బాలయ్య దూకుడు... మే నుండి మరో సినిమా!
on Mar 12, 2020
విరామం, విశ్రాంతి లేకుండా... తోటి హీరోలతో పోలిస్తే వేగంగా సినిమాలు చేసే సీనియర్ స్టార్ హీరో నందమూరి బాలకృష్ణ. గత ఏడాది డిసెంబర్ నెలలో 'రూలర్' విడుదల చేసిన ఆయన... ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నారు. దీని తర్వాత చేయబోయే సినిమానూ అప్పుడే ఖరారు చేశారు నందమూరి బాలకృష్ణ. బోయపాటి సినిమా పూర్తి చేసిన వెంటనే... మే నెలలో మరో సినిమా షూటింగ్ స్టార్ట్ చేయనున్నారని ఫిలిం నగర్ టాక్.
నటసింహం నందమూరి బాలకృష్ణ, దర్శకుడు బి.గోపాల్ ది సూపర్ డూపర్ బ్లాక్ బస్టర్ కాంబినేషన్. బాలయ్య కెరీర్ లో భారీ విజయాలు 'సమరసింహా రెడ్డి', 'నరసింహ నాయుడు' అందించిన దర్శకుడిగా బి.గోపాల్ కి మంచి పేరుంది. ఆ రెండు సినిమాల తరువాత వచ్చిన 'పలనాటి బ్రహ్మనాయుడు' ఆశించిన విజయం సాధించలేదు. అయితే ఆ రెండు చిత్రాలకు ముందు 90 వ దశకంలో బాలయ్యను 'లారీ డ్రైవర్', 'రౌడీ ఇన్స్పెక్టర్'గా చూపించిన దర్శకుడు బి. గోపాలే. అయితే... ఇప్పుడు ఆయన ఫామ్ లో లేరు. అయినా ఆయనపై బాలకృష్ణ నమ్మకం ఉంచారు. గతంలో తనకు భారీ విజయాలు అందించిన దర్శకుడికి మరో అవకాశం ఇచ్చారు. ఆల్రెడీ ఈ సినిమా స్క్రిప్ట్ వర్క్ దాదాపుగా ఓ కొలిక్కి వచ్చిందట. బోయపాటి సినిమా షూటింగ్ కంప్లీట్ అయిన వెంటనే సెట్స్ మీదకు తీసుకువెళ్లాలని బాలకృష్ణ భావిస్తున్నారట.