తస్సాదియ్యా తమన్ కుమ్మేస్తున్నాడు!
on Jan 25, 2020
ఇవాళ టాలీవుడ్‌లో నంబర్ వన్ మ్యూజిక్ డైరెక్టర్ ఎవరంటే.. క్షణం ఆలోచించకుండా చెప్పే పేరు తమన్. అవును. 2018 వరకూ దేవి శ్రీప్రసాద్ నంబర్ వన్ మ్యూజిక్ డైరెక్టర్‌గా రాణిస్తూ రాగా, ఇప్పుడు ఆ కిరీటాన్ని తమన్ ధరించాడు. 2019 సెప్టెంబర్ ఆఖరులో విడుదలైన 'సామజవరగమన' అనే పాట సృష్టించిన ప్రభంజనం సద్దుమణగక ముందే, అక్టోబర్‌లో వచ్చిన 'రాములో రాములా' సాంగ్ దుమ్ము రేపేసింది. అల్లు అర్జున్, త్రివిక్రమ్ కాంబినేషన్‌లో వచ్చిన 'అల.. వైకుంఠపురములో' సినిమాలోని ఈ రెండు పాటలతో తమన్ టాప్ రేంజికి చేరుకున్నాడు. ఆ రెండు పాటలూ అతి స్వల కాలంలో యూట్యూబ్‌లో 150 మిలియన్ వ్యూస్ దాటిన పాటలుగా తెలుగు సినీ సంగీత ప్రపంచంలో సరికొత్త చరిత్రను సృష్టించాయి.
'అల.. వైకుంఠపురములో' సినిమా ఆడియెన్స్ ముందుకు రాకమునుపే అది మ్యూజికల్ హిట్టనే విషయం తేలిపోయింది. ఆ రెండు పాటల స్థాయిలో సెన్సేషన్ కాకపోయినా 'ఓ మై గాడ్ డాడీ', 'బుట్టబొమ్మ' పాటలూ శ్రోతల్ని అలరించాయి. ఇక సినిమా రిలీజయ్యాక 'సిత్తరాల సిరపడు' పాట సూపర్ హిట్టయింది. మొత్తంగా 'అల.. వైకుంఠపురములో' బ్లాక్‌బస్టర్ హిట్టవడంలో తమన్ సమకూర్చిన మ్యూజిక్ ప్రధాన పాత్ర పోషించింది. అలాగే 2019లో తమన్ మ్యూజిక్ అందించగా విడుదలైన వెంకటేశ్-నాగచైతన్య సినిమా 'వెంకీమామ', సాయితేజ్-మారుతి మూవీ 'ప్రతిరోజూ పండగే' పాటలూ సంగీత ప్రియుల్ని అలరించాయి. వాటికి తమన్ ఇచ్చిన బ్యాగ్రౌండ్ స్కోరూ ఆకట్టుకుంది. అంటే సంగీతపరంగా 2019 తమన్ నామ సంవత్సరంగా పేరు తెచ్చుకుంది.
ఇక 2020 సంవత్సరంలో తమన్ డైరీలో ఒక్కరోజు కూడా ఖాళీ లేదు. ఇప్పటికే మనకు తెలిసి తొమ్మిది సినిమాలకు అతను పనిచేస్తున్నాడు. ఇంకా ఎన్ని సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడో మనకు తెలీదు. కీర్తి సురేశ్ టైటిల్ రోల్‌లో కొత్త దర్శకుడు నరేంద్రనాథ్ రూపొందిస్తోన్న 'మిస్ ఇండియా' సినిమాకు స్వరాలు అందిస్తున్నాడు తమన్. 'ప్రతిరోజూ పండగే' వంటి హిట్ మూవీ తర్వాత సాయితేజ్ లెటెస్ట్ ఫిల్మ్ 'సోలో బ్రతుకే సో బెటర్'కూ అతను బాణీలు కూరుస్తున్నాడు. ఈ సినిమాతో సుబ్బు అనే డైరెక్టర్ ఇంట్రడ్యూస్ అవుతున్నాడు.
జనవరి 24న రిలీజైన రవితేజ సినిమా 'డిస్కో రాజా'కు ఇచ్చిన మ్యూజిక్‌తో మరోసారి మెరిసిన తమన్, ఇప్పుడు అదే హీరో చేస్తోన్న లేటెస్ట్ ఫిల్మ్ 'క్రాక్'కు సంగీతం అందిస్తున్నాడు. ఈ మూవీకి గోపీచంద్ మలినేని దర్శకుడు. ఇక తమన్ తొలిసారి హీరో నానితో కలిసి పనిచేస్తోన్న సినిమా 'టక్ జగదీష్'. శివ నిర్వాణ డైరెక్ట్ చేస్తొన్న ఈ మూవీ మ్యూజిక్ సిట్టింగ్స్ ఇటీవలే జరిగాయి. వరుణ్ తేజ్ హీరోగా నూతన దర్శకుడు కిరణ్ కొర్రపాటి రూపొందిస్తోన్న సినిమాకు సంగీతం అందిస్తోంది తమనే. పవన్ కల్యాణ్ కంబ్యాక్ మూవీ 'పింక్' రీమేక్‌కు పనిచేస్తోన్న అతను ఇప్పటికే ఐదు పాటలకు ట్యూన్స్ ఇచ్చేశాడు. ఇది పీకేతో అతని ఫస్ట్ కొలాబరేషన్ కావడం గమనార్హం.
బాలకృష్ణ, బోయపాటి కాంబినేషన్‌లో తయారవుతున్న సినిమాకూ తమన్ సంగీతం సమకూరుస్తున్నాడు. 'డిక్టేటర్' సినిమా తర్వాత అతను బాలకృష్ణతో పనిచేస్తోంది ఇప్పుడే. మహేశ్ హీరోగా నటించనున్న 27వ సినిమాకు తమన్ సంగీతం అందిస్తున్నాడనే వార్త ఆ హీరో ఫ్యాన్స్‌ను ఆనందపరుస్తోంది. వంశీ పైడిపల్లి ఈ సినిమాని డైరెక్ట్ చేస్తున్నాడు. 'దూకుడు', 'బిజినెస్‌మేన్', 'ఆగడు' సినిమాల తర్వాత మహేశ్ సినిమాకు తమన్ సంగీతం అందివ్వబోతున్నాడు. ఇక 'అల.. వైకుంఠపురములో' వంటి బ్లాక్‌బస్టర్ తర్వాత త్రివిక్రమ్ తీయనున్న సినిమాకీ తమన్ పనిచేయనున్నాడని వినిపిస్తోంది. ఇందులో జూనియర్ ఎన్టీఆర్ హీరో. ఇదివరకు ఈ ముగ్గురి కాంబినేషన్‌లో 'అరవింద సమేత' వచ్చిన విషయం తెలిసిందే.
కొంత కాలం క్రితం వరకు కాపీ మ్యూజిక్ అందిస్తున్నాడనీ, తన హిట్ ట్యూన్స్‌నే మళ్లీ మళ్లీ కొడుతున్నాడనీ విమర్శలను ఎదుర్కొన్న తమన్ ఇవాళ.. ఆ అపకీర్తి నుంచి బయటపడి, శ్రోతల్ని రంజింపజేసే బాణీలతో టాప్ మ్యూజిక్ డైరెక్టరుగా నీరాజనాలు అందుకుంటున్నాడు. డైరెక్టర్ల మనసు తెలుసుకొంటూ, అప్పటికప్పుడు బాణీలు సృష్టిస్తూ వాళ్లను ఆనందపరుస్తున్నాడు. అందుకే ఇవాళ తమన్ తమకు ఫ్లెక్సిబుల్‌గా ఉంటాడని చాలామంది డైరెక్టర్లు భావిస్తున్నారు. మంది ఎక్కువైతే మజ్జిగ పలచన అవుతుందనేది సామెత. కానీ, పదకొండేళ్ల కాలంలోనే వంద సినిమాలు పూర్తిచేసేసిన తమన్ ఆ సామెతను తిరగరాస్తున్నాడు. సినిమాలు ఎక్కువైనా తన బాణీలలోని మార్దవం తగ్గదని నిరూపిస్తున్నాడు. సమీప భవిష్యత్తులో తన కీబోర్డుతో ఇంకెన్నో మ్యాజికల్ ట్యూన్స్ అందిస్తాడనీ, మనల్ని ఆ బాణీల ప్రవాహంలో ఓలలాడిస్తాడనీ చెప్పడానికి సందేహపడాల్సింది లేదు.
- బుద్ధి యజ్ఞమూర్తి