వేడెక్కిన సంక్రాంతి పోరు.. ఒకేరోజున వస్తోన్న మహేష్, బన్నీ!!
on Jan 4, 2020
సంక్రాంతికి పెద్ద సినిమాలు సందడి చేయడం చూస్తుంటాం. స్టార్ హీరోలు నువ్వానేనా అన్నట్టుగా తలపడి బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తుంటారు. అయితే ఈసారి సంక్రాంతి పోరు మరింత రసవత్తరంగా సాగనుంది. ఒకేరోజు రెండు పెద్ద సినిమాలు పందెంకోళ్లు లాగా తలపడే అవకాశముంది. ఒకటి మహేష్ బాబు- అనిల్ రావిపూడి కాంబినేషన్ లో వస్తోన్న 'సరిలేరు నీకెవ్వరూ' మూవీ కాగా, మరొకటి అల్లు అర్జున్- త్రివిక్రమ్ కాంబినేషన్లో వస్తోన్న 'అల వైకుంఠపురంలో' మూవీ. ఈ రెండు సినిమాలు జనవరి 11 న విడుదలై.. శీతాకాలాన్ని వేసవికాలంగా మార్చే అంత వేడి పుట్టించనున్నాయి.
వాస్తవానికి ఈ రెండు సినిమాలు సంక్రాంతికి విడుదల అని ముందే ప్రకటించారు.. కానీ, ఒకే రోజు విడుదల అనుకోలేదు. 'సరిలేరు నీకెవ్వరూ'ని జనవరి 11 న విడుదల చేయాలని ఆ చిత్ర నిర్మాతలు ప్లాన్ చేయగా.. 'అల వైకుంఠపురంలో' మూవీని జనవరి 10 లేదా 12 విడుదల చేయాలని చిత్ర నిర్మాతలు ప్లాన్ చేశారు. అయితే ఏమైందో ఏమో కానీ.. జనవరి 11 నే విడుదల చేయాలని అల్లుఅర్జున్ పట్టుబడుతున్నాడట. స్టార్ హీరోల సినిమాలు ఒకేరోజున విడుదలైతే ఓపెనింగ్ కలెక్షన్స్ మీద చాలా ప్రభావం పడుతుంది. అందుకే స్టార్ హీరోల సినిమాల విడుదల సమయంలో నిర్మాతలు ఒక అవగాహనకి వచ్చి.. ఒకటి రెండు రోజుల గ్యాప్ తో విడుదల చేసుకుంటూ ఉంటారు. అయితే ఈసారి ఏమైందో కానీ ఇద్దరు స్టార్ హీరోల సినిమాలు ఒకేరోజున విడుదలయ్యేలా ఉన్నాయి. మరోవైపు ఓ ప్రముఖ నిర్మాత.. ఈ రెండు సినిమాల విడుదల తేదీల మధ్య రాజీ కుదిర్చే ప్రయత్నం చేస్తున్నారట. మరి ఏం జరుగుతుందో చూడాలి.
Also Read