సుశాంత్, రియా మధ్య ఎలాంటి డబ్బు లావాదేవీలు జరగలేదు!
on Oct 10, 2020
మృతుడైన సుశాంత్‌సింగ్ రాజ్‌పుత్ కేసును మూడు భిన్న కేంద్ర సంస్థలు దర్యాప్తు చేస్తున్నాయి. సుశాంత్‌కు సంబంధించిన రూ. 15 కోట్లను రియాతో పాటు సుశాంత్ ఫ్లాట్‌మేట్లు కలిసి స్వాహా చేశారని అతని ఫ్యామిలీ ఆరోపించి, ఆ మేరకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఈ ఆరోపణలపై మానీలాండరింగ్ కోణంలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డిపార్ట్‌మెంట్ (ఈడీ) దర్యాప్తు చేస్తూ వస్తోంది. అయితే ఇంతవరకూ, సుశాంత్ అకౌంట్ నుంచి రియా అకౌంట్‌కు ఎలాంటి అనుమానిత లావాదేవీలు ఈడీకి లభించలేదు.
ఈ విషయాన్ని ఈడీ వర్గాలు ధ్రువీకరించినట్లు ముంబై మిర్రర్ టాబ్లాయిడ్ తెలియజేసింది. సుశాంత్ కుటుంబానికి అతని ఆర్థిక లావాదేవీల గురించి ఏమీ తెలీదని కూడా ఆ వర్గాలు తెలియజేశాయి. సుశాంత్ బ్యాంక్ అకౌంట్ల నుంచి కానీ, అతని ఆర్థిక కార్యకలాపాల విషయంలో కానీ, ఫండ్స్ విషయంలో కానీ ఈడీకి ఎలాంటి అనుమానిత ఆధారాలు లభించలేదని ఆ వర్గాలు చెప్పాయి.
సుశాంత్ తన ఆర్థిక వ్యవహారాలు ఎలా చేసేవాడు, అతని దగ్గర ఎంత డబ్బుంది అనే విషయాలేవీ ఫ్యామిలీకి తెలీవు. ఉదాహరణకు తన పేమెంట్స్ కానీ, టాక్సులు కానీ సుశాంత్ చార్టర్డ్ అకౌంటెంట్ ద్వారానే చేసేవాడు. ఇవి ఫ్యామిలీకి తెలీవని ఈడీ వర్గాలు వెల్లడించాయి. అయితే అతని ఫండ్స్ నుంచి చాలా స్వల్ప మొత్తంలో డబ్బు మిస్సయ్యిందనీ, దానికి సంబంధించిన లెక్కలు కనిపించడం లేదని మాత్రం తెలిసింది. ఏదేమైనప్పటికీ సుశాంత్, రియా బ్యాంక్ అకౌంట్ల మధ్య ఎలాంటి అనుమానిత లేదా పరోక్ష లావాదేవీలు జరగలేదనే విషయం రూఢి అయ్యిందనేది ఈడీ వర్గాలు చెబుతున్న మాట.

Also Read
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
