటే మాత్రం బుర్ర వాడాలి. రొటీన్ కథని తెలివిగా చూపించాలంటే ఆ బుర్రకి పదును పెట్టాలి. అది.. జాగ్వార్‌లో మిస్సయ్యింది.
* నటీనటుల ప్రతిభ
నిఖిల్‌కి మంచి కాస్ట్యూమ్స్ వేశారు. మేకప్ కి బాగా ఖర్చు పెట్టారు. బిల్డప్పులు కావల్సినన్ని ఇచ్చారు. పాపం.. తాను కూడా డాన్సులు, ఫైట్లూ అంటూ ఏదో కష్టపడ్డాడు. అయితే నిఖిల్‌ని హీరో అనుకోవడం తెలుగు ప్రేక్షకులకు కాస్త ఇబ్బందే. విశాల్ లాంటి వాళ్లను తెలుగు ప్రేక్షకులు బాగానే ఒప్పుకొన్నారు. విశాల్ నల్లగా ఉన్నా ఓ కళ ఉంటుంది. నిఖిల్ హీరోగా ఒప్పుకోవాలంటే ఈ సినిమా ఒక్కటీ సరిపోదు. మళ్లీ మళ్లీ చేస్తూనే ఉండాలి. చూస్తూ. చూస్తూ.. అలవాటైపోవొచ్చు. నటన విషయంలో ఓకే అనిపిస్తాడు. మరీ క్లోజప్ షాట్స్ మాత్రం కష్టం. ఈ సినిమాలో కథానాయిక ఉందా? అనే అనుమానం వేస్తుంటుంది. అదేంటో పాటకు ముందు మాత్రం టంచనుగా వస్తుంది. నిఖిల్ కంటే అందంగా ఉంటే మాకొద్దు.. అనుకొని దీప్తిని తీసుకొన్నారేమో? జగపతిబాబు లాంటి నటుడ్ని ఎలా వాడుకోవాలో దర్శకుడికి అర్థం కాలేదు. రమ్యకృష్ణ పాత్ర పరిధి కూడా తక్కువే. సంపత్‌రాజ్ అలవాటైన విలనిజంతో అల్లుకుపోయాడు. కానీ అంత శక్తిమంతుడు కూడా హీరో ముందు హ్యాండ్సప్ అయిపోతాడు. బ్రహ్మానందం శక్తికిమించి కష్టపడ్డా.. నవ్వులు పంచలేకపోయాడు.
* సాంకేతికంగా
రూ.70 కోట్లతో తీసిన సినిమా ఇది. అంత ఖర్చు పెట్టాక సినిమా ఎలా ఉండాలో అలానే ఉంది. యాక్షన్ సీన్స్ ని బాగా తీశారు. రోడ్లపై ఛేజింగులు హాలీవుడ్ స్థాయిలోనే ఆకట్టుకొంటాయి. తమన్‌సంగీతం, మనోజ్ పరమహంస ఫొటోగ్రఫీ బాగున్నాయి. అయితే.. మహదేవ్ ఈ కథని కమర్షియల్ సూత్రాలకు తగినట్టుగా నడిపించినా... కొత్తదనం ఏం చూపించలేకపోయాడు. అన్నప్రాసన రోజునే అవకాయ్ ముద్దలు కలిపి బలవంతంగా నిఖిల్ చేత తినిపించారేమో అనిపిస్తోంది. నిఖిల్ కాకుండా మరో కమర్షియల్ హీరో అయినా ఈ సినిమా ఫలితం అంతంత మాత్రంగానే ఉంటుందేమో?
* చివరగా : జాగ్వార్.. జర జాగో యార్
రేటింగ్: 1.5