ENGLISH | TELUGU  

సొసైటీ నుంచి రాహుల్ సిప్లిగంజ్‌కు స‌పోర్ట్ ఏదీ?

on Mar 12, 2020

 

సింగ‌ర్‌, 'బిగ్ బాస్ 3' విన్న‌ర్ రాహుల్ సిప్లిగంజ్‌పై కొంత‌మంది దాడిచేసి గాయ‌ప‌ర్చిన ఘ‌ట‌న హెడ్‌లైన్స్‌లో నిలిచింది. ఆ దాడికి సంబంధించిన వీడియో క్లిప్స్ ఆన్‌లైన్‌లో, సోష‌ల్ మీడియాలో హ‌ల్‌చ‌ల్ చేశాయి. ఒక‌త‌ను బీర్ బాటిల్‌తో రాహుల్ త‌ల‌పై కొడితే, ఇంకొక‌త‌ను అత‌ని ముఖంపై పిడిగుద్దులు కురిపించ‌డం చూసిన‌వాళ్లంతా రాహుల్‌పై సానుభూతి ప్ర‌క‌టించారు. వార్తా చాన‌ళ్ల‌కు రెండు రోజుల పాటు ఇదే ప్ర‌ధాన వార్త‌గా నిలిచింది. దాన్నొక సంచ‌ల‌న ఘ‌ట‌న‌గా అవి ప్రొజెక్ట్ చేశాయి. రాహుల్ ఫిర్యాదు మేర‌కు పోలీసులు తాండూరు ఎమ్మెల్యే పైల‌ట్ రోహిత్‌రెడ్డి త‌మ్ముడు రితేశ్‌రెడ్డి, అత‌ని స్నేహితుల‌పై మూడు నాలుగు సెక్ష‌న్ల కింద కేసు న‌మోదుచేసి, ద‌ర్యాప్తు చేస్తున్నారు. ఆ త‌ర్వాత ప్ర‌కాశ్‌రాజ్ సైతం రాహుల్‌కు మ‌ద్ద‌తు ప‌లికి, అత‌డిని ప్ర‌భుత్వ చీఫ్ విప్ దాస్యం విన‌య్ భాస్క‌ర్ వ‌ద్ద‌కు కూడా తీసుకుపోయారు. ఒక్క‌సారి ఆ ఉదంతాన్ని గ‌మ‌నిస్తే.. రాహుల్ సిప్లిగంజ్‌కు సొసైటీ నుంచి ఆశించిన మ‌ద్ద‌తు ల‌భించ‌లేద‌నే విష‌యం అర్థ‌మ‌వుతుంది. ఒక ఘ‌ట‌న‌లో బాధితుడు, సెల‌బ్రిటీ కూడా అయిన రాహుల్‌కు ఇలా జ‌ర‌గ‌డం ఎంతైనా ఆశ్చ‌ర్యాన్ని క‌లిగించే విష‌యం.

రాహుల్ విష‌యంలో టాలీవుడ్‌కు సంబంధించి ప్ర‌కాశ్‌రాజ్‌, సందీప్ కిష‌న్ వంటి ఇద్ద‌రు ముగ్గురు మిన‌హా మిగ‌తావాళ్లెవ‌రూ పెద్ద‌గా ప‌ట్టించుకోలేదు. అత‌నికి మ‌ద్ద‌తుగా ఇంకెవ‌రూ ప్ర‌క‌ట‌న‌లు ఇవ్వ‌లేదు. మిగ‌తా స‌మాజం కూడా రాహుల్‌కు మ‌ద్ద‌తుగా ముందుకు రాలేదు. ఎందుకు?  కార‌ణాల‌ను విశ్లేషిస్తే.. ప్ర‌ధానంగా క‌నిపించేవి రాహుల్‌పై దాడి జ‌రిగిన ప్ర‌దేశం, అత‌ని యాటిట్యూడ్‌, అత‌ని బాడీ లాంగ్వేజ్‌, అత‌ను మాట్లాడే తీరు. అవును.. రాహుల్‌పై దాడి జ‌రిగింది ఒక ప‌బ్‌లో. ప‌బ్‌లంటే.. వాటిపై సాధార‌ణ ప్ర‌జానీకానికి ఉండే అభిప్రాయం ఏమిటో తెలియంది కాదు. విచ్చ‌ల‌విడిత‌నానికీ, విశృంఖ‌ల‌త్వానికీ కేంద్రాలుగా ప‌బ్‌ల‌కు పేరుంది. భార‌తీయ సంస్కృతిని ప‌బ్‌లు నాశ‌నం చేస్తున్నాయ‌ని చాలామంది అభిప్రాయం. ఆడ‌వాళ్లు కూడా మ‌గ‌వాళ్ల‌తో క‌లిసి తాగి తంద‌నాలుడుతుంటార‌నీ, సామాజికంగా అభ్యంత‌ర‌క‌ర‌మ‌నుకొనే ప‌నులు అక్క‌డ ఆడామ‌గా క‌లిసి చేస్తుంటార‌నీ పేరుంది. 

ఘ‌ట‌న జ‌రిగిన రోజు రాహుల్ సిప్లిగంజ్ సైతం దాదాపు అర్ధ‌రాత్రి స‌మ‌యంలో ఒక స్నేహితురాలితో క‌లిసి అక్క‌డ‌కు వెళ్లాడు. అక్క‌డ డాన్సులు చేశాడు. త‌న‌మీద ఎవ‌రైతే దాడిచేశారో, వాళ్ల‌తో వాగ్వివాదానికి దిగాడు. మాటా మాటా పెరిగి త‌న్నులాట దాకా వెళ్లింది. మొత్తానికి అవ‌త‌లి ప‌క్షం వాళ్లు ఎక్కువ‌మంది ఉండ‌టం, వాళ్లు ఓవ‌ర్‌గా రియాక్ట‌యి బీరు బాటిల్‌తో రాహుల్ త‌ల‌పై కొట్ట‌డం, అత‌ని ముఖంపై పిడిగుద్దులు కురిపించ‌డం వీడియో క్లిప్‌లో మ‌నం చూశాం. అక్క‌డున్న మిగ‌తావాళ్లు జోక్యం చేసుకొని ఆప‌క‌పోతే రాహుల్‌కి మ‌రిన్ని దెబ్బ‌లు త‌గిలేవి.

 

ఘ‌ట‌న జ‌రిగిన మ‌రుస‌టి రోజు రాహుల్ మీడియాతో మాట్లాడాడు. అప్పుడు అత‌ని మాట‌తీరు, బాడీ లాంగ్వేజ్‌, యాటిట్యూడ్ ఎలా ఉందో అంద‌రం చూశాం. ప‌బ్‌కు ఎందుకు వెళ్లార‌ని ఒక రిపోర్ట‌ర్ అడిగితే, "మీరు బార్‌కు వెళ్తారు, నేను ప‌బ్‌కు వెళ్తాను" అని చెప్ప‌డం అత‌ని యాటిట్యూడ్‌ను ప‌ట్టిచ్చే విష‌యం. మేం బార్‌కు వెళ్తామ‌ని నీకెవ‌రు చెప్పార‌ని అడిగితే, "నేను జ‌న‌ర‌ల్‌గా చెప్పాను" అన్నాడు రాహుల్‌. మీడియాతో మాట్లాడినంత సేపూ అత‌ని బాడీ లాంగ్వేజ్‌లో ఎక్క‌డా బాధితుడ‌న్న‌ట్లు క‌నిపించ‌లేదు. అంత‌కు మించి ఒక నిర్లక్ష్య ధోర‌ణి క‌నిపించింది. తాను త‌ప్పుచెయ్య‌లేద‌నే ఆత్మ‌విశ్వాసం క‌నిపించ‌డం వేరు, నిర్ల‌క్ష్య ధోర‌ణి వేరు. మీడియాతో అత‌ని ఇంట‌రాక్ష‌న్ వీడియో చూసిన‌వాళ్లు అత‌ని వైఖ‌రి చూసి ఆశ్చ‌ర్య‌పోయారు. ఇదేమిటి.. ఇత‌ను ఇలా మాట్లాడుతున్నాడు, అత‌ని ధోర‌ణి ఇలా ఉందేమిటి? అనుకున్న‌వాళ్లే ఎక్కువ‌మంది. త‌న‌కు న్యాయం జ‌రిగేదాకా పోరాడ‌తాన‌నీ, ఈ విష‌యంలో కాంప్ర‌మైజ్ కాన‌నీ అత‌ను తెలిపాడు.

ఆ త‌ర్వాత అత‌ను మంత్రి కేటీఆర్‌ను ట్యాగ్ చేస్తూ చేసిన ట్వీట్ కూడా వివాద‌మైంది. తానెప్పుడూ టీఆర్ఎస్ వైపే ఉన్నాన‌నీ, ఇక్క‌డ పుట్టాను కాబ‌ట్టి ఆ పార్టీకే ఓటేశాన‌ని చెబుతూ, త‌న‌కు న్యాయం కావాల‌ని డిమాండ్ చేశాడు. ఇక్క‌డ పుట్టిన‌వాళ్లు టీఆర్ఎస్‌కు కాకుండా వేరే పార్టీకి ఓటేయ‌కూడ‌ద‌న్న ధోర‌ణి అత‌ని ట్వీట్‌లో క‌నిపించింది. అంతేకాదు, తాను టీఆర్ఎస్ పార్టీ కాబ‌ట్టి త‌న‌కు న్యాయం చెయ్యాల‌ని అడుగుతున్న‌ట్లుగా ఉంది. టీఆర్ఎస్ కాకుండా వేరే పార్టీ వాళ్ల‌కు ఇలాంటి ఘ‌ట‌న ఎదురైతే న్యాయం చెయ్య‌మ‌ని కేటీఆర్‌ను అడ‌క్కూడ‌ద‌న్న మాట‌.

ఇలాంటి ధోర‌ణి వ‌ల్లే రాహుల్‌ను స‌మ‌ర్థిస్తూ సినిమా ఫీల్డ్‌కు చెందిన‌వాళ్లెవ‌రూ బ‌హిరంగంగా ముందుకు రాలేదు, ఒక్క ప్ర‌కాశ్‌రాజ్ త‌ప్ప‌. ఆయ‌నైనా ఎందుకు వ‌చ్చారంటే.. రాహుల్‌పై బీజేపీవాళ్లు విమ‌ర్శ‌లు చేశారు కాబ‌ట్టి. "రాహుల్‌కు ఎవ‌రూ లేర‌నుకోవ‌ద్దు, నేనున్నాను, ప‌బ్‌ల‌కు వెళ్ల‌డం త‌ప్పా?".. అంటూ ఆయ‌న మాట్లాడారు. ఆయ‌న రాహుల్ ప‌క్షం నిల్చోడానికి ఇంకో కార‌ణం కూడా ఉంది.. అది కృష్ణ‌వంశీ సినిమా 'రంగ మార్తాండ‌'లో ప్ర‌కాశ్‌రాజ్ ప్ర‌ధాన పాత్ర చేస్తుంటే, రాహుల్ ఒక కీల‌క పాత్ర చేస్తున్నాడు. స‌హ న‌టునిగా కూడా ప్ర‌కాశ్‌రాజ్ స్పందించాడ‌న్న మాట‌. ఆయ‌న రాహుల్‌కు మ‌ద్ద‌తుగా స్పందించ‌డాన్ని అభినందిచాల్సిందే. కానీ ఆ మ‌ద్ద‌తు తోటి సంగీత‌కారుల నుంచీ, సినీ రంగం నుంచీ రాక‌పోవ‌డానికి కార‌ణం రాహుల్ ధోర‌ణేన‌ని ఎక్కువ మంది చెప్తున్న మాట‌.

Cinema Galleries

Latest News


Video-Gossips

Disclaimer:
All content on this website—including text, images, videos, graphics, and audio—is the property of ObjectOne Information Systems Ltd. or its associates. Unauthorized reproduction, distribution, modification, or publication of any material is strictly prohibited without prior written consent.