మహేశ్, బన్నీని కన్విన్స్ చేశాం: దిల్ రాజు
on Jan 4, 2020
ముందు అనుకున్నట్లుగానే మహేశ్ 'సరిలేరు నీకెవ్వరు' మూవీ జనవరి 11న, అల్లు అర్జున్ 'అల.. వైకుంఠపురములో' సినిమా జనవరి 12న విడుదల కానున్నాయి. కొన్ని రోజులుగా 'అల.. వైకుంఠపురములో' మూవీ జనవరి 10న విడుదలవుతుందంటూ సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే ఈరోజు మళ్లీ ఆ రెండు సినిమాల నిర్మాతలతో సమావేశమైన ప్రొడ్యూసర్స్ గిల్డ్.. మునుపటి విడుదల తేదీలకే కట్టుబడి ఉండేలా వారిని ఒప్పించింది. హీరోలూ అందుకు అంగీకరించారు. ఈ విషయాన్ని గిల్డ్ తరపున దిల్ రాజు తెలిపారు. తన సంస్థ కార్యాలయంలో ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో ఆయన రెండు సినిమాల క్లాష్‌పై మాట్లాడారు.
"గత నాలుగైదు రోజుల నుంచీ 'సరిలేరు నీకెవ్వరు', 'అల.. వైకుంఠపురములో' సినిమాల రిలీజ్ గురించి సోషల్ మీడియాలో చిన్న డిస్కషన్ జరుగుతోంది. ఆ రెండు సినిమాల రిలీజ్ డేట్ జనవరి 12 అని ప్రకటించినప్పుడు ప్రొడ్యూసర్స్ గిల్డ్ రెండు సినిమాల నిర్మాతలతో మాట్లాడి రిలీజ్ డేట్స్‌ను ఫైనల్ చేసింది. దాని ప్రకారం 'సరిలేరు నీకెవ్వరు' జనవరి 11న, 'అల.. వైకుంఠపురములో' జనవరి 12న రిలీజ్ కావడానికి వాటి నిర్మాతలు అంగీకరించారు. అయితే నాలుగైదు రోజులుగా 'అల.. వైకుంఠపురములో' జనవరి 10న లేదా 11న విడుదలవుతుందంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. దాంతో మళ్లీ ఈరోజు ఆ రెండు సినిమాల నిర్మాతల్ని కూర్చోపెట్టి ప్రొడ్యూసర్స్ గిల్డ్ మాట్లాడింది. వాళ్లను కన్విన్స్ చేయడం జరిగింది. ఏవైనా పెద్ద సినిమాలు రిలీజ్ అవుతున్నప్పుడు అందరూ బాగుండాలనేది గిల్డ్ ఉద్దేశం. అందుకే గతంలో ఇలాంటి పరిస్థితే ఉత్పన్నమైనప్పుడు ఆ ప్రొడ్యూసర్స్‌ను కూర్చోపెట్టి పరిష్కరించింది. ఇప్పుడు మళ్లీ సమస్య రావడంతో ప్రొడ్యూసర్స్‌నీ, హీరోల్నీ కన్విన్స్ చేసి ఇదివరకు అనుకున్నట్లే అవి రిలీజ్ కావడానికి అంగీకరించేలా చేసింది. ఈ సంక్రాంతికి మరో రెండు సినిమాలు కూడా వస్తున్నాయి. అన్ని సినిమాలూ బాగా ఆడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇండస్ట్రీలో ఎప్పుడైనా ఇలాంటి సమస్యలొచ్చినప్పుడు గిల్డ్ తరపున ముందుండి వాటిని సాల్వ్ చెయ్యడానికి ప్రయత్నిస్తాం. ఆల్రెడీ ఒకసారి నిర్ణయించిన తర్వాత మళ్లీ సమస్య ఎందుకొచ్చిందనే దానిపై కారణాలు వెతకదలచుకోలేదు. అంత డెప్త్‌గా మేము వెళ్లం. సినిమాల్ని ప్రొటెక్ట్ చేయడమే మా ధ్యేయం. రెండు పెద్ద సినిమాలు ఒకే రోజు రిలీజైతే రెవెన్యూ రాదు. రెండు సినిమాలకూ రెవెన్యూ రావాలనేదే మా కోరిక. డిస్ట్రిబ్యూటర్ల మాటలు ఎవరు వింటారండీ? అవన్నీ మాట్లాడుకోడానికే ఉంటాయ్. అవి నిజాలు కావు. మేం ముందు అనుకున్నట్లుగానే ఎవరి డేట్‌కు వాళ్లు కట్టుబడివుండేలా ఒప్పించాం. సినిమా ఇండస్ట్రీలో ప్రధానంగా ఆర్థికపరమైన అంశాలే ఎక్కువగా ఉంటాయి. ప్రొడ్యూసర్, డిస్ట్రిబ్యూటర్, ఎగ్జిబిటర్, టెక్నిషియన్, ఆర్టిస్ట్ ఎవరికైనా సమస్యలొచ్చేది ఆర్థికపరమైన అంశాల్లోనే. సక్సెస్ రేట్‌ను ఎలా పెంచాలి, రెవెన్యూ ఎలా తీసుకురావాలి అనేది గిల్డ్ పని. ఒక సినిమా ద్వారా వీలైనంత రెవెన్యూ ఎలా జనరేట్ చెయ్యాలనేది చూస్తాం. ఇలాంటి క్లాషెస్ వల్ల వచ్చే రెవెన్యూ ఆగిపోతుంది. అది ఆగిపోవడం కరెక్ట్ కాదు. ప్రతి సినిమా ఆడుతుందనే తీస్తాం. కానీ కొన్నే ఆడతాయి. పండగలున్నప్పుడు, ఇతర సినిమాల డేట్స్‌తో క్లాష్ అయినప్పుడు మేమిలా జోక్యం చేసుకొని, సమస్యకు పరిష్కారం చూపుతాం. సంక్రాంతికి వస్తున్న నాలుగు సినిమాలకూ నేను డిస్ట్రిబ్యూటర్‌ను కావడం.. బహుశా ఎనిమిదో వింత" అని వివరించారు దిల్ రాజు. ఈ సమావేశంలో మరో నిర్మాత, గిల్డ్ ప్రతినిధి కె.ఎల్. దామోదర్‌ప్రసాద్ కూడా పాల్గొన్నారు.
Also Read